‘అంతా బ్రాంతియేనా.. ‘! అలనాటి గాయని కన్నుమూత.

హైదరాబాద్:
అలనాటి ప్రముఖ గాయని రాణి చనిపోయారు. దేవదాసు చిత్రంలో “అంతా బ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా” పాటతో పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూడలేదు. ఒక్క తెలుగు భాషలోనే 500 పాటలు పాడారు. శ్రీలంక జాతీయ గీతం పాడింది కూడా ఈమె. చిన్న వయస్సులోనే సంగీతం నేర్చుకున్నారు. ఆ తర్వాత పాటలు పాడటం ప్రారంభించారు. ఎన్టీఆర్, ఏన్నార్ కాలంలో గాయనిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తన 8వ సంవత్సరం నుంచే పాటలు పాడటం ప్రారంభించారు. 1943లో జన్మించారు రాణి. 75 ఏళ్ల వయస్సు. రూపవతి అనే తెలుగు సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. దేవదాస్ సినిమాలో అంతా బ్రాంతియేనా అనే పాటతో తిరుగులేని రాణిగా వెలుగొందారు. లవకుశ సినిమాలో పాడిన పాటలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. బాటసారి, జయసింహ, ధర్మదేవత మూవీస్ మంచి గుర్తింపు తెచ్చాయి. ఒక్క తెలుగులోనే కాకుండా మళయాళం, తమిళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లోనే వందల సంఖ్యలో పాటలు పాడారు.
తెలుగు కంటే తమిళంలోనే గాయనిగా రాణికి మంచి గుర్తింపు వచ్చింది. తమిళ ఆరాధ్య నాయకుడు కామరాజ్ అయితే.. రాణికి వీరాభిమాని. ఆమెను ఇన్నిసాయ్ రాణి అనే బిరుదుతో సత్కరించారు. రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్న సమయంలో.. రాష్ట్రపతి భవన్ లో ఆమెతో పాటల కచేరీ నిర్వహించారు. చిన్న వయస్సులోనే, కెరీర్ ఉన్నతిగా ఉన్న సమయంలో సీతారామిరెడ్డిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీతోపాటు పాటలకు కూడా దూరం అయ్యారు. జూలై 13వ తేదీ శుక్రవారం రాత్రి హైదరాబాద్ యూసుఫ్ గూడలోని ఆమె కుమార్తె ఇంట్లో తుది శ్వాస విడిచారు. రాణి మృతిపై సినీ ఇండస్ట్రీతోపాటు పలువురు సంతాపం తెలిపారు.