“అందుకే ప్రణయ్ ని హత్య చేయించా”. –అమృత తండ్రి.

మిర్యాలగూడ:

తానే తన కూతురి భర్త ప్రణయ్ ని హత్య చేయించానని అమృత తండ్రి మారుతీరావు అంగీకరించారు. శుక్రవారం మిర్యాలగూడలో పట్టపగలు నడిరోడ్డుపై ప్రణయ్ అనే యువకుడిని ఓ వ్యక్తి కత్తితో నరికి చంపడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ హత్య ప్రణయ్ మామ మారుతీరావు చేయించాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. హత్య జరగడానికి అరగంట ముందే మారుతీరావు మిర్యాలగూడ నుంచి పరారయ్యాడు. శనివారం ఉదయం పోలీసులు నిందితుడు మారుతీరావుని అదుపులోకి తీసుకున్నారు. తానే ఈ హత్య చేసినట్లు అంగీకరించాడు. ప్రణయ్ అంటే నచ్చకే తాను ఈ హత్య చేయించినట్లు మారుతీరావు తెలిపాడు. తమ ఇష్టానికి వ్యతిరేఖంగా కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తమకు ఏ మాత్రం నచ్చలేదని ప్రణయ్ ను చంపడానికి 10 లక్షలతో డీల్ కుదుర్చుకొని హతమార్చినట్లు అంగీకరించారు.

“నాన్న, బాబాయ్ నమ్మించి నా భర్తను చంపేశారు” -అమృత.

కళ్లముందే భర్త ప్రణయ్ ను దారుణంగా హత్య చేయడంతో భార్య అమృత వర్షిణి షాక్ లో ఉంది. ప్రెగ్నెన్సీ పరీక్షల తర్వాత తన కళ్లముందే ప్రణయ్ హత్య జరగడంతో… షాక్ తో అదే హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది ఆమె. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను తన తండ్రే పొట్టనపెట్టుకున్నాడని తెలియడంతో.. ఆమె అంతులేని ఆవేదనకు లోనవుతోంది.“ప్రణయ్ హత్యకు ముందు నాన్న మారుతీరావు నాకు కాల్ చేశాడు. నేను బిజీలో ఉండి స్పందించలేదు. హత్య తర్వాత నేను డాడీకి కాల్ చేశాను. కానీ నాన్న నిర్లక్ష్యంగా సమాధాన మిచ్చాడు. గతంలోనే తమ ఇద్దరికీ ప్రాణహాని ఉందని ఐజీకి కంప్లైంట్ చేశాం. డాడీ, బాబాయ్ నమ్మించి ప్రణయ్ ను పొట్టన పెట్టుకున్నారు. ఎన్నోసార్లు ప్రణయ్ ను మరిచిపోవాలని డాడీ, బాబాయ్ నన్ను చిత్రహింసలు పెట్టారు. కొద్దిరోజులుగా మాతో మంచిగా ఉన్నట్టు నటించి… ప్రణయ్ ను చంపేశారు” అని ఏడుస్తూ వివరించింది అమృతవర్షిణి.