అక్టోబర్ 8,9 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ . రేపు కేంద్ర ఎన్నికల సంఘం భేటీ తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేక చర్చ

న్యూఢిల్లీ:
కేం ద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికల నిర్వహణపైనా మంగళవారం సుదీర్ఘంగా చర్చించనుంది. షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరిగే రాష్ట్రాలకం టే అసెంబ్లీ రద్దయిన రాష్ట్రానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని స్వయంగా ఎన్నికల ప్రధా న కమిషనర్ ఒపి రావత్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను సిఇఒ కార్యాలయం వచ్చే నెల 8వ తేదీన విడుదల చేయనున్నందున అదే రోజు సాయంత్రం ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉంది. నాలుగు రాష్ట్రాలతోపాటే షెడ్యూలును విడుదల చేసే అవకాశం ఉన్నప్పటికీ పోలింగ్ మాత్రం నవంబరు చివరివారంకల్లా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల ప్రత్యేక బృందం ఇప్పటికే క్షేత్రస్థాయి స్థితిగతులను, ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉన్నతాధికారుల సన్నద్ధతను వివరించింది. 4 రాష్ట్రాల ఎన్నికలపై ముగ్గురు కమిషనర్లు మంగళవారం సమావేశమై చర్చిస్తున్న సమయంలో తెలంగాణ ఎన్నికల నిర్వహణపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎనిమిది జిల్లాలకు ఇవిఎంలు చేరగా, కొన్ని జిల్లాల కు వివిపాట్‌లు కూడా చేరాయి. ఈ నెల 24 నుంచి నాలుగు రోజుల్లో బ్యాచ్‌ల వారీగా జిల్లా రిటర్నింగ్ అధికారుల మొదలు క్రిందిస్థాయి వరకు వివిపాట్‌ల వినియోగంపై శిక్షణ ఇవ్వడానికి షెడ్యూలు ఖరారైంది. ముసాయిదా ఓటర్ల జాబితాలో అవసరమైన మార్పులు చేర్పులు చేయడం కోసం గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల పరిధిలో శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలను కూడా పెట్టిన సిఇఒ కార్యాలయం ఈ నెల 25వ తేదీకల్లా అభ్యంతరాలను తెలియజేయడానికి గడువు విధించింది. వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతో షెడ్యూలు విస్తృతిని కూడా కుదించింది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన సిబ్బంది ‘ఇఆర్‌ఓ నెట్’పై రాష్ట్ర ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఇసిఐఎల్ నుంచి ఇవిఎంలపైనా, వివిపాట్‌లపైనా అవగాహన కలిగించేందుకు మరో ప్ర త్యేక కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర సిఇఓ కార్యాలయం రూపొందించింది. మరోపక్క పోలింగ్ జరిగేంత వరకు ఇవిఎం, వివిపాట్‌లను భద్రపర్చడానికి అనువైన గోడౌ న్లు, భవనాలను ఎంపికచేసే ప్రక్రియ కూడా షురూ అ యింది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే పూర్తికాగా, మరికొన్నిచోట్ల అదనపు సౌకర్యాలను కల్పించడంపై రోడ్లు భవనాల శాఖ సిబ్బంది నిమగ్నమయ్యారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 3128 పోలింగ్ కేంద్రాలకు సరిపోయే ఇవిఎం, వివిపాట్‌లను భద్రపర్చడానికి ఇప్పటికే స్టేడి యం గ్రౌండ్‌ను ఎంపికచేశారు కమిషనర్. పలు జిల్లాల్లో సైతం ఇలాంటి ప్రభుత్వ భవనాలనే సిద్ధం చేస్తున్నారు.
మరో రెండు రోజుల్లో అన్ని జిల్లాలకూ ఇవిఎంలు
మరో రెండు మూడు రోజుల్లో అన్ని జిల్లాలకూ ఇవిఎంలు, వివిపాట్‌లు చేరనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన అదనపు సిబ్బంది వీటిని పరిశీలించి, రవాణా అవుతున్న క్రమంలో దెబ్బతిన్నాయేమో పరిశీలించనున్నారు. ఆ తర్వాత రాజకీయ పార్టీల సమక్షంలో తొలి దశ తనిఖీ ప్రక్రియను పూర్తిచేసి పోలింగ్ కోసం సిద్ధం చేస్తారు. అదే సమయంలో వివిపాట్‌లను ఏ విధంగా వినియోగించాలో కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవగాహన కల్పిస్తారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై వివిధ రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణలు, ఈ నెల 25వ తేదీకల్లా వచ్చే అభ్యంతరాలు తదితరాలను పరిశీలించిన తర్వాత మరోమారు కేంద్ర ఎన్నికల బృందాన్ని హైదరాబాద్ పంపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అన్ని జిల్లాల్లో ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌ల ద్వారా రోజుకు సగటున ఎన్ని ఫోన్‌కాల్‌లు వస్తున్నా యో, ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారో, ఏ యే సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారో ఇప్పటికే సిఇఓ కార్యాలయం ఏరోజుకారోజు పర్యవేక్షిస్తూ ఉంది. అభ్యంతరాలు ఏ మేరకు వచ్చాయనేదాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధ్యయనం చేసిన తర్వాత ప్రతిపక్షాలు చేసిన విమర్శలు, ఆరోపణలపై స్పందిస్తుందని సమాచా రం. గత సార్వత్రిక ఎన్నికల నాటికే ఓటర్ల జాబితా నుంచి లక్షల సంఖ్యలో పేర్లు తొలగించబడ్డాయని, ఈ నాలుగేళ్ళలో ప్రతీ ఏటా ఓటర్ల జాబితా సవరణ జరుగుతూనే ఉందని, ఇంతకాలం ఏ రాజకీయ పార్టీ నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందలేదని సిఇఒ కార్యాలయం సిబ్బంది తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారి రాజకీయపార్టీల నుంచి ఇలాంటిఫిర్యాదులు వస్తూ నే ఉంటాయని, జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలోనూ వచ్చాయని గుర్తుచేశారు. ఎలాగూ ఓటర్ల జాబితా సవరణకు ఈ నెల 25 వరకూ గడువు ఉంది కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో జరుగుతున్న సర్వే తర్వాత ఎంతమంది ఓటర్లు కొత్తగా చేరుతారో, ఎంతమంది పేర్లను తొలగించాల్సి వస్తుందో స్పష్టత వస్తుందన్నారు.