అక్బర్ ని కార్నర్ చేసిన మహిళా జర్నలిస్టులు.

ప్రకాశ్,న్యూఢిల్లీ:

ఎడిటర్ గా ఉన్న సమయంలో తన దగ్గర పనిచేసే మహిళా జర్నలిస్టులను లైంగిక వేధించిన అక్బర్, దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న మీటూ ఉద్యమం కారణంగా తప్పించుకోలేని పరిస్థితుల్లో కార్నర్ అయిపోయారు. తమను కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి ఎంజె అక్బర్ లైంగికంగా వేధించారని ఆరుగురు మహిళా జర్నలిస్టులు ఆరోపించారు. ఎడిటర్ గా ఉన్నపుడు తమను అక్బర్ తమతో అనుచితంగా ప్రవర్తించారని సోషల్ మీడియా ద్వారా తెలిపేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వారికి ఇతర మహిళా జర్నలిస్టుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.ప్రస్తుతం నైజీరియా పర్యటనలో ఉన్న ఎంజె అక్బర్ ఈ వ్యవహారంపై ఈమెయిల్, ఫోన్, వాట్సాప్ ద్వారా అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడం లేదు. దీనిపై ప్రశ్నించబోతే కేంద్ర ప్రభుత్వంలోని ఏ మంత్రి జవాబు చెప్పకుండా మొహం చాటేస్తున్నారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మౌనం వహిస్తున్నారు. అది మంత్రి వ్యక్తిగత విషయం కనుక ఆయనే జవాబు చెబుతారని విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది. దీనిపై మహిళా జర్నలిస్టులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖాదత్ ఈ వ్యవహారంపై నిష్పాక్షిక న్యాయ విచారణ జరిపించి చట్ట ప్రకారం అక్బర్ ని శిక్షించాలని డిమాండ్ చేశారు. లైంగిక వేధింపులు నేరం అయినపుడు ప్రభుత్వం తను తీసుకొనే చర్య గురించి ప్రకటించకుండా దానిని అక్బర్ వ్యక్తిగత వ్యవహారంగా ఎలా తేల్చేస్తారని నిలదీస్తున్నారు. ప్రముఖ మహిళా టీవీ జర్నలిస్ట్ సుహాసినీ హైదర్, రోహిణీ సింగ్ ప్రభుత్వ వైఖరిని తూర్పార బడుతున్నారు. ఇక ఆయన చేసిన తప్పులు ఒప్పుకొని మంత్రి పదవి వదులుకోవడంతో పాటు శిక్షకు సిద్ధం కాక తప్పేలా లేదు.