అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఉక్కుపాదం. 20క‌ట్ట‌డాల తొల‌గింపు.

హైదరాబాద్:
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అక్ర‌మ క‌ట్టడాలు, ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపుకు ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అతిత‌క్కువ కాలంలో దాదాపు 20 అక్ర‌మ క‌ట్ట‌డాలు, శిథిల భ‌వ‌నాల‌ను తొల‌గించింది. నామ‌మాత్ర సిబ్బందితో ఉన్న ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ద్వారా 10 శిథిల భ‌వ‌నాలు, తొమ్మిది అక్ర‌మ క‌ట్ట‌డాలు, ఐదు నాలాల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించారు. విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, అక్ర‌మ క‌ట్ట‌డాల నిరోధం, ప్ర‌భుత్వ ఆస్తుల పరిర‌క్ష‌ణ‌కై దేశంలో మ‌రే న‌గ‌రంలోలేన‌ట్టి అత్యుత్త‌మ ప్ర‌మాణాల‌తో కూడిన డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్‌, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్‌పై ముంబాయి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో మాత్ర‌మే ప్ర‌త్యేక విభాగం ఉంది. ముంబాయి కార్పొరేష‌న్‌తో పోలిస్తే జీహెచ్ఎంసీలో డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్‌తో పాటు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ క‌లిపి ప‌టిష్ట‌మైన విభాగాన్ని ఏర్పాటైంది. న‌గ‌రంలో అక్ర‌మ నిర్మాణాలకు అడ్డుక‌ట్ట వేయ‌డం, ప్ర‌భుత్వ స్థ‌లాలు, చెరువుల దురాక్ర‌మ‌ణ‌ల‌ను అడ్డుకోవ‌డం, విప‌త్తులను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కునేందుకుగాను జీహెచ్ఎంసీలో ప్ర‌త్యేకంగా డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్‌, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటుచేసి ఆ విభాగానికి ఐ.పీ.ఎస్ అధికారిని డైరెక్ట‌ర్‌గా ప్ర‌భుత్వం నియ‌మించింది. డైరెక్ట‌ర్‌తో పాటు ఒక అడిష‌న‌ల్ ఎస్‌.పి, డి.ఎస్‌.పి, ఇద్ద‌రు సీఐలు, ఇద్ద‌రు ఎస్‌.ఐలు ఈ విభాగంలో ప‌నిచేస్తున్నారు. ప్ర‌స్తుతం జీహెచ్ఎంసీలో ఉన్న ఎమ‌ర్జెన్సీ బృందాల స‌హాయంతోనే అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను తొల‌గిస్తున్నారు. దీంతో పాటు న‌గ‌రంలో చెరువుల దురాక్ర‌మ‌ణ‌ల‌ను అరిక‌ట్ట‌డం, ప్ర‌భుత్వ, జీహెచ్ఎంసీ ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు ఈ విభాగంలో ప్ర‌త్యేకంగా లేక్స్‌, అసెట్స్ ప్రొటెక్ష‌న్‌, ఫోర్స్‌ను ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేయ‌నున్నారు. విప‌త్తుల స‌మ‌యంలో వెంట‌నే స్పందించ‌డానికిగాను ప్ర‌త్యేకంగా 8క్విక్‌ రెస్పాన్స్ బృందాలు, విప‌త్తుల నివార‌ణ ద‌ళాలు, లేక్స్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్‌ల‌ను ఏర్పాటు ప్ర‌క్రియ పురోగ‌తిలో ఉంది. ప్రస్తుతం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి 16వాహ‌నాలను ప్ర‌త్యేకంగా కేటాయించడంతో వీటిలో 8వాహ‌నాల‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు మ‌రో 8వాహ‌నాల‌ను డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్‌ల‌కు కేటాయించారు. జీహెచ్ఎంసీలోని స్ట్రీట్‌లైట్స్ విభాగంలో మిగులుగా ఉన్న‌ 44మంది ఔట్‌సోర్సింగ్ వ‌ర్కర్ల‌ను విజిలెన్స్ విభాగానికి కేటాయించిన‌ట్లు, వీరికి విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌తిరోజు ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇప్పిస్తున్నారు. మ‌రో రోజుల్లో మాన్సూన్‌, డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ ప‌రిక‌రాల‌ను స‌మ‌కూర్చుకునే ప్ర‌క్రియ పురోగ‌తిలో ఉంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో విప‌త్తుల నివార‌ణ పై మొట్ట‌మొద‌టి సారిగా ప్ర‌త్యేకంగా మ్యాన్‌వ‌ల్‌ను రూపొందించి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో వివిధ శాఖ‌లు చేప‌ట్టాల్సిన బాద్య‌తల‌ను ఈ మ్యాన్‌వ‌ల్‌లో పేర్కొన్నారు. న‌గ‌రంలో అక్ర‌మ నిర్మాణాలు, ప్ర‌భుత్వ స్థ‌లాలు అన్య‌క్రాంతం కాకుండా చూడ‌డంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కీల‌కం కానుంది.

—————————————————————————————————————

-*సీపీఆర్ఓ జీహెచ్ఎంసీ చే జారీచేయ‌నైన‌ది.*