అదృశ్యమైన రూర్కీ ఐఐటీ విద్యార్థులంతా క్షేమం.

న్యూఢిల్లీ;

హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్, స్పితి జిల్లాలో టెక్కింగ్‌కు వెళ్లి అదృశ్యమైన రూర్కీ ఐఐటీ విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నట్లు తెలిసింది. 35 మంది విద్యార్థులు క్షేమంగా ఉన్నట్టు రాష్ట్ర సీఎం జైరాం ఠాకూర్ తెలిపారు. హిమాచల్‌లో ట్రెక్కింగ్ వెళ్లిన 45 మంది సభ్యుల బృందం భారీ మంచు తుఫాను కారణంగా సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. వీరిలో 35 మంది రూర్కీ ఐఐటీ విద్యార్థులు ఉన్నారు. వీరిలో కొందరు తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యార్థులు మిస్సయ్యారన్న వార్తతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఐదు రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొండ చరియలు కూడా విరిగిపడుతున్నాయి. విద్యార్థుల ఆచూకీ గురించి సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. వెంటనే రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం విద్యార్థుల ఆచూకీని కనుగొంది. లాహోల్-స్పితి ప్రాంతంలోని సిసులో విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని సీఎం తెలిపారు. తమ పిల్లలు క్షేమంగా ఉన్నారన్న వార్తతో ట్రెక్కింగ్ కి వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.