అధికార పార్టీకి పరంపోగు గుదిబండ. కూనారం భూములపై రెవెన్యూలో కలకలం…

దున్నేవాడికే భూమి చెందాలంటూ భూసాధన పోరాట సమితి పోరాటానికి మద్దతునివ్వాలా? రెండింట్లో ఎటువైపు నిలబడాలో అధికార పార్టీ నాయకులు ఎటూ తెల్చుకోలేక పోతున్నారు. ఇరవై ఏళ్ల క్రితం ఇదే భూముల్లో అప్పటి పీపుల్స్‌వార్‌ పార్టీ ఎర్ర జెండాలు పాతి భూఆక్రమణకు పాల్పిడింది. అయితే పోలీసుల నిర్భందం కారణంగా కూలీలెవరూ భూములను స్వాధీనం చేసుకోలేకపోయారు. ప్రస్తుతం చట్టపరిధిలోనే రైతుకూలీలు ఏకమై చేస్తున్న ఆందోళన రెవెన్యూశాఖలోనే కలకలం రేపుతోంది

సర్కారుకు సవాలుగా భూసాధన పోరాటం.
విశ్వనాథ్‌, కరీంనగర్‌ :
పెద్దపల్లి జిల్లా కూనారం, జాఫర్‌ఖాన్‌పేట, ఎదులాపూర్‌లోని 25వందల ఎకరాల పరంపోగు, పంచరాయి, ఖారాజుఖాత, ఇనాంభూములు ప్రజలకే చెందాలంటూ యేడాది కాలంగా కొనసాగుతున్న రైతుకూలీల పోరాటం అధికారపార్టీకి గుదిబండగా మారింది. యేళ్లకేళ్లుగా సాగుచేసుకుంటున్న రైతు వెంట ఉండాలా? భూమి కావాలంటూ, దున్నేవాడికే భూమి చెందాలంటూ భూసాధన పోరాట సమితి పోరాటానికి మద్దతునివ్వాలా? రెండింట్లో ఎటువైపు నిలబడాలో అధికార పార్టీ నాయకులు ఎటూ తెల్చుకోలేక పోతున్నారు. ఇరవై ఏళ్ల క్రితం ఇదే భూముల్లో అప్పటి పీపుల్స్‌వార్‌ పార్టీ ఎర్ర జెండాలు పాతి భూఆక్రమణకు పాల్పిడింది. అయితే పోలీసుల నిర్భందం కారణంగా కూలీలెవరూ భూములను స్వాధీనం చేసుకోలేకపోయారు. ప్రస్తుతం చట్టపరిధిలోనే రైతుకూలీలు ఏకమై చేస్తున్న ఆందోళన రెవెన్యూశాఖలోనే కలకలం రేపుతోంది. సమగ్ర విచారణ జరిపి ఇనాం భూములన్నీ ప్రజలకు పంచిపెట్టాలన్న డిమాండ్‌ సర్కారుకు సవాలుగా మారింది. కూనారం గ్రామంలో సుమారు 2వేల 5వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. గతంలో పెత్తందారులు వదిలివెళ్లగా సీలింగ్‌ కింద స్వాధీనం చేసుకున్న భూములు, పంచరాయి, పరంపోగు భూములు ఇందులో ఉన్నాయి. వీటిలో పట్టాలు లేనివారి పేరుమీద కొనుగోలు చేసినట్టు కాగితాలు సృష్టించి రికార్డులు తయారుచేశారు. ఇలా సుమారు 334 ఎకరాల భూములున్నాయి. అలాగే మరో 313 ఎకరాలు ఎలాంటి రికార్డులు లేకుండా స్వాధీనం చేసుకొని విక్రయించుకున్నారు. ఇవన్నీ పోను 208 మంది పేదలకు ఒక ఎకరం చొప్పున పట్టాలిచ్చినప్పటికీ 106 మందికి ఇంత వరకు భూములను స్వాధీనపరచలేదు. దీంతో చాలా కాలంగా ఆందోళన చెందుతూ వస్తున్న గ్రామస్తులు తమ భూములను తమకు ఇవ్వాలంటూ పోరాటానికి సిద్ధమయ్యారు.పేదలందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని భూసాధన పోరాట సమితి కన్వీనర్‌ గూళ్ల రాజు, కో-కన్వీనర్‌ ముడిమాడుగుల మల్లన్న, తెంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్‌ కోట శ్రీనివాస్‌, తెంగాణ జన సమితి జిల్లా నాయకు డొంకెన రవి, కేశవరెడ్డి, ఎంఎ గౌస్‌ పాషా, రైతుకూలి పోరాట సమితి నాయకులు రాములు, గాండ్ల మల్లేశం, రెడ్డిరాజుల రాజయ్య, ఉమామహేశ్వరరావు, కర్రె రాజేశం, సారయ్య, స్వరూప, రజిత, జ్యోతి తదితరులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ భూమి వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, ఆక్రమిత భూములను బయటికి తీయాలని వారు డిమాండ్‌ చేశారు.