అనుష్క టీమిండియా వైస్ కెప్టెనా?

లండన్;

ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియాఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్‌ 31 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. రేపు చారిత్రక లార్డ్స్ మైదానంలో రెండో టెస్టు ఆడబోతోంది. ఈ నేపథ్యంలో లండన్‌ చేరుకున్న భారత ఆటగాళ్లు మంగళవారం ప్రాక్టీస్‌లో కూడా పాల్గొన్నారు. అయితే ఈ మ్యాచ్ కి కొన్ని గంటల ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీనికి కారణం కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ.

లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం టీమిండియాను డిన్నర్ కి ఆహ్వానించింది. జట్టుతో పాటు సపోర్ట్ స్టాఫ్ కూడా ఈ విందుకు హాజరయ్యారు. ఈ ఫోటోని బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో ఒకే రకంగా దుస్తులు ధరించిన భారత జట్టు, సహాయ సిబ్బంది, అక్కడి హైకమిషన్ కార్యాలయ సిబ్బందితో ఫోటోకిపోజిచ్చారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే ఈ ఫోటోలో విరాట్ తో పాటు అతని భార్య అనుష్క శర్మ కూడా ఉంది.
దీంతో ఆగ్రహించిన ఫ్యాన్స్ టీమిండియా అధికారిక కార్యక్రమాలకు కూడా అనుష్క ఎలా హాజరవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఆమె తప్ప మిగతా ఆటగాళ్ల భార్యలెవరు ఎందుకు లేరని నిలదీస్తున్నారు. అనుష్కటీమిండియా వైస్‌ కెప్టెనా అంటూనెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. వైస్ కెప్టెన్ అజింక్యరహానే ఓ మూల నిలబడితే అనుష్క మధ్యలో నిలబడటం ఏంటని అడుగుతున్నారు. మరికొందరు టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు మ్యాచ్ లు ఆడేందుకు వెళ్లింది తప్ప హనీమూన్ కి కాదని గుర్తుంచుకోవాలని మందలించారు. అనుష్కటీమిండియాకు ఎప్పుడు ఎంపికైంది? జట్టులో ఆమె బౌలర్.. బ్యాట్స్ మెన్.. కోచ్.. వీటిలో ఏమైనానా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.