అన్నిటిపైనా రాజకీయ ముద్రలేనా!

జనం అంటే తమకు అధికారం తెచ్చిపెట్టే వోట్లు , తాము అధికార పీఠం
చేరుకోడానికి అవసరం అయిన నిచ్చెన మెట్లు , డబ్బు పారేస్తే కొనడానికి
దొరికే వస్తువులు , అంతే కానీ వాళ్ళు మనుషులు కాదు . అసలు మనుషులు ఎందుకు
, వోట్ల మిషన్ మీద తమకు వోటు వేస్తూ నొక్కే వేలు ఉంటె సరిపోదా, దానికి
ఆకలి ఉండదు , ఆలోచనా ఉండదు. అప్పుడు మనుషుల ఆకలి తీర్చడానికి నయా పైసా
ఖర్చు ఉండదు , ఆలోచించి తమను అధికారం నుండి దింపి వేస్తారేమో అనే భయం
ఉండదు,చాలా మంది రాజకీయ నాయకుల ఆలోచన ఇట్లా ఉంటుంది .అటువంటి నాయకులకు
తెలంగాణా ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య మంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్
రావు ,నారా చంద్ర బాబు నాయుడు ఇద్దరూ ఈ కాలపు ప్రతినిధులు . ఇంకే రాజకీయ
నాయకుడయినా వీళ్ళను చూసి నేర్చుకోవాల్సిందే . వీళ్ళను అనుసరించి
అధికారాన్ని అందుకోవాల్సిందే. అందుకున్న అధికారాన్ని దీర్ఘ కాలం ,మళ్ళీ
మాట్లాడితే శాశ్వతంగా తమ వద్దనే ఉండిపోవడం కోసం ఏమయినా చెయ్యడానికి
వెనకాడరు , కొడుకులూ మళ్ళీ మాట్లాడితే మనుమలకు అధికారాన్ని ,వాళ్ళెంత
సమర్ధత లేని వారయినా , బదలాయించడానికి వెనకాడరు . పుట్టుక అయినా చావు
అయినా మంచి అయినా చెడు అయినా అంతా రాజకీయం , దాని ద్వారా అధికారం
తెచ్చిపెట్టే వోట్లు ఇటువంటి నాయకులకు .

సమకాలీన రాజకీయాల గురించి ,ముఖ్యంగా చంద్రశేఖర్ రావు , చంద్ర బాబు
నాయుడు గురించి ఇంత తీవ్రం గా మాట్లాడుకోడానికి కారణాలు చాలా ఉన్నాయి .
మొన్ననే తెలంగాణా రాష్ట్రం లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో కొండగట్టు దగ్గర
గ్రామీణ ప్రాంతాల్లో పల్లె వెలుగు పేరుతో తిరిగే రాష్ట్ర ప్రభుత్వ
నిర్వహణ లొని రోడ్డు రవాణా సంస్థ బస్సు ప్రమాదం జరిగి 60 మంది గ్రామీణ
ప్రజలు మరణించారు . వీళ్ళంతా పేద వాళ్ళు . అంతకు కొద్ది రోజుల ముందే
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ,మాజీ ముఖ్య మంత్రి ఎన్ టీ రామా రావు
కుమారుడు , మాజీ రాజ్య సభ సభ్యుడు నందమూరి హరికృష్ణ కూడా ఒక ప్రమాదంలో
మరణించాడు . ఈ రెండు సంఘటనల కంటే చాలా ముందు తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన
కొద్ది మాసాలకే ముఖ్య మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా లోనే
పట్టాలు దాటుతున్న బస్సును రైల్ డీకొన్న ఘటనలో అమాయక పసి పిల్లలు
చనిపోయారు . అటు ఆంధ్ర ప్రదేశ్ లో 2015 లో రాజముండ్రి లో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట కారణంగా 29 మంది అమాయకులు ప్రాణాలు విడిచారు .
ఇంకా చాలా సంఘటనలు జరిగి ఉండవోచ్చు కానీ ఈ నాలుగు సంఘటనలు ఉదాహరణ గా
తీసుకుని ప్రభుత్వాల వైఖరి , ముఖ్య మంత్రుల వైఖరి గురించి మాట్లాడుకుంటే
పైన చేసిన విమర్శలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి ఎవరికయినా.ప్రభుత్వాలు ఏం చెయ్యాలి ? ప్రమాదాల కారణాలు అన్వేషించి బాధితులకు తగిన న్యాయం చెయ్యాలి ,మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ,అందుకు
కారకులయిన వారిని కటినంగా శిక్షించాలి . ఒక హత్య జరిగినప్పుడు నేరస్తుడిని అరెస్ట్ చేసి కటినంగా శిక్షించెట్టు చూడాలి .ఇక్కడేం
జరుగుతున్నది ? జనం అంటే వోట్లు ,నిచ్చెన మెట్లు అన్నది నాయకుల అభిప్రాయం
అని నిర్ధారించుకోడానికి ఈ ఘటనలన్నీ మంచి ఉదాహరణలు . నందమూరి హరికృష్ణ
రాత్రంతా నిద్ర పోకుండా తెల్లవారు ఝామునే కార్ స్వయంగా నడిపి ప్రమాదంలో
పది చనిపోయాడు . అది స్వయంక్రుతం .మనిషి ఎలాంటి వాడు , ఆయన గుణగనాలు
ఏమిటి ,ఆయన తెలంగాణా రాష్ట్రం కోసం పోరాదాడా లేక రాష్ట్రం సమైక్యంగా
ఉండటం కోసం తన రాజ్య సభ సభ్యత్వాన్ని త్యజించాడా అన్నవిషయాలు ఇక్కడ
అప్రస్తుతం .ఒక మనిషి చనిపోయాడు బాధ పడాల్సిందే .ఏ అసహజ మరణం అయినా బాధ
కలిగించేదే .అయితే ఆ మరణాన్ని నాయకులు ఎట్లా చూస్తారనే దానికి ఒక మంచి
ఉదాహరణ ఇది . ముఖ్య మంత్రి హుటాహుటిన హరికృష్ణ ఇంటికి వెళ్తారు ,పార్ధివ
దేహాన్ని నివాళులు అర్పిస్తారు ,అధికార లాంచనాలతో అంత్యక్రియలకు ఆదేశాలు
జారీ చేస్తారు ,అంత్యక్రియలు జరిగిన చోట మహాప్రస్థానంలో 450 గజాల స్థలం
లో స్మృతి చిహ్నం నిర్మాణానికి నిర్ణయిస్తారు . ఎందుకిదంతా , హరికృష్ణ మీద గౌరవమో ప్రేమో అనుకుంటే పొరపాటు . ఎన్నికలు వొస్తున్నాయి . హైదరాబాద్న గరం చుట్టూ పక్కల కనీసం 25 నుండి 30 నియోజకవర్గాలలో స్థిరపడి అక్కడ
ఎన్నికలను ప్రభావితం చేసే ఆంధ్ర ప్రాంత ప్రజల వోట్ల మీద ప్రేమ .హరికృష్ణ మరణం తో పోలిస్తే కొండగట్టు దగ్గర జరిగిన ప్రమాదం పెను విపత్తు.
అది మరణించిన ఆ 60 మంది స్వయంక్రుతం కాదు , అది ప్రభుత్వం చేసిన సామూహిక
హత్య . కాలం తీరిపోయిన బస్సు ,విశ్రాంతి లేకుండా నాలుగు రోజులుగా ఆ
డొక్కు బస్సు నడుపుతూనే ఉన్న అలసిపోయిన డ్రైవర్ ఏమాత్రం ప్రయాణానికి
పనికి రాని రోడ్ . లాభాపేక్ష తో కెపాసిటీ కి మించి బస్సు లో కుక్కిన 110 మంది ప్రాయాణీకులు . ప్రమాదానికి ఇవీ కారణాలు . ఆర్ టీ సి లో 6000
డ్రైవర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ,300 కొత్త బస్సు ల అవసరం ఉన్నా పట్టించుకునే నాధుడు లేదు .ఇది ప్రభుత్వ హత్య కాకపోతే మరేమిటి .అది సరే .హరికృష్ణ మరణిస్తే అంత హడావుడీ చేసిన ముఖ్య మంత్రి జాడే లేదెందుకు
కొండగట్టు దగ్గర ? వాళ్ళంతా వోటర్ లు మాత్రమె కాదు , నువ్వు తెలంగాణా సాధన కోసం చేసిన పోరాటం లో సమరశీల పాత్ర పోషించిన జగిత్యాల ప్రాంత ప్రజలు
. ముఖ్య మంత్రి ఎందుకు వెళ్లలేదంటే అక్కడ చనిపోయిన వోటర్ లు 60 నెంబర్
మాత్రమె ,వాళ్ళేమీ 25 ,30 నియోజకవర్గాల వోటర్లను ప్రభావితం చేసే వాళ్ళు
కాదు అనుకుని ఉండొచ్చు . 100 నియోజకవర్గాల ప్రజలు ఇది గమనిస్తున్నారన్న
విషయం ముఖ్య మంత్రి మరిచిపోయినట్టు ఉన్నారు . ఇంతటి దుర్ఘటన జరిగితే
,అందుకు ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం అయినప్పుడు నైతిక బాధ్యత వహించి
ముఖ్య మంత్రి రాజీనామా చెయ్యాలి ,కనీసం రవాణా శాఖ మంత్రి లేదా ఆర్ టీ సి
అధ్యక్షుదికయినా ఉద్వాసన జరగాలి . సంబంధిత డిపో మేనేజర్ ను సస్పెండ్ చేసి
చేతులు దులుపుకున్నారు . ఇంత కన్నా దుర్మార్గం ఎక్కడయినా ఉంటుందా !
ఇక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ది మరో రకం ,ప్రతిదీ ఆయన
రాజకీయ లబ్ది కోసం వాడుకునే అలవాటు . ప్రతి సంక్షోభాన్నీ మనకు అనుకూలంగా
మలుచుకోవాలన్న ఒక మంచి మాటని ఆయన తన రాజకీయ లబ్ది కోసం మాత్రమె
వాడుకుంటారు . ఆయనకు అన్నీ ఈవెంట్ లే. జనం మరణాలు కూడా ఆయన తనకు
అనుకూలమయిన ఈవెంట్ గా మార్చుకొనే ప్రయత్నం చెయ్యడంలో దిట్ట . నేనేం
చేసినా ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉంది అన్న అహంకారం చంద్ర శేఖర్ రావు ది
,రాజకీయ లబ్ది కోసం దేన్నయినా వాడేసుకునే ఆరాటం చంద్ర బాబు నాయుడుది .
2015 జూలై 15 న గోదావరి పుష్కరాల ప్రారంభం సందర్భంగా జరిగిన ఘటన లో 29
మంది చనిపోతే దాన్ని కూడా ఒక ఈవెంట్ గా మార్చేయ చూసిన నాయకుడు చంద్ర బాబు
నాయుడు . మూడేళ్ళ కింద జరిగిన సంఘటన గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకోవడం
అన్న సందేహం ఎవరికయినా కలగొచ్చు . ఆ దుర్ఘటన తరువాత చంద్ర బాబు ప్రభుత్వం
వేసిన ఒక కంటి తుడుపు కమిషన్ నిన్న కాక మొన్న అంటే మూడేళ్ళ తరువాత తన
నివేదిక ను సమర్పించింది . ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ అధికార పక్షం ఆమోదం
పొందిన ఆ నివేదిక గతంలో ఎంతో ప్రతిష్ట కలిగి ఉండిన జస్టిస్ సోమయాజులు
రాసినట్టుగా లేదు , చంద్రబాబు నాయుడు రాసుకున్నట్టుగా ఉంది . అసలు అది ఒక
న్యాయ విచారణ నివేదిక లాగా కాకుండా తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం
విడుదల చేసిన ప్రకటన లాగా ఉంది. పన్నెండేళ్ళకోసారి వొచ్చే గోదావరి పుష్కరాలు ప్రజల విశ్వాసాలకు సంబంధించినవి . ప్రభుత్వాలకు వాటితో ఏ సంబంధమూ ఉండకూడదు . పుష్కర
స్నానాలు చేసే భక్తులకు అవసరమయిన సౌకర్యాలు కల్పించడం , పెద్ద సంఖ్యలో
జనం వొస్తారు కాబట్టి నేరాలూ , ప్రమాదాలూ జరగకుండా చూడటం , శాంతి
భద్రతలను పరిష్కరించడం అంత వరకే ప్రభుత్వాల పాత్ర పరిమితం కావాలి . కానీ
చంద్ర బాబు నాయుడు కు ప్రతిదీ ఈవెంట్ గా మలుచుకునే అలవాటు కాబట్టి
గోదావరి పుష్కరాలను ఒక అంతర్జాతీయ ఈవెంట్ చేయ్యాలనుకున్నారు .దాని ద్వారా
అంతర్జాతీయంగా ప్రచారం పొందడం కోసం చేసిన పనే 29 మంది అమాయక భక్తుల
దుర్మరనానికి కారణం అయింది . ఒక విదేశీ టీ వీ చానల్ లో ప్రదర్శన కోసం ఆయన
నిర్మించిన ప్రచార చిత్రం కారణం గా నే తొక్కిసలాట జరిగింది . జనం పెద్ద
సంఖ్య లో కనపడేట్టు సినిమా తీయాలన్న కీర్తి కండూతి కారణంగా వీ ఐ పీ ఘాట్
లో కాకుండా మామూలు భక్తులు స్నానం చేసే ఘట్టాల దగ్గర చంద్ర బాబు కుటుంబం
పుణ్య స్నానాలు చేసినందువల్ల ,ఆయన రక్షణ కోసం అప్పటి దాకా ఆపి ఉంచిన
జనాన్ని ఒక్క సారిగా వోదిలేసరికి తొక్కిసలాట జరిగి ఈ దుర్ఘటన చోటు
చేసుకుంది . న్యాయ విచారణ జరగాల్సింది ఈ అంశం అయితే ఇది తప్ప చాలా
అనవసరపు విషయాలు మాట్లాడి తెలుగు దేశం ఆఫీస్ విడుదల ప్రెస్ నోట్ స్థాయికి
దిగజారిపోయింది జస్టిస్ సోమయాజులు న్యాయ విచారణ కమిషన్ నివేదిక .పుష్కరాల ప్రారంభ దినాన ఉదయం ఒక ముహూర్తం లోనే స్నానాలు చెయ్యడం వల్ల ఎంత
పుణ్యం వొస్తుందో ప్రభుత్వమే మీడియా కు విడుదల చేసిన వ్యాపార ప్రకటనల్లో
ఊదరగోట్టింది .ఆ విషయం పక్కన పెట్టి సోమయాజులు గారు తన నివేదిక లో “ అసలే
పిచ్చి నమ్మకం ఆ పై ప్రసార మాధ్యమాలలో అతిశయోక్తులతో కూడిన సిద్ధాంత
రాద్దాంతం ,ఇవన్నీ కలిస్తే ఏమవుతుంది “ అని భక్తుల నమ్మకం మీదా మీడియా
మీద నెట్టేశారు దుర్ఘటన కారణాన్ని . ఫలానా ముహూర్తం లోనే స్నానం
చెయ్యండి పుణ్యం వొస్తుందని ప్రభుత్వం చేసిన ప్రచారాన్ని పక్కన పెట్టి
స్నానాలు ఎప్పుడు చేసినా పుణ్యం వొస్తుందన్న విషయాన్ని సరిగా చెప్పలేక
చానళ్ళు ప్రజల్లో గుడ్డి నమ్మకాన్ని కలిగించాయి అని బాధ్యతా మీడియా మీద
నెట్టేశారు జస్టిస్ సోమయాజులు .నివేదిక మధ్య లో శ్రీనాధ కవి
పద్యాలేన్డుకో , స్వామి వివేకానంద కొటేషన్ లు ఎందుకో ఎవరికీ అర్ధం కాదు .
మరో పక్క గోదావరి ని ఒక బ్రాండ్ గా ప్రోమోట్ చెయ్యడానికి సంవత్సరం ముందు
నుండే 1500 కోట్ల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం ఎంత గొప్పగా ప్రణాలికలు
రచించిందో కొనియాడారు న్యాయమూర్తి . కోటగుమ్మం దగ్గర ఉన్న పుష్కర ఘాట్
మార్గం ఇరుకుగా ఉండటం వల్ల ముఖ్య మంత్రి తదితర ప్రముఖులు స్నానాలు
ముగించుకు వెళ్ళే దాకా జనాన్ని ఆపి ఉంచడం వల్ల ఇబ్బంది అయింది అని
చెపుతూనే ప్రభుత్వం తప్పేమీ లేదని అంతా ప్రతిపక్షాల ఒర్వలేనితనమే అని
తేల్చేసారు నివేదిక లో .

ఇది జస్టిస్ సోమయాజులు న్యాయ విచారణ కమిషన్ నివేదిక కాదు తెలుగు దేశం
పార్టీ ప్రెస్ నోట్ అని చెప్పడానికి ఈ కింది పంక్తులు చాలు.“ సమకాలీన పరిస్తితులు ఏం చెపుతున్నాయంటే అధికారంలో లేని పార్టీలు , లేదా అధికార పక్షానికి వ్యతిరేకులయిన , అంత స్నేహంగా లేకపోయినా పార్టీలు ,వాటి
నాయకులూ అధికార పక్షం మీద బురద చల్లడానికి ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా
విడిచి పెట్టావు, చిన్న సంఘటన ను , ఉపద్రవాన్ని కూడా సొమ్ము చేసుకో
జూస్తాయి “.ఇంతకంటే దుర్మార్గమయిన వ్యాఖ్యానం ఈ నివేదికలో ఏమిటంటే ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు పన్నెండు రోజులూ రాజమండ్రి లోనే బస చేసి ఎంత
అద్భుతమయిన ఏర్పాట్లు చేసారని కొనియాడుతూ అన్య మతస్తులు కూడా అనేకులు కూడా పుణ్య స్నానాలు ఆచరించడం ఆనవాయితీ అందులో భాగంగానే వై ఎస్ జగన్
మోహన్ రెడ్డి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కి తీర్థ విధి నిర్వహించారు , ఆ
విషయం మీడియా లో ప్రసారం కూడా అయింది అని . ఒక దుర్ఘటన కు సంబంధించి
నిజానిజాలు విచారణ జరిపి న్యాయబద్దంగా నివేదిక ఇవ్వాల్సిన న్యాయమూర్తి
వ్యాఖ్యలు ఇలాగే ఉంటాయా ? ఈ నివేదికలో జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావన
ఔచిత్యం ఏమిటో సోమయాజులు గారే చెప్పాలి .
తెలుగు దేశం పార్టీ ప్రకటన లాంటి ఇటువంటి వ్యాఖ్యలు ఇంకా ఈ నివేదికలో
చాలా ఉన్నాయి .స్థలాభావం వాటన్నిటినీ పేర్కొనే అవకాశం ఇవ్వడం లేదు .

దేవులపల్లి అమర్.

(సాక్షి సౌజన్యం తో)