అన్ని వివరాలను నామినేషన్ పత్రాల్లో….

న్యూఢిల్లీ;

ఇన్నాళ్లూ ఎన్నికల నామినేషన్ పత్రాల్లో తప్పుడు లెక్కలతో ఆస్తులు, అప్పులు చూపి తప్పించుకొనే అభ్యర్థులకు చెక్ పెట్టింది ఎన్నికల సంఘం. ఆస్తిఅప్పుల వివరాలు ఇస్తే సరిపోదని ఎక్కడెక్కడ ఎంతెంత పెట్టుబడులు పెట్టింది? వాటి నుంచి ఎంత ఆదాయం వస్తోంది? వంటి అన్ని వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనడం తప్పనిసరి చేసింది. కేవలం అభ్యర్థి మాత్రమే కాకుండా జీవిత భాగస్వామికి ఉన్న ఆదాయ మార్గాలు, వాటి నుంచి వచ్చే రాబడిని తప్పనిసరిగా తెలపాలనే నిబంధన తెచ్చింది. అభ్యర్థి ప్రచార సరళిపై కన్నేసి ఉంచేందుకు వీలైననన్ని అన్ని మార్గాలను ముందుగానే తెలుసుకుంటోంది.ప్రస్తుతం వాడుతున్న టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, సోషల్ మీడియాలో అకౌంట్ల వివరాలను కూడా సమర్పించాల్సిందేనని తెలిపింది. దీంతో వేర్వేరు అకౌంట్ల నుంచి మారుపేర్లతో ప్రచారాలు, ప్రచార సరళి, ఖర్చు వంటి అన్ని అంశాలను ఓ కంట కనిపెట్టనుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం నామినేషన్ పత్రాల ఫార్మాట్ లో మార్పులు చేసింది. నామినేషన్ పత్రాల ఫార్మాట్, ఫార్మ్ 26లోని అఫిడవిట్ లో మార్పులు చేసినట్టు ఈసీ ప్రకటించింది. నామినేషన్ పత్రాల్లోని 2ఏ,2బీలలో పార్ట్ IIIఏ, 2సీ, 2డీ, 2ఈ పత్రాలలోని రెండో భాగంలో మార్పు చేశారు. అలాగే ఫార్మ్ 26లోని అఫిడవిట్ పార్ట్ ఏ-ని కూడా మార్చారు. ఇందులో అభ్యర్థి వాడుతున్న టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, సోషల్ మీడియా అకౌంట్ వివరాలను, అభ్యర్థి, అభ్యర్థి భాగస్వామికి ఉన్న ఆదాయ వనరుల వివరాలను కూడా పేర్కొనడం తప్పనిసరి చేశారు. కొత్తగా మార్చిన నామినేషన్ పత్రాలను, ఫార్మ్ 26లోని అఫిడవిట్ లను ఇప్పటికే అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు పంపడం జరిగింది.