అప్రకటిత సి.ఎం.లోకేష్!! అభ్యర్థులను ప్రకటించిన బాబు పుత్ర.

ఎస్.కె.జకీర్.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్ ని ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటున్నారనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు తన రాజకీయ వారసుడిని చేయాలనే లోకేష్ కి అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో కీలక పదవులు అప్పజెప్పారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోకేష్ కూడా కొన్నేళ్లుగా పార్టీలో,  ప్రభుత్వంలో తన పట్టు పెంచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై అటు ప్రతిపక్షాలు, ఇటు స్వపక్షం నుంచి ఎన్ని విమర్శలు వస్తున్నా తండ్రీకొడుకులు వెనుకడుగు వేయడం లేదు. వచ్చే ఎన్నికల్లో లోకేష్ కీలకపాత్ర పోషించనున్నారనే టాక్ వినిపిస్తున్నప్పటికీ దానిని నిజం చేస్తూ ఆయన ఇవాళ ఓ సంచలన ప్రకటన చేశారు.ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించిన లోకేష్ కి బాబు స్వాగతానికి మించిన స్థాయిలో స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. లోకేష్‌కి స్వాగతం పలికేందుకు ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ వెంకటేష్ వర్గాలు పోటీపడ్డాయి. ఎస్వీ వేల మందితో ర్యాలీ నిర్వహిస్తే టీజీ వెరైటీగా భారీ గజమాలను తయారు చేయించి క్రేన్‌ సహాయంతో లోకేష్‌ను సత్కరించారు. నేతల ఈ హడావిడి చూస్తే లోకేష్ అప్రకటిత ముఖ్యమంత్రి అనే విషయం చెప్పకనే చెప్పినట్లయింది. స్వాగతసత్కారాలు చూసి ఊపే వచ్చిందో లేకపోతే తనను తాను టీడీపీ అధినేత, ముఖ్యమంత్రిగా ఊహించుకున్నారో కానీ లోకేష్ టీడీపీ సంప్రదాయానికి భిన్నంగా ఓ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం ఉండగానే వైసీపీ నుంచి వలస వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలను లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులుగా అధికారికంగా ప్రకటించారు. వాళ్లిద్దరినీ భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థానానికి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. పైగా సుమారు 40 స్థానాల్లో మార్పుచేర్పులు ఉండొచ్చని సూచనప్రాయంగా చెబుతూ వస్తున్నారు. అలాంటిది ఎస్వీ, బుట్టాల అభ్యర్థిత్వాన్ని లోకేష్ స్వయంగా ప్రకటించడం అంటే ఆయన ఇప్పటికే అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ప్రారంభించినట్టే అనుకోవాలి. లోకేష్ చర్యతో టీడీపీ నాయకుల్లో కలకలం మొదలైంది.ఈ పేర్లను ప్రకటించిన వెంటనే రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పక్క సీటుకు మారిపోయారు. తన కొడుకు టీజీ భరత్ ను అసెంబ్లీకి పోటీ చేయించాలని భావిస్తున్న రాజ్యసభ సభ్యుడు టీజీ వర్గం లోకేష్ ప్రకటనతో నిరాశలో మునిగిపోయింది. పలు సర్వేలు, కమిటీలు, సలహాసంప్రదింపుల తర్వాత పార్టీ అభ్యర్థులను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోందని, అయితే టీడీపీ సంప్రదాయాలకు విరుద్ధంగా లోకేష్ ప్రకటన చేయడంపై కర్నూలు జిల్లా పార్టీలో అప్పుడే లుకలుకలు బయలుదేరాయి.