‘అప్రస్తుత’ తెలంగాణ వాదం. టిఆర్ఎస్ ‘సెల్ఫ్ గోల్’ !!

ఎస్.కె. జకీర్.
ఏ నినాదమూ, వాదమూ తెలంగాణ రాష్ట్ర అవతరణకుకారణమైందో, టిఆర్ఎస్ అధికారంలోకి రావడానికి పునాదులు వేసిందో…. అదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టి ముంచబోతున్నదా? తెలంగాణ ముందస్తు ఎన్నికలలో ఇదే హాట్ టాపిక్. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగలేఖ పేరిట టిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన లేఖ, దానికి జవాబుగా టిఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ కు ఉత్తమ్ రాసిన లేఖ ప్రజల్లో చర్చకు దారితీస్తున్నవి. టిడిపితో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కేసీఆర్ మొత్తం ప్రచార పర్వాన్ని చంద్రబాబు వైపునకు మళ్లించడం ద్వారా ఆశిస్తున్న ప్రయోజనం నెరవేరకపోగా ‘భారీ నష్టం’ కలిగించే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నవి. రాజకీయాల్లో అనుసరించే విధానాలకు సంబంధించి, తీసుకునే నిర్ణయాలకు సంబంధించి వర్తమానాన్ని ‘గతం’ ఎప్పుడూ వెంటాడుతుంది. ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, అటువంటి విధానాలు అనుసరించినపుడు’ఆ సమయానికి’ అవి సమంజసంగా అనిపించవచ్చును. అవి లాభదాయకంగానూ ఉండవచ్చును. రాజకీయంగా ‘ప్రత్యర్థుల్ని’ సునాయాసంగా చిత్తు చేసినందుకు సంబరాలూ చేసుకోవచ్చు. కానీ అవే, ఆ తర్వాతి కాలంలో ‘మెడకు చుట్టుకుంటాయ’న్నది అనుభవంలోకి రావలసిందే. తప్ప ముందుగా జోస్యం పనికి రాదు. జాతకాలు ఫలించవు. టిడిపి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినందువల్ల2009లో టిడిపితో పొత్తు పెట్టుకున్నట్టు టిఆర్ఎస్ సమర్ధించుకున్నది. మరి 2018 నాటికి టిడిపి తెలంగాణ వ్యతిరేక పార్టీగా ఎలా మారిపోయింది ?తెలంగాణను గట్టిగా వ్యతిరేకించిన సిపిఎంతోనూ టిఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నది.

టిడిపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ వంటి వారిని క్యాబినెట్ లోకి తీసుకున్నప్పుడు ‘తెలంగాణ వాదం’ ఏమైనట్టు? తెలంగాణ సమాజం దృష్టిలో ‘ద్రోహులు’ గా, కళంకితులైన పట్నం మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు లాంటి వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చినపుడు తెలంగాణ వాదం ఎక్కడికి పోయింది ? తెలంగాణ ఉద్యమ కార్యకర్తలను తరిమికొట్టిన మైనంపల్లిహన్మంతరావు, దానం నాగేంద‌ర్‌, తీగల కృష్ణారెడ్డి వంటి వారిని టిఆర్ఎస్ లోకి చేర్చుకోవడం కూడా విమర్శల పాలైంది. ”ఖమ్మంలో ఏడు మండలాలను చంద్రబాబు గుంజుకున్నాడని సిగ్గులేకుండా చెబుతున్నారు, తెలంగాణ సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న మీరు ఏడు మండలాలు పోతుంటే పోరాటాలు ఎందుకు చేయలేదు. చంద్రబాబు గుంజుకుంటుంటే చేతులు ముడుచుకొని చేవలేని దద్దమ్మలా కూర్చున్నారా”? అనిటిపిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ”ఏ మార్పు వచ్చిందని చంద్రబాబును మీరు చండియాగానికి ముఖ్య అతిధిగా పిలిచి సన్మానించారు ?ఏ మార్పు వచ్చిందని మీరు అమరావతికి వెళ్ళి చంద్రబాబు ఇంట్లో చేపల పులుసు తిని వచ్చారు. ఏ మార్పు వచ్చిందని మీరు పరిటాల రవి కొడుకు పెళ్ళికి పోయి టిడిపి నేతలతో రహస్య మంతనాలు జరిపారు?” అని ఆయన అంటున్నారు.

టిడిపితో పొత్తు గురించిన ప్ర‌శ్న అడిగే హ‌క్కు కేసీఆర్ కు లేదని ఉత్తమ్ వాదన. కాంగ్రెస్ సారధ్యంలో కేసీఆర్ వ్యతిరేక ‘కూటమి’ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇంకా సీట్ల సర్దుబాటు వ్యవహారంలో కొన్ని సమస్యలు పరిష్కారం కావలసి ఉన్నది. ఈ లోగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎంపీ కవిత వంటి వారంతా ప్రతిరోజు చంద్రబాబుపైన, కూటమి ఏర్పాటు పైన ‘దుమ్మెత్తిపోయడమే’ ఎజండా గా మార్చుకున్నారు. ‘ప్రజా ఆశీర్వాద సభ’ల్లో కేసీఆర్ తమ ప్రచారపంథాకు సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలకు ‘కీ ‘ ఇచ్చి వదిలారు. ఇక మిగిలిన నాయకులందరికీ’నోటి’ నిండా పని. టిడిపి మాజీ నాయకులు తలసాని, మహేందర్ రెడ్డి వంటి వారు కూడా చంద్రబాబును తిట్టడానికి క్యూ కడుతున్నారు. చంద్రబాబును ఎంతగా తిడితే, ఎంతగా ఆ తిట్లకు’డోసు’ పెంచితే కేసీఆర్ మెచ్చుకుంటారని, తమకు మార్కులు ఎక్కువ పడతాయని వారు అనుకుంటూ ఉండవచ్చు. ‘కూటమి’ పొత్తులపై ప్రత్యక్షంగా, పరోక్షంగానో టిఆర్ఎస్ లో ఏదో ‘కలవరం’కనిపిస్తున్నది. ”నాలుగురన్న ఏళ్ళ పాటు పనిచేసి ఉంటే మేము ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకు ఎందుకు ఆందోళన” అనిటిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తాయి.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో పిల్లిమొగ్గలు వేసింది. ”విభజన చట్టంలో ఉన్న వాటికే మద్దతు ఇస్తామని..ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమ పరిశ్రమలు ఏపీకి వెడతాయి”. అని లోక్ సభలో టీఆర్ఎస్ ఉపనేత జి. వినోద్, మంత్రి హరీష్ రావు కొన్ని సందర్భాలలో అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా డిమాండును సీఎం కెసీఆర్ ఓ విలేకరుల సమావేశంలో సమర్ధించారు. పలుమార్లు ఏపీకి ప్రత్యేక హోదాకు ఎంపీ కవిత కూడా బహిరంగంగా మద్దతు ప్రకటించారు. కానీ కేంద్రంపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్ ఎంపీలు మాత్రం దూరంగా ఉండడంతో పాటు ప్రత్యేక హోదా అంశంలోనూ గతంలో చేసిన వ్యాఖ్యలకు, తర్వాతి పరిణామాల్లో చేస్తున్న వ్యాఖ్యలకు పొంతన లేకుండా పోయింది. సీఎం కేసీఆర్‌ తెలంగాణ ద్రోహి అని, మిషన్ కాకతీయ, భగీరథ కాంట్రాక్టులు ఆంధ్రా వ్యక్తులకు ఇచ్చారని టిపిసిసి వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వంటి వారుచాలాకాలంగా ఆరోపిస్తూ ఉన్నారు. 1999 కి ముందు అసలు కేసీఆర్ తెలంగాణ అనే పదం మాట్లాడలేదని, పలు పదవులు అనుభవించిన తర్వాత తెలంగాణ వాదం వినిపించారని జీవన్ రెడ్డి విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు.