“అమర్ అంటే నాకు కుళ్లు”!!

“అమర్ అంటే నాకు కుళ్లు”!!

– మంగు రాజగోపాల్:

నా మిత్రుడు దేవులపల్లి అమర్ ‘సాక్షి’ లో రాసిన వ్యాసాల సంకలనం “డేట్ లైన్ హైదరాబాద్” కి కె. రామచంద్ర మూర్తి గారొక ‘ముందు మాట’, నేనొక ‘ముందు మాట’ రాశాం. ఇవాళ అమర్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ అప్పటి నా ‘ముందు మాట’ని ఇక్కడ పునరుద్ఘాటిస్తున్నాను.

అం‌దుకే వాడంటే నాకు కుళ్లు !

ముందే చెప్పేస్తున్నా.. అమర్‌ని గారు, గీరు అంటూ పిలవడం నావల్ల కాదు. అలా సంబోధిస్తే మా ఇద్దరికీ కూడా చాలా కృత్రిమంగా, ఎబ్బెట్టుగా ఉం టుంది. అంచేత నాకు అలవాటైన పద్ధతిలోనే రాసుకుంటూ పోతాను.
ఇప్పుడు ఆ కుళ్లు ఎందుకో మనవి చేస్తాను. వర్కింగ్‌ ‌జర్నలిస్టులుగా మా ఇద్ద రిదీ నలభై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. ఇద్దరం ఒకే రోజు, ఒకో చోట నుంచి ఈ ప్రయాణం మొదలుపెట్టాం. ఈ ప్రయాణం గురించి చెప్పడానికి ముందు తప్పని సరిగా రామోజీరావు గారిని తలుచుకోవాలి. పేపర్లో సబ్‌ ఎడిటర్లుగా పనిచేయడానికి తలపండిన పండితులే కానవసరం లేదు, అప్పుడే కాలేజీ నుంచి ఫ్రెష్‌గా వచ్చిన యువతీ యువకులు కూడా పనికొస్తారన్నది ఆయన అంచనా. మన పేపర్‌కి కావల్సిన జర్నలిస్టుల్ని మనమే తయారు చేసుకోవాలన్నది ఆయన సంకల్పం. ఆ అంచనా, సంకల్పానికి కార్యరూపమే ఈనాడు జర్నలిజం స్కూలు. అలా తెలుగు పత్రికా రంగంలో మొదటిసారిగా ఆవిర్భవించిన ఈనాడు జర్నలిజం స్కూలు ఫస్టు బ్యాచ్‌లోని విద్యార్థులం నేనూ, అమరూ.
అబిడ్స్‌లోని రామోజీరావు గారి మార్గదర్శి హౌస్‌లో 1976 మార్చి 9వ తేదీన ఈనాడు జర్నలిజం స్కూలు మొదటి బ్యాచ్‌ ‌శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. కవి, కార్టూనిస్టు, జర్నలిస్టు అయిన రాంభట్ల కృష్ణమూర్తిగారు దానికి ప్రిన్సిపాల్‌. ఆలిండియా రేడియోలో పనిచేసే కృష్ణారావు గారు పార్ట్‌టైం లెక్చరర్‌. ‌పొద్దున్న పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ట్రైనింగ్‌ ‌క్లాసులు. మధ్యలో ఒక గంట లంచ్‌ ‌బ్రేక్‌.ఇప్పుడు మళ్లీ కుళ్లు టాపిక్‌లోకి వద్దాం. మార్గదర్శి హెడ్డాఫీసులోని కాన్ఫరెన్స్ ‌హాలులో అబ్బాయిలు, అమ్మాయిలు కలిపి పాతిక మందితో క్లాసులు ప్రారంభ మయ్యాయి. (అప్పుడు మా అందరి సగటు వయసు 22 ఏళ్లకు మించదు. మాలో కేఎల్‌ ‌రెడ్డి గారొక్కరే ఎక్సెప్షన్‌. ‌వయసులో ఆయన మాకంటే పదేళ్లు పెద్ద. అందరం ఆయన్ని బాబాయ్‌ అని పిలిచే వాళ్లం.) ఇంచుమించు అందరూ కాలేజీ చదువు పూర్తి కాగానే డైరెక్టుగా ఈ క్లాసులోకి అడుగుపెట్టిన వారే. నేనొక్కడినే కాస్తోకూస్తో అనుభవం ఉన్నవాణ్ణి. అనుభవం అంటే మరేం లేదు. అప్పటికే చాలా పత్రికల్లో కథలు గిలికిన వాణ్ణి. అంతకుముందు ఓ ఏడాది పాటు సినీ హెరాల్డ్ అనే సినిమా పత్రికలో ఉద్యోగం వెలగబెట్టిన వాణ్ణి. ఆ పొగరుతోనే మిగతా వాళ్లని పిల్లకాయల్ని చూసినట్టు చూశాను.
ఎవరి పరిచయాలు వాళ్లనే చేసుకోమన్నారు రాంభట్ల. దాంతో ప్రవరలు మొదలయ్యాయి. అమర్‌ అం‌టే నా కుళ్లు అప్పుడే ప్రారంభమైంది. సన్నగా, పొడుగ్గా టూత్‌ ‌పిక్‌లా ఉన్న కుర్రాడొకడు లేచి ‘నా పేరు దేవులపల్లి అమర్‌’ అన్నాడు. వాడింటి పేరు వినగానే నాలో కుళ్లు మొదలైంది. వీడు కొంపతీసి నా అభిమాన కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనవడో, ఏంటో.. ‘తాతా, తాతా’ అంటూ వీడు ఆయన చింపిరి జుత్తు పీకుతూ ఆయన ఒళ్లో పెరిగాడో ఏంటో.. అని తెగ కుళ్లుకు న్నాను. ఆ మహానుభావుడికీ, ఈ టూత్‌ ‌పిక్‌ ‌గాడికీ మధ్య బీరకాయ పీచుకూడా లేదని తెలిశాక మనసు శాంతించింది. పొద్దున్న ‘మీరు, మీరు’ అంటూ మొదలైన మా పరిచయం మధ్యాహ్నానికి ‘నువ్వు, నువ్వు’లోకి మారి, సాయంత్రానికి ‘ఒరే, ఒరే’లోకి దిగిపోయింది.
ఒక్క నాతోనే కాదు, బ్యాచ్‌లో అందరితోనూ అమర్‌ది ఫెవికాల్‌ ‌బంధమే. అందరి నోటా అమర్‌ ‌జపమే. వాడెక్కడుంటే అక్కడ సందడిగా ఉండేది. చెప్పకేం గానీ, అమర్‌ ‌మొహంలో ఓ అందం, ఓ పసితనం కూడా ఉండేవి. (ఇప్పుడు కూడా అవి చెక్కు చెదరలేదు) అందుకేనేమో, మాకు ట్రయినింగ్‌ ఇవ్వడానికి వస్తూ ఉండే పొత్తూరి గారు, ఏబీకే గారు, వీహెచ్‌ ‌గారు, టీవీకే గారు మహా యాక్టివ్‌గా ఉండే వీణ్ణి ప్రత్యేకంగా, కొండొకచో ముద్దుగా చూసేవాళ్లు. అమ్మాయిలు మిగతా వాళ్లతో కంటే వాడితోనే ఎక్కువ క్లోజ్‌గా ఉండేవాళ్లు. నా కుళ్లుకి అది కూడా ఓ కారణమని వేరే చెప్పక్కర్లేదు. ఓ రోజు బుర్రా సుబ్రహ్మణ్యం తెగించి నన్ను అడిగేశాడు, ‘గురూ ! ఈ అమ్మాయిలెందుకు అమర్‌ ‌గాడి వెంట తిరుగుతారు ?’ అని. నేను బుర్రా భుజం తట్టి ‘అమర్‌ ‌చిన్న పిల్లాళ్లా ఉంటాడు కదా, అందుకని వాడితో చనువుగా ఉంటార్లే.. మనం పెద్ద మగవెధవలం కదా, మనల్ని దూరం పెడతారు’ అని సర్ది చెప్పాను. (అలా అని నేను బుర్రాకి సర్ది చెప్పానో, లేక నాకు నేను సర్ది చెప్పుకున్నానో ఇప్పటికీ అర్థం కాదు). క్లాసులో లంచ్‌ ‌వరకూ జర్నలిజం పాఠాలు ఉండేవి. ఈనాడు ఎడిటర్లతో పాటు సీనియర్‌ ‌జర్నలిస్టులు వచ్చి వివిధ అంశాల మీద పాఠాలు చెప్పేవారు. లంచ్‌ ‌తర్వాత మాచేత వార్తల్ని అనువాదం చేయించే వారు. ‘నాయనలారా’ అనువ దించండి కానీ అనువధించకండి’ అంటూ రాంభట్ల గారు మొత్తుకునే వారు. తేట తెలుగులో, సరళంగా అనువాదం చేసే విద్య మా అందరికీ అక్కడే అబ్బింది. అమర్‌ ‌కాపీ చూసి డంగైపోయేవాణ్ణి. (అచ్చం నాలాగే రాసేవాడు మరి). అప్పటికే బోలెడు కథలు రాసి రచనా శైలి వంట పట్టించుకున్న నేను ఆ మాత్రం తెలుగులో రాయడం పెద్దవిడ్డూరం కాదు. కానీ అలాంటి బ్యాగ్రౌండ్‌ ‌లేని అమర్‌ ‌చక్కటి తెలుగులో, చెయ్యి తిరిగిన పత్రికా రచయితలాగా రాయడమే ఆశ్చర్యం. (మళ్లీ కుళ్లు) ఇలా క్లాసులో పోటాపోటీగా మా టాలెంట్‌ని ప్రదర్శించే వాళ్లం. ఏ కారణం చేతనైనా మధ్యాహ్నం క్లాసులేక పోతే పక్కనే ఉన్న ప్యాలెస్‌ ‌థియేటర్లో మేట్నీకి చెక్కేసేవాళ్లం.అమర్‌ ‌పక్కా హైదరాబాదీ. విఠల్‌ ‌వాడిలో సైకిళ్లు, స్కూటర్లు మాత్రమే వెళ్లగలిగే ఓ ఇరుకు సందులో అగ్గిపెట్టేంత అద్దెకొంప వాళ్లది. మాలాగే సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఆ మాటకొస్తే మా బ్యాచ్‌లో ఎక్కువ మంది ఆ బాపతే. ప్రతి నెలా 30 కల్లా స్టయిపెండ్‌ 150 ‌రూపాయలు కవర్లో పెట్టి ఇచ్చేవారు. వారం తిరిగే సరికి అందరిలోనూ బీద అరుపులు మొదలయ్యేవి. ‘అరేయ్‌, ‌చాయ్‌ ‌తాపించు బే’ అని అడిగేవాడు అథారిటీగా. ‘డబ్బుల్లేవురా.. నీ మీదొట్టు.. బస్‌ ‌టిక్కెట్టుకి మాత్రమే ఉన్నాయి’ అనే వాణ్ణి హృదయవిదారకంగా, వాడు నా మీద బోలెడు జాలిపడి, ‘సర్లే.. ఎవణ్ణో అడుక్కొస్తా’ అని వెళ్లి, విజయగర్వంగా తిరిగొచ్చేవాడు. లక్ష్మణ్‌ ‌క్యాంటీన్‌లో వన్‌ ‌బై టూ చాయ్‌ ‌లాగించే వాళ్లం. అమర్‌ ‌బ్రహ్మాండంగా ఉర్దూలో మాట్లాడుతాడు. నేనెంత ప్రయత్నించినా వాడిలాగా ఉర్దూలో మాట్లాడటం చేతనయ్యేదికాదు. ‘అరే, క్యా రే తూ..’ అంటూ వాడు గడగడ ఉర్దూలో మాట్లాడుతుంటే కుళ్లుకుని, గుడ్లప్పగించి చూడ్డం తప్ప జవాబు చెప్పలేక పోయేవాణ్ణి. ఆఖరికి విసిగిపోయి, ‘ఒరే, నాకు ఉర్దూలో మాట్లాడ్డం ఈ జన్మకి రాదు గానీ రెండు మూడు బూతు తిట్లు నేర్పించరా బాబూ.. నిన్ను తిట్టడానికి పనికొస్తాయి’ అని వాణ్ణి బతిమాలాను. వాడు బెట్టుచేసీ చేసీ చివరికి కొన్ని తిట్లు నేర్పించాడు. అవేమిటో ఇప్పుడెందుకులెండి.. బాగుండదు. (ఇన్నేళ్లలో ఆటో వాళ్లతో బేరాలు చేసే లెవెల్‌కి నా ఉర్దూ పాండిత్యం చేరుకుంది.)మాకు శిక్షణ కాలం ఏడాది అని చెప్పినా, మాలో కొంతమందికి అది మూడు నెలల ముచ్చటే అయింది. ‘వీళ్లకిక ట్రయినింగ్‌ అక్కర్లేదు.. డెస్క్‌లోకి లాగేద్దాం’ అని ఈనాడు ఎడిటర్లు తీర్మా నించుకొని నన్నూ, అమర్‌నీ, మరికొంత మందిని సోమాజీగూడా ఈనాడు మెయిన్‌ ఆఫీసుకి షిఫ్ట్ ‌చేశారు. మా అందరినీ సెంట్రల్‌ ‌డెస్కు, జనరల్‌ ‌డెస్కు, రిపోర్టింగుల్లో సర్దారు. ఆ రకంగా అక్కడ మా ప్రాక్టికల్‌ ట్రయినింగ్‌ ‌ప్రారంభమైంది. అప్పట్లో ఈనాడులో ఆరుగురు ఎడిటర్లు ఉండేవారు. టీవీ కృష్ణ గారు ఓవరాల్‌గా పేపర్‌ ‌ప్రొడక్షన్‌ ‌చూసేవారు. ఏబీకే గారు ఎడిటోరియల్స్ ‌రాసేవారు. వీ హనుమంతరావు స్టేట్‌ ‌వైడ్‌ ‌రిపోర్టింగ్‌ ‌నెట్‌వర్క్ ‌పర్యవేక్షించారు. పొత్తూరి వెంకటేశ్వర రావు గారు జనరల్‌ ‌డెస్క్, ఎడిట్‌ ‌పేజీ చూసేవారు. చలసాని ప్రసాద్‌ ‌గారు ఆదివారం అనుబంధం చూసేవారు. రాంభట్ల కృష్ణమూర్తి గారు మొత్తం సబ్‌ ఎడిటర్ల అడ్మినిస్ట్రేషన్‌ ‌వ్యవహారాలు చక్క బెట్టేవారు. వీరు కాకుండా మరో ఎడిటర్‌, ‌మా మేనమామ పన్యాల రంగనాథరావు గారు సితార పత్రిక వ్యవహారాలు చూసేవారు. చెప్పొచ్చేదేమిటంటే, ఈ జర్నలిస్టు దిగ్గజాలు కొలువు తీరి కూర్చునే సెకెండ్‌ ‌ఫ్లోర్‌లోనే మేం కూడా మాకప్పగించిన పని చేసుకుంటూ ఉండేవాళ్లం. వాడికున్న టాలెంట్‌ ‌వల్లనో, చొరవ వల్లనో అమర్‌ అం‌దరు ఎడిటర్లకి ఇష్టుడైపోయాడు. టీవీ కృష్ణ గారైతే మరీనూ. వాడిని సొంత కొడుకులా చూసేవారు. కృష్ణ గారు ఎడిట్‌ ‌పేజీలో ఒక కాలం రాసేవారు. రాయడమంటే కూర్చోబెట్టుకొని వ్యాసుడిలా డిక్టేషన్‌ ఇస్తుంటే, వీడు గణపతిలా టకటక రాసేవాడు. కాలం పేరు గుర్తు లేదు గానీ ఆయన ‘అసిత వర్ణ’ అనే కలం పేరుతో రాసేవారు. ‘అంటే ఏంటి సార్‌’ అని అడిగితే ‘అసిత వర్ణం అంటే కారు నలుపు అని అర్థం.. నేను నల్లగా ఉంటాను కదా, అందుకని..’ అని నిష్కపటంగా చెప్పారాయన. ఈ డిక్టేషన్‌ ‌పనికి ఎప్పుడూ ఆయన అమర్‌ ‌మీదే ఆధారపడే వారు. ఓసారి ఆయన్నే అడిగేశాను.. ‘సార్‌, ‌నేను కూడా రాస్తా’ అని. కృష్ణ గారు నవ్వేసి, ‘వాడి రైటింగ్‌ ‌బావుంటుందిరా అబ్బాయ్‌ !’ అనేశారు. కుళ్లుకుంటూ, పళ్లు నూరుకున్నాను.
నిజం చెప్పొద్దూ.. అమర్‌ ‌చేతిరాత చూడముచ్చటగా ఉంటుంది. జనరల్‌గా జర్నలిస్టులు స్పీడుగా రాస్తారు. అంత స్పీడులోనూ కుదురుగా రాసేవారు అరుదు. అలాంటి వాళ్లలో అమర్‌ ‌కూడా ఒకడు. (దస్తూరీ విషయంలో మిత్రుడు అల్లం నారాయణకి అగ్రతాంబూలం ఇవ్వాలి. ఎంత వేగంగా రాసినా ఆయన అక్షరాలు బారులు తీరిన ముత్యాల్లా ఉంటాయి.) ఈనాడు మెయిన్‌ ఆఫీసుకి షిఫ్ట్ అయ్యాక అక్కడ మాకో గొప్ప వరం దొరికింది. ఆ వరం పేరు సుబ్బారాయుడు. ఆయన జనరల్‌ ‌డెస్కులో న్యూస్‌ ఎడిటర్‌గా ఉండేవారు. సుబ్బారాయుడు గారిలో ఉండిన విప్లవ భావజాలంతో పాటు వృత్తి పట్ల ఆయన నిజాయితీ, నిబద్ధత, నిమగ్నత మమ్మల్ని ఎంతో ప్రభావితం చేసాయి. నువ్వు మంచి డాక్టరువి కావాలంటే మంచి కమ్యూనిస్టువి కావాలి, నువ్వు మంచి ఇంజనీరువి కావాలంటే మంచి కమ్యూనిస్టువి కావాలి’ అన్నాడు శ్రీశ్రీ.. మేం సుబ్బారాయుడి గారిని చూసి ‘నువ్వు మంచి జర్నలిస్టువి కావాలంటే మంచి కమ్యూనిస్టువి కావాలి’ అని అనుకునేవాళ్లం. అలాంటి మంచి జర్నలిస్టు శిష్యరికం వల్లే కాబోలు, తర్వాత కాలంలో అమర్‌ ‌జర్నలిస్టుల నాయకుడిగా ఎదిగాడనుకుంటున్నాను. (మరి నేను కూడా సుబ్బారాయుడి గారి శిష్యరికం చేశాను కదా.. నేనెందుకలా ఎదగలేదు ?.. మళ్లీ కుళ్లు..)
కొన్నాళ్లకి అనుకోని పరిస్థితుల్లో ముందు నేను, తర్వాత అమర్‌ ఈనాడు నుంచి బయటకు వచ్చేశాం. నేను ఆంధ్రప్రభలో, వాడు ఆంధ్రభూమిలో జాయిన్‌ అయ్యాం. కొన్నాళ్ల తర్వాత అమర్‌ ‌కూడా ఆంధ్రప్రభలో చేరాడు. ఈనాడు, ఆంధ్రప్రభ తర్వాత మేం ఇద్దరం కలిసి ఒకే ఆఫీసులో మళ్లీ ఎప్పుడూ పని చేయలేదు. ఎవరి దారి వారిదైంది. నా జీవితం పూర్తిగా పత్రికాఫీసులకే పరిమితమైపోతే, వాడి జీవితం జర్నలిస్టు ఉద్యమాలతో కూడా పెనవేసుకుపోయింది. ఏ ఊళ్లో జర్నలిస్టులు ఏ సమస్య మీద రోడ్డెక్కినా వెంటనే అక్కడికి వాలిపోయేవాడు. క్రమంగా రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి జర్నలిస్టు నాయకుడిగా ఎదిగాడు. ఈ మధ్యలో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ ‌బాధ్యతలు కూడా తలకెత్తుకున్నాడు.
తిరిగే కాలూ, వాగే నోరూ ఊరికే ఉండవు కదా ! ప్రెస్‌ అకాడెమీ చైర్మన్‌ ‌హోదాలో అమర్‌ ‌కాలికి బలపం కట్టుకుని జిల్లాలన్నీ తిరుగుతూ, జర్నలిస్టుకి ట్రైనింగ్‌ ‌క్లాసులు పెడుతూ, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ ‌కుర్చీలో యువరక్తం ఎక్కిస్తే ఎలా ఉంటుందో నిరూపించాడు. ముఖ్యంగా గ్రామీణ జర్నలిస్టుల్ని ప్రొఫెషనల్‌గా సాన పట్టడానికి తెగ తాపత్రయపడ్డాడు. ప్రెస్‌ అకాడెమీ కార్యక్రమాల మీద తన స్టాంపు వేశాడు.ఇప్పుడు అమర్‌ ‌జాతీయ స్థాయి జర్నలిస్టు నాయకుడిగా మరింత బిజీ అయిపోయాడు. ఫోన్‌ ‌చేస్తే, ‘అన్నా, అస్సాంలో ఉన్నా, అంటాడు. లేదా ‘అహ్మదాబాద్‌ ‌నుంచి ఇప్పుడే వచ్చా’ అంటాడు. ఇద్దరం సమవయస్కులం. ఇలా తిరగడానికి ఈ వయసులో వాడికెంత ఓపికో ? (దీనిక్కూడా కుళ్లుకోవాలా?). అసలే వెయ్యికాళ్ల జెర్రి.. ఆపై ఉద్యమాల వెర్రి.. ఇప్పుడు ప్రజా, సామాజిక ఉద్యమాల్లో కూడా జర్నలిస్టుల ప్రతినిధిగా హాజరు వేయించుకుంటున్నాడు. మొన్న తెలంగాణ ఉద్యమంలో, నిన్న రోహిత్‌ ఆం‌దోళనలో కూడా యాక్టివ్‌గా పాల్గొని తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాడు.
నలభై ఏళ్ల కిందట వర్కింగ్‌ ‌జర్నలిస్టులుగా ప్రారంభమైన మా ప్రయాణం ఇప్పటికీ కొన సాగుతోంది. ఈ నాలుగు దశాబ్దాల్లో సబ్‌ ఎడిటర్‌ ‌ట్రయినీ నుంచి ఎడిటర్‌ ‌దాకా జర్నలిస్టు డిజిగ్నేషన్లన్నీ అనుభవించేశాం. ప్రింట్‌ ‌మీడియాతో ప్రారంభమైన మేము కెరీర్‌ ‌నలభయ్యో ఏటా ఎలక్ట్రానిక్‌ ‌మీడియాలో ఉండడం, వేరు వేరు మీడియా సంస్థలకు కన్సల్టెంట్‌ ఎడిటర్లుగా ఉండడం కేవలం యాదృచ్చికం. ఎనిమిదేళ్లుగా ఎలక్ట్రానిక్‌ ‌మీడియాలో ఉన్నా టీవీ స్క్రీన్‌ ‌మీదకి వచ్చే సాహసం నేను చెయ్యలేదు గానీ.. అమర్‌ ‌మాత్రం బుల్లితెర మీద కూడా రాణిస్తున్నాడు. (ఫైనల్‌ ‌కుళ్లు). కాలమిస్టుగా, టీవీ ప్రెజెంటేటర్‌గా, జర్నలిస్టు నాయకుడిగా త్రివిక్రముడయ్యాడు.
నలభై ఏళ్ల కిందట, మార్చి 9వ తేదీన నాకంటికి టూత్‌ ‌పిక్‌ ‌లాగా కనిపించిన అమర్‌.. ఇప్పుడు ‘ట్రూత్‌ ‌పిక్‌’ ‌జర్నలిస్టుగా ఎదిగిపోయాడు.
ఎస్‌.. ‌నేనిప్పుడు మహదానందంగా కుళ్లుకుంటున్నాను.