అమెరికాలో సిక్కుపై జాతివివక్ష దాడి.

వాషింగ్టన్:
అగ్రరాజ్యం అమెరికాలో జాత్యహంకారం మరోసారి పడగవిప్పింది. గతవారం 50 ఏళ్ల ఓ సిక్కు వ్యక్తిపై ఇద్దరు అమెరికన్లు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. కాలిఫోర్నియాలోని కీస్ శివారు ప్రాంతంలో 50 ఏళ్ల సిక్కు వ్యక్తిపై ఇద్దరు అమెరికన్లు ఇనుప రాడ్‌తో పలుమార్లు దాడిచేసి చావబాదారు. దేశం విడిచి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేశారు. ‘‘ఇక్కడికి నిన్నెవరూ రమ్మనలేదు. నీ దేశానికి వెళ్లిపో. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంద’’ని హెచ్చరించారు. అతని ట్రక్కుపై స్ప్రే పెయింట్ తో హెచ్చరికలను రాశారు. దీనిని జాతి వివక్ష దాడిగా పరిగణించి దర్యాప్తు జరుపుతున్నట్టు స్టానిస్‌లాస్ కౌంటీ షరీఫ్ ఆడం క్రిస్టియన్‌సన్ తెలిపారు. బాధితుడి తలపై నిందితులు రాడ్ తో దాడి చేశారని.. అయితే తలకు పాగా ఉండడంతో పెను ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన బాధితుడికి వెంటనే చికిత్స అందించినట్టు చెప్పారు. కాలిఫోర్నియాలో ఇటీవలి కాలంలో సిక్కులపై దాడులు పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో సిక్కులు అధికంగా ఉంటారు. ఈ ఘటనతో స్థానిక సిక్కులు ఆందోళన చెందుతున్నారు.