అమెరికా నుంచి ఇక ‘గెంటివేత’.!!

ప్రకాశ్, న్యూఢిల్లీ:

విదేశీయులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ ప్రభుత్వం సోమవారం నుంచి పెద్ద షాకివ్వబోతోంది. అమెరికాలో పరిమిత గడువు ముగిసినప్పటికీ అక్రమంగా నివసిస్తున్న విదేశీయులందరినీ కొత్త నియమావళి కింద అక్టోబర్ 1 నుంచి బలవంతంగా వారి దేశాలకు పంపించనుంది. వీసా గడువు తీరిపోయిన వారు కాలపరిమితి పొడిగింపునకు చేసుకొన్న దరఖాస్తు ఏవైనా కారణాల వల్ల తిరస్కరణకు గురైతే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకోని వారిని, దరఖాస్తు తిరస్కరణకు గురైన వారు ఇంకా దేశంలోనే ఉన్నట్లయితే వారిని మాత్రమే దేశం నుంచి బహిష్కరించే నిబంధన అక్టోబరు 1నుంచి అమలు చేసేందుకు అమెరికా సిద్ధమైంది. అయితే ఇందుకోసం ఏర్పాటు చేసిన ఫెడరల్ ఏజెన్సీ హెచ్1బీ వీసాదారులకు మాత్రం పెద్ద ఊరటనిచ్చింది. ఉద్యోగ సంబంధ దరఖాస్తులు, మానవీయ అర్జీలు, పిటిషన్ల దరఖాస్తులకు ఈ కొత్త నియమం వర్తించదని తెలిపింది. ఈ కొత్త నిబంధన ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్లకు, దరఖాస్తు పెండింగ్‌లో ఉన్న వాళ్లకు వర్తించదు. అక్టోబర్ 1 నుంచి కొత్త నియమాలు అమల్లోకి తెస్తున్నట్టు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్(యుఎస్‌సీఐఎస్) ప్రకటించింది. సాధారణంగా వీసా గడువు ముగిశాక సగటున 240 రోజులు మాత్రమే అక్కడ ఉండేందుకు అనుమతిస్తారు. ఆలోపు వీసా గడువు పెంపు దరఖాస్తు తిరస్కరణకు గురైతే వెంటనే దేశం వదిలి వెళ్లిపోవాలి. అనధికారికంగా అక్కడే నివసించేవారికి యుఎస్‌సీఐఎస్ ‘నోటీస్‌ టు అప్పియర్’‌(ఎన్‌టీఏ) జారీ చేస్తుంది. ఇది జారీ చేస్తే సదరు ఉద్యోగులు ఉద్యోగం చేసే వీలుండదు. వీసా గడువు తీరిన వ్యక్తి ఇమ్మిగ్రేషన్‌ న్యాయమూర్తి ముందు హాజరయ్యేందుకు విచారణ సమయం వరకు మాత్రమే అమెరికాలో ఉండవచ్చు. ఆ సమయంలో అమెరికాలో లేకపోతే ఆ వ్యక్తిపై గరిష్ఠంగా ఐదేళ్ల పాటు అమెరికాలో ప్రవేశం నిషేధిస్తారు. వీసా గడువు పెంపు దరఖాస్తు తిరస్కరణకు గురయ్యాక కూడా ఏడాది పాటు అనధికారికంగా నివసిస్తే వారిపై పదేళ్ల నిషేధం అమలవుతుంది. వీసా గడువు పెంచుకోవడానికి లేదా, తమ స్టేటస్‌ మార్పుకోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైతే సదరు వ్యక్తులు వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది. వీళ్లకి ఎన్‌టీఏ నోటీసులు జారీ చేయరు. ఈ కొత్త నిబంధన ప్రభావం భారతీయులపైనే ఎక్కువగా ఉండనుంది. సుమారు 7 లక్షల మంది భారతీయులు హెచ్‌-1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఏటా అధిక సంఖ్యలో హెచ్‌-1బీ వీసాలు అందుకుంటున్నదీ భారతీయ నిపుణులే. ఇటీవల కాలంలో కాలపరిమితి పెంపు కోరుతూ దాఖలు చేసిన హెచ్1బీ వీసాదారుల అర్జీలు తిరస్కరించడం జరిగింది. ఇందులో అధిక శాతం భారతీయులు. కొత్త నియమం వల్ల భారతీయులే ఎక్కువగా ప్రభావితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల భారతీయ హెచ్1బీ వీసాదారులకు భవిష్యత్తులో గడ్డుకాలం ఎదురు కానుంది.