అమ్మవారి బోనాల జాతర ప్రారంభం.

హైదరాబాద్:
సికింద్రాబాద్ లష్కర్ బోనాలు మొదలయ్యాయి. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం తెల్లవారుజామున మొదలైంది. ఉదయం నాలుగు గంటల ఐదు నిమిషాలకు అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో.. బోనాలు వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు. పొద్దున్నే మంత్రి తలసాని శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాలకు భారీ ఏర్పాట్లు చేశామని.. భక్తులు సహకరించాలని కోరారు.ఉదయం 8 గంటలకు ఆద్యేయ నగర్ నుంచి వెయ్యి పదహారు మంది మహిళలు ర్యాలీగా వచ్చి అమ్మవారికి బోనం ఇస్తారు. తొమ్మిది గంటలకు… బంగారు బోనాన్ని తీసుకుని.. ఎంపీ కవిత ఊరేగింపుగా గుడికి వస్తారు. మంత్రులతో కలిసి బంగారు బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులు బంగారు ఖడ్గం, వజ్రాల ముక్కుపుడక, బొట్టులను… ఆలయ అధికారులకు అందించారు. తొలిసారిగా చేనేత సంఘం నేసిన ప్రత్యేక పట్టు చీరను సమర్పిస్తున్నారు.ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయానికి రానున్నారు. వీఐపీలు, రాజకీయ, సినీ ప్రముఖులు గుడికి వచ్చే అవకాశాలు ఉండటంతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉజ్జయిని మహంకాళి గుడి దగ్గర భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐదు క్యూ లైన్లలో ఒకేసారి అమ్మవారి దర్శనం చేయిస్తున్నారు. అర్ధరాత్రి నుంచే భక్తులు పెద్దసంఖ్యలో గుడికి వచ్చారు. బోనం తెచ్చే మహిళలకు… 15 నిమిషాల్లో దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు.అమ్మవారి దర్శనం కోసం లక్షలాది మంది తరలివచ్చే అవకాశంఉంది. భక్తుల కోసం 3 లక్షల వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. భక్తుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాత రాంగోపాల్ పెట్ నుంచి క్యూ ఏర్పాటు చేశారు. సుభాష్ రోడ్డు, జనరల్ బజార్ వంటి 12 ప్రాంతాల్లో స్వాగత తోరణాలు పెట్టారు. మొత్తం 128 సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. జాతరలో ప్రధాన ఘట్టం ‘రంగం’ సోమవారం వైభవంగా జరగనుంది.