‘అయోధ్య’పై సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి.

ప్రకాశ్,న్యూఢిల్లీ:
వివాదాస్పద అయోధ్య రామ మందిరం ఆందోళనపై నిర్మించిన చిత్రం ‘మొహల్లా అస్సీ’ విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రెండేళ్ల పాటు సెన్సార్ బోర్డుతో పోరాడిన నిర్మాతలు ఎట్టకేలకు విజయం సాధించారు. ఏ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రాన్ని నవంబర్ 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కాశీనాథ్ సింగ్ రాసిన కాశీ కా అస్సీ పుస్తకం ఆధారంగా నిర్మించిన మొహల్లా అస్సీ నిర్మాణం 2016లోనే పూర్తయింది. సినిమాలో అద్వానీ, లాలూ, ములాయం, బాబ్రీ, రామ్ మందిర్, భాజపా అంటూ రాజకీయ నేతలు, ప్రదేశాల పేర్లను యధాతథంగా వాడారని బోర్డు అభ్యంతరం తెలిపింది. ముఖ్యంగా ఆలయాన్ని కూల్చేసి ఆ ప్రదేశంలో మరుగుదొడ్డి నిర్మించాలని సంభాషణల్లో పలికించడం మనోభావాలను దెబ్బ తీస్తుందని తెలిపింది. దీంతో నిర్మాతలు ఫిలిం సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎఫ్ సీఏటీ)కి వెళ్లారు. సీబీఎఫ్ సీ, ఎఫ్ సీఏటీ.. రెండూ సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇవ్వలేదు. చంద్రప్రకాష్ ద్వివేదీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో 1990-1998 మధ్య జరిగిన రామ జన్మభూమి, మండల్ కమిషన్ సిఫార్సుల అమలు వంటి వివాదాస్పద రాజకీయ ఘటనలను చూపించడమే కాకుండా పలు సంభాషణలు అశ్లీలంగా, రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని.. మత విద్వేషాలు చెలరేగే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. 24 నెలల పాటు 13 విచారణల అనంతరం తమ న్యాయపోరాటం విజయవంతం కావడంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. సెన్సార్ అధికారులు చెప్పిన కత్తిరింపులు లేకుండా విడుదల చేస్తున్నట్టు దర్శకనిర్మాతలు తెలిపారు.