అయ్యో ! సుమన్….. కష్టం!!

ఎస్.కె.జకీర్.
చెన్నూరు అభ్యర్థిని మార్చేదిలేదని టిఆర్ఎస్  సంక్షోభ పరిష్కర్త మంత్రి కేటీఆర్ శుక్రవారం తెగేసి చెప్పారు. పెద్దపల్లి మాజీ ఎంపీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ జి.వివేక్ తో పాటు ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ నాయకులు మంత్రి కేటీఆర్ ను కలిశారు. చెన్నూరు టికెట్ తన సోదరుడు వినోద్‌కు ఇవ్వాలని మాజీ ఎంపీ వివేక్ కోరారు. అందుకు కేటీఆర్ నిరాకరించారు. చెన్నూరు నుంచి అసెంబ్లీకి టిఆర్ఎస్ తరపున పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ పోటీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థిని మార్చడం సాధ్యం కాదని కేటీఆర్ స్పష్టం చేసినట్లు తెలియవచ్చింది. సుమన్ గెలుపు కోసం తాము పనిచేయలేమని వివేక్‌ అనుచరులు అభిప్రాయపడినట్టు తెలుస్తున్నది. తమ దారి తాము చూసుకుంటామని కూడా చెన్నూరు నాయకులు వివేక్‌కు తెలియజేశారని సమాచారం. ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. చెన్నూరులో మాజీ ఎమ్మెల్యే నల్లాలఓదెలు తో సమస్య పరిష్కారమైందనుకుంటే కొత్తగా వివేక్ అనుచరుల రూపంలో అసమ్మతి బయలుదేరింది. దీంతో బాల్క సుమన్‌కు చిక్కులుతప్పేలా లేవని అర్ధమవుతున్నది. చెన్నూరు టికెట్ కోసం టీఆర్‌ఎస్‌లో చెలరేగిన చిచ్చులో ఓ కార్యకర్త బలైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే నల్లాలఓదేలుకుటికెట్టురానందుకు ఆయన అనుచరుడు గట్టయ్యనిప్పంటించుకొని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ టిక్కెట్‌ కేటాయింపు విషయంలో నల్లాలఓదేలు ఎంపీ బాల్క సుమన్ మధ్య వర్గ పోరు మొదలైన విషయం తెలిసిందే. ఇందారంలో సెప్టెంబర్ 12న బాల్క సుమన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించినపుడుఆయనకు వ్యతిరేకంగా ఓదేలు అనుచరులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గొడవలు జరిగాయి. రేగుంటగట్టయ్య అనే కార్యకర్త తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. 60శాతానికి పైగా కాలిన గాయాలతో మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గట్టయ్య సెప్టెంబర్18న కన్ను మూశాడు. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది. గట్టయ్య ఆత్మహత్యాయత్నం తర్వాత నల్లాలఓదేలుమరింతగా స్వరం పెంచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గట్టయ్యను పరామర్శించారు. అనంతరం ఓదెలు కేసీఆర్‌ను కలిశారు. కేసీఆర్ ఇచ్చిన హామీ పూర్వాపరాలు వెల్లడి కాలేదు కానీ ఓదెలు శాంతించారు. తర్వాత బాల్క సుమన్‌ కు తన మద్దతు ప్రకటించారు. తాజాగా తన సోదరుడు వినోద్ కు చెన్నూరు కేటాయించాలని వివేక్ కోరడం చెన్నూరు రాజకీయవర్గాలలో చర్చకు దారి తీస్తున్నది. గట్టయ్య ఆత్మాహుతి ఘటన తర్వాత బాల్క సుమన్ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో క్షేత్రస్థాయి ప్రచారం జరిపిన దాఖలాలు చాలా తక్కువ. ఆ నియోజకవర్గానికి చెందిన ముఖ్య కార్యకర్తలను ఆయన హైదరాబాద్ కు పిలిపించుకొని మాట్లాడి పంపుతున్నట్టు టిఆర్ఎస్ వర్గాలంటున్నవి.