అవి సాధారణ బదిలీలే.

హైదరాబాద్:
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు సంద ర్భంగా చేసిన ఉద్యోగుల బదిలీలను సాధారణ బదిలీలుగా నే పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అలాం టి ఉద్యోగులకు ప్రస్తుతమున్న స్థానం ఆధారంగానే ‘బదిలీ సర్వీసు’ను లెక్కలోకి తీసుకోవాలని సూచించింది.బదిలీల మార్గదర్శకాల్లో పేర్కొన్న ‘క్వాలిఫయింగ్‌ సర్వీస్‌ స్టేషన్‌’అంటే బదిలీ జరగాల్సిన ఉద్యోగి వాస్తవంగా పనిచేస్తున్న స్థానం అని.. అతడి సంస్థ, కార్యాలయం కాదని తెలిపింది. ప్రభు త్వోద్యోగుల సాధారణ బదిలీలకు అనుమతినిస్తూ మే 24న జారీ అయిన మార్గదర్శకాలపై సందేహాలు వ్యక్తమవడంతో ఆయా అంశాలపై స్పష్టతనిస్తూ ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కొనసాగినప్పుడు మల్టీజోన్‌–2 పరిధిలో తెలంగాణకు చెందిన మొత్తం 10 ఉమ్మడి జిల్లాలు ఉండేవి. రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో.. ఈ మల్టీజోన్‌– 2 కేడర్‌ ఉద్యోగుల బదిలీల బాధ్యతలను రాష్ట్ర కేడర్‌ ఉద్యోగుల బదిలీల కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ ముఖ్య కార్యదర్శి/ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలకు అప్పగించాలి.రంగారెడ్డి, హైదరాబాద్‌లోని కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల సర్వీసు స్థలా న్ని హైదరాబాద్‌గా పరిగణించాలి.ఉద్యోగుల డిప్యుటేషన్‌ వ్యవధిని కూడా అర్హత సర్వీసు కాలం కింద లెక్కించాలి. 40 శాతం ఉద్యోగుల బదిలీలకు అనుమతించడంతో ఈ లెక్కను మంజూరైన పోస్టుల సంఖ్య ఆధారంగా కాకుండా వాస్తవంగా పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఆధారంగా నిర్ధా రించాలి. జీవిత భాగస్వామి వేరే జిల్లా/ జోనల్‌/ మల్టీ జోనల్‌/ స్టేట్‌ కేడర్‌ పరిధిలో పనిచేస్తున్నందున స్పౌజ్‌ కేటగిరీ కింద ఎవరైనా ఉద్యోగి ప్రాధాన్యత బదిలీ కోరితే… ఆ ఉద్యోగి జిల్లా/ జోనల్‌/ మల్టీ జోనల్‌/ స్టేట్‌ కేడర్‌ పరిధిలోనే.. జీవిత భాగస్వామి పనిచేసే చోటుకు దగ్గరగా ఉండే స్థానానికి బదిలీ చేయాలి. భార్యాభర్తలిద్దరూ ఒకే స్థానంలో పనిచేస్తూ ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే.. వారిని కూడా తప్పనిసరిగా బదిలీ చేయాలి. సాధ్యమైతే వారిని ఒకే స్థానానికి లేదా సమీప స్థానాలకు బదిలీ చేయాలి.కొత్త జిల్లాలకు వెళ్లినవారికి ప్రస్తుతం బదిలీ లేనట్టే.
జిల్లాల పునర్విభజన 2016 అక్టోబర్‌ 11 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పుడు ప్రభుత్వం కొత్త జిల్లాల్లోని కొత్త ప్రభుత్వ కార్యాలయాలకు వేలాది మందిని బదిలీ చేసింది. వారు ఇంకా రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకోలేదు. సాధారణ బదిలీల నిబంధనల ప్రకారం ఏదైనా స్థానంలో కనీసం రెండేళ్లుగా కొనసాగుతున్న ఉద్యోగులే బదిలీలకు అర్హులు. అంటే వీరం తా తాజా బదిలీలకు అర్హత కోల్పోయినట్టే.