అస్తమించిన ‘ఎర్రసూర్యుడు’.

ప్రముఖ నటుడు మాదాల రంగారావు కన్నుమూత
హైదరాబాద్‌:
ప్రముఖ నటుడు, నిర్మాత మాదాల రంగారావు(69) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ‘ఎర్రమల్లెలు’, ‘విప్లవశంఖం’, ‘స్వరాజ్యం’, ‘ఎర్ర సూర్యుడు’, ‘ఎర్రపావురాలు’, ‘జనం మనం’, ‘ప్రజాశక్తి’ తదితర చిత్రాల్లో నటించిన రంగారావు రెడ్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. 80వ దశకంలో ప్రేమకథా చిత్రాల హవా నడుస్తున్నా.. విప్లవాత్మక చిత్రాలను నిర్మించి మంచి విజయాలను అందుకున్నారు. నవతరం ప్రొడక్షన్స్‌ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించిన రంగారావు ప్రజా నాట్యమండలిలో క్రియాశీల సభ్యుడిగా పనిచేశారు. ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ, నిర్మాత పోకూరి బాబూరావు ఈయన సహాధ్యాయులు. నవతరం ప్రొడక్షన్స్‌ పతాకంపై మాదాల రంగారావు 1980లో తీసిన ‘యువతరం కదిలింది’ చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి బంగారు నంది పురస్కారం లభించింది. వామపక్ష భావజాలం కలిగిన రంగారావు.. అవినీతి, అణచివేత లాంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలు రూపొందించారు…