ఆంధ్ర తీరానికి ‘తిత్లీ’ తుపాను ముప్పు!!

ప్రకాశ్, న్యూఢిల్లీ:
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారింది. ప్రస్తుతం ఈ తుఫాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీనికి భారత వాతావరణ శాఖ తిత్లీగా నామకరణం చేసింది. తుపాను తిత్లీ ప్రస్తుతం ఒడిషాలోని గోపాల్ పూర్ కు 530 కి.మీలు, ఆంధ్రప్రదేశ్ లోని కళింగపట్నంకు 480 కి.మీల దూరంలో కేంద్రకృతమై ఉంది. తిత్లీ తుపాను పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 8కి.మీల వేగంతో కదులుతోంది. పశ్చిమ వాయవ్య దిశగా కొన్ని గంటలపాటు ప్రయాణించి ఈ నెల 11న కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటి పశ్చిమ బెంగాల్ వైపు కదిలే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 12 గంటల్లో ఒడిషాకు భారీ వర్షసూచన ఉన్నట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఒడిషాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. తుపాను ప్రభావంతో సముద్ర తీరం వెంబడి గంటలకు 70-80 కి.మీల వేగంతో గాలులు వీస్తాయి. ఎత్తైన అలలతో సముద్రం విపరీతమైన అలజడిగా ఉంటుంది. అందువల్ల మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని సూచించారు. విశాఖపట్నం, భీమునిపట్నం, కళింగపట్నం, గంగవరం పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర తుపాన్ గా మారే అవకాశం ఉన్నట్టు తెలిసింది. తీవ్ర తుపానుగా మారినపుడు తీరం వెంబడి గంటకు 100-125 కి.మీ.ల వేగంగా గాలులు వీయవచ్చు.