ఆగస్టు 4 న పగలే వెన్నెల:

హైదరాబాద్:
కొద్ది రోజులుగా ఆకాశంలో అన్నీ వింతలే. బ్లడ్ మూన్, సుదీర్ఘ సంపూర్ణ చంద్ర గ్రహణం, భూమికి దగ్గరగా వచ్చి కంటికి కనిపించిన అంగారక గ్రహం.. ఇప్పుడు చెప్పబోయేది మరీ వింత. రాత్రి చల్లని వెన్నెలలు విరజిమ్మే చందమామ పట్టపగలు కూడా కనిపించబోతున్నాడు. అదీ ఒక రోజు కాదు. ఈ వారమంతా. అంటే ఆగస్ట్ 4 వరకు పగటిపూట చంద్ర బింబం అగుపిస్తుంది. సాధారణంగా సూర్యోదయం కాగానే మబ్బుల్లో దాగాల్సిన చంద్రుడు శనివారం వరకు అందుకు భిన్నంగా పొద్దు పొడిచినా దర్శనమిస్తాడు. పొద్దెక్కే కొద్దీ మెల్లగా మాయమవుతాడు.ఇది చంద్రుని క్షీణించే గిబ్బోస్ దశలో భాగమని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు. తన కక్ష్యలో పరిభ్రమిస్తూ చంద్రుడు భూమికి దగ్గరగా వస్తున్నపుడు ఇలా జరుగుతుందని అంటున్నారు. సంపూర్ణ చంద్ర గ్రహణ సమయంలో చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళరేఖపైకి వచ్చాయి. తిరిగి చంద్రుడు, సూర్యుడు తమ స్థానాలకు చేరుకున్నా భూమి నుంచి చంద్రుని స్థానం కొద్దిగా మారిన కారణంగా చంద్రోదయం, చంద్ర అస్తమయం అలస్యంగా జరుగుతున్నాయి. దీనినే గిబ్బోస్ దశగా అని పిలుస్తారు.చంద్రుడు రాత్రి ఆలస్యంగా ఉదయించి ఆలస్యంగా అస్తమిస్తాడు. భారత్ లో చంద్రుడు రాత్రి 11 గంటలకు కనిపిస్తాడు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు అస్తమించడు. దీంతో ఆగస్ట్ 4 వరకు సూర్యోదయ సమయంలో చంద్రుడు భూమికి పశ్చిమంగా మధ్యాహ్నం వరకు దర్శనమిస్తాడు.