ఆజాద్ మండించిన ‘కుంపటి’. టి కాంగ్రెస్ కు బూస్ట్.

ఎస్.కె.జకీర్.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో టిఆర్ఎస్ పాత్ర సూది మొన అంత కూడా లేదని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు కాకతాళీయం కాదు. ఉద్దేశపూర్వకంగానే ఈ బాంబు పేల్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గల కారణాలపై ఇంతకాలం టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆ పార్టీ నాయకులు చెబుతూ వస్తున్న కథనాలకు భిన్నమైన కోణాన్ని ఆజాద్ ఆవిష్కరించి సంచలనం సృషించారు. టిఆర్ఎస్ తో చర్చలు కూడా జరపలేదని ఆజాద్ అన్నారు. తాము విత్తనాలు వేసి, నీళ్లు పెట్టి, ఎరువులు ,పురుగుమందులు చల్లి పంట పండిస్తే ఆ పంటను టిఆర్ఎస్ కోసుకుపోయిందంటూ ఆయన చెలరేగిపోయారు.కాంగ్రెస్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఒత్తిడి వల్లనే తెలంగాణా ను ఇచ్చామన్నది గులాం నబీ ఆజాద్ సారాంశం. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ కు చెందిన నాటి తెలంగాణ ఎంపీలు కీలక భూమిక పోషించినట్టు ఆజాద్ చెప్పారు. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అటు రాజ్యసభలో, ఇటు లోక్ సభలోను సొంత పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడం, లేదా మోకరిల్లడం వంటి పరిణామాలన్నీ తెలంగాణ రాష్ట్ర అవతరణకు దారులు నిర్మించాయి.ఆలస్యమైనప్పటికీ2014 ఎన్నికల కు ముందు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న వారి ‘కాంట్రిబ్యూషన్’ ను ఆజాద్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు చాటి చెప్పారు. ఇది సంతోషించదగిన పరిణామం. ఆ పని ఇన్నాళ్లుగా ఎవరు చేయలేదు. పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ వంటి ఎంపీల కృషి తెలంగాణా ఏర్పాటులో చాలా ఉంది. తమ పార్టీ ఎంపీల ప్రయత్నాలను, వారి పోరాటాన్ని కాంగ్రెస్ నాయకత్వం విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. పైగా మాజీ ఎంపీలెవరు ‘ముఖ్యమంత్రి’ రేసులోను లేరు.

ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్టు చెప్పుకునే నాయకులు, లేదా ముఖ్యమంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న వారు, ఆ పదవి కోసం బెంగ పెట్టుకున్న వారు ఎంపీల కృషిని ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేశారని అనుకోవలసివస్తున్నది. ఆ విషయం ప్రస్తుతం టిఆర్ఎస్ లో కొనసాగుతున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ డాక్టర్ జి. వివేక్, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావుకు బాగా తెలుసు. కానీ వారిప్పుడు కేసీఆర్ నీడ పట్టున ఉన్నారు. వారి స్పందన మరోలా ఉండవచ్చు. రాజ్యసభ, లోక్ సభ కార్యకలాపాలను 12 సార్లు కాంగ్రెస్ సభ్యులు తెలంగాణ అంశంపై అడ్డుపడిన విషయాన్ని కూడా ఆజాద్ గుర్తు చేసారు. ‘కేసీఆర్ పచ్చి అబద్ధాలకోరు. తెలంగాణ ఏర్పడకముందు నుంచే ఆయన అబద్ధాలు చెప్పడం మాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ లో టిఆర్ఎస్ ను విలీనం చేస్తానని హామీ ఇచ్చి దాన్ని తుంగలో తొక్కారు’ అంటూ గులాం నబీ ఆజాద్ మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను ఆజాద్ చాలా కాలం పర్యవేక్షించారు. 2004 లో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీరీల మధ్య ఎన్నికల పొత్తులోను ఆయన భాగస్వామ్యం కీలకమైనది. కేసీఆర్ తో చర్చలు జరిపి, పొత్తులకు మార్గం సుగమం చేసిన వ్యక్తి ఆజాద్. ఆయనకు తెలంగాణ గురించి బాగా తెలుసు. తెలంగాణ ఓటర్ల మనోగతం, ప్రజాభిప్రాయం, రాజకీయ పార్టీల బలాబలాలపై ఆయనకు పరిపూర్ణమైన అవగాహన ఉన్నది. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల బలహీనతల వల్ల, వారి పేలవమైన పని తీరు వల్ల కేసీఆర్ పార్టీ తెలంగాణలో శక్తిమంతంగా మారిందన్నది ఆజాద్ అంచనా. అందుకే ఆయన తెలంగాణ రాష్ట్ర అవతరణ మూలాల్లోకి వెళ్లారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు వెనుక కేసీఆర్ లేదా టిఆర్ఎస్ పాత్ర శూన్యమని చెప్పడం ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో, ప్రజల్లో బలమైన సంకేతాలు పంపే ప్రయత్నం చేశారు. ”కేసీఆర్ మాటలు నమ్మొద్దు” అని ఆయన ఒక మెసేజ్ పంపించే ప్రయత్నం చేశారు. టిఆర్ఎస్ వల్లనే తెలంగాణ ఏర్పడిందనే ప్రచారానికి తెరదింపాలని గులాం నబీ ఆజాద్ ప్రయత్నించినట్టు కనిపిస్తున్నది.

2014 లో పార్టీ చేసిన కొన్ని తప్పిదాలు, మితి మీరిన అంచనాలు, సమన్వయలోపం వల్ల తెలంగాణ లో కాంగ్రెస్ అధికారం చేబట్టలేకపోయిందన్నది ఆయన విశ్లేషణ. అందువల్ల అవి రిపీట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కేసీఆర్ మళ్లి అధికారంలోకి రాకుండా కట్టడి చేయవచ్చునని ఆయన భావన. కేసీఆర్ సంగతి గులాంనబీ ఆజాద్ కు, మరికొందరు ఢిల్లీ కాంగ్రెస్ నాయకులకు తెలిసినంతగామరెవరికీ తెలియదు. తామే ‘తెలంగాణ చాంపియన్ల’మని గట్టిగా వాదించి, క్లెయిమ్ చేసి టిఆర్ఎస్ 2014లో అధికారంలోకి వచ్చింది. ప్రజల్ని కన్విన్సు చేయడంలో, నచ్చజెప్పడంలో కేసీఆర్ కు మించిన వారు లేరు. ప్రజలు కూడా కేసీఆర్ మాటలకు మంత్రముగ్ధులుకాకతప్పదు. ఈ సారి కేసీఆర్ తన పాలనపై ప్రజల తీర్పు కోరుతున్నందున, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేసీఆర్ పాత్ర శూన్యమనే వాదనను ముందుకు నెట్టి ఎన్నికల ప్రచారం ఎజండాను మలుపు తిప్పడానికి గాను కాంగ్రెస్ నాయకుడు ఆజాద్ గొప్ప వ్యూహానికి పదును బెట్టారనిఅర్ధమవుతున్నది. అయితే ఆజాద్ వ్యూహాన్ని ప్రజల్లోకి తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ఎంత బలంగా తీసుకువెళతారో, అది ఎంతగా ఫలితమిస్తుందో చూడాలి.