ఆత్మహత్యలు పరిష్కారం కాదు. -అల్లం నారాయణ.

హైదరాబాద్:
సిద్ధిపేట జిల్లా కొండపాక ఆంధ్రభూమి రిపోర్టర్ హనుమంతరావు, భార్య, ఇద్దరు పిల్లలతో కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం విషాదకరం అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఈ బలవన్మరణాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాదు గ్రామీణ విలేకరుల, సగటు జర్నలిస్టుల ఆర్థిక దుస్థితిని ఈ ఉదంతం తెలియజేస్తున్నదన్నారు.
అందిన సమాచారం మేరకు ఒక కంపెనీ నుండి రావలసిన డబ్బులు రాకపోవడం, ఇతర ఆర్థిక ఒత్తిళ్ల వలన జర్నలిస్టు హనుమంతరావు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నదని చెప్పారు. ఎంతటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆత్మహత్యలు పరిష్కారం కాదని అన్నారు. జర్నలిస్టులు అన్ని సమస్యలను అవగాహన చేసుకునే వారు కాబట్టి సమస్యలున్నపుడు ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని గుర్తించాలన్నారు. జర్నలిస్టులు ధైర్యంగా ఉండాలని, సమస్యలను ఎదుర్కొని నిలబడాలని విజ్ఞప్తి చేశారు. హనుమంతరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మీడియా అకాడమీ ఆ కుటుంబానికి అన్ని రకాల అండగా ఉంటుందని తెలియజేశారు.