‘ఆదివాసీ’ వివాదానికి ముగింపు ఎన్నడు.

ఆదిలాబాద్;
చర్చలకు తాము సిద్ధమేనని ఆదివాసీ సంఘాల నాయకులు చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వంలో లేదు. ఆదివాసీ – లంబాడాల వివాదం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేవరకు ఈ వివాదాన్నీ ఇలాగే ఉంచాలని ప్రభుత్వం భావిస్తుండవచ్చు. ప్రతిపక్ష పార్టీలు ఈ సున్నితమైన సమస్యపై ఎందుకు నోరెత్తడం లేదు. ఆదివాసీ-లంబాడా మధ్య ఆధిపత్యపోరు చల్లారేలా కనిపించడం లేదు. అధికారుల చొరవతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో శాంతిభద్రతలు ప్రస్తుతం ప్రశాంతంగానే ఉన్నట్లు కనిపిస్తున్నా సమస్యను త్వరగా పరిష్కరించకపోతే మళ్లీ అలజడులు రేగే ప్రమాదం పొంచి ఉంది. లంబాడాలను ఎస్టీ జాబితాలోంచి తొలగించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఆదివాసీలు ఉద్యమం చేపట్టారు. తమ గూడేల్లోకి లంబాడా ఉద్యోగ ఉపాధ్యాయులను రానివ్వడం లేదు. జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో చాలాకాలంగా రెండు వర్గాల మధ్య వైరం కొనసాగుతోంది. గత పాలకులు ఎప్పటికప్పుడు కంటి తుడుపు హామీలు ఇచ్చి కాలం వెళ్లదీయడంతో వ్యవహారం జటిలంగా మారింది. ఆర్టికల్‌ 342 ప్రకరణ 366 నిబంధన 25 ప్రకారం 30 ఆదిమ తెగలను షెడ్యూల్డ్‌ తెగలుగా గుర్తించారు. ఆ తర్వాత లంబాడాలకు ఎస్టీ రిజర్వేషన్‌ వర్తించడంతో వారు విద్య.. ఉపాధి.. రాజకీయరంగాల్లో రాణించసాగారు. దీంతో రిజర్వేషన్‌ల ఫలాలు లంబాడాలకే దక్కుతున్నాయంటూ కొన్నేళ్లుగా ఆదివాసులు ఆందోళన చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కైత లంబాడ, బోయ వాల్మీకి తదితర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం చెల్లప్ప కమిషన్‌ను నియమించింది. దీంతో ఆదివాసుల ఆగ్రహజ్వాలలపై ఆజ్యం పోసినట్లయ్యింది.. గిరిజన రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన తొమ్మిది శాతానికి పెంచుతూ చెల్లప్ప కమిషన్‌ సిఫారసు చేయడం,దానికి ప్రభుత్వం ఆమోదం తెలపడం వంటి పరిణామాలు ఆదివాసుల్లో అలజడికి కారణాలయ్యాయి. ఈ క్రమంలో తొలుత మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వలస లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఉద్యమం ప్రారంభించిన ఆదివాసులు .. ఏడాది కాలంగా మొత్తం లంబాడాలనే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. 1976లో లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశానికి పార్లమెంట్‌ ఆమోదం లేదని వాదిస్తున్నారు. దీనిని ఊటంకిస్తూ ఆదివాసీ సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఆదివాసులు గత ఏడాది కుమ్రం భీమ్‌ వర్ధంతికి ముందు రోజు అక్టోబర్‌ అయిదున జోడేఘాట్‌ కుమ్రం భీమ్‌ మ్యూజియంలో ఉన్న లంబాడాల ఆరాధ్య దైవం సాంకీమాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లంబాడాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. స్పందించిన పోలీసులు ఆదివాసీ నేత సోయం బాపురావు సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. దీనిపై అదే నెల 12న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భీమ్‌ వర్ధంతి కార్యక్రమాల పేరిట భారీ ధర్నా.. ర్యాలీ.. రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ చంపాలాల్‌ను బదిలీ చేయాలన్న డిమాండ్‌తో కలెక్టరేట్‌పై దాడి చేశారు. దీంతో వివాదం క్రమేపీ శాంతిభద్రతల సమస్యగా రూపాంతరం చెందింది. ఆ తర్వాతి పరిణామాలతో ఆదివాసులు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. అటు లంబాడాలు పోటీ ర్యాలీలు చేపట్టారు. ఉద్యమాలను నియంత్రించే విషయంలో అధికారులు ముందు చూపుతో వ్యవహరించకపోవడం.. బాధ్యతగల ప్రజాప్రతినిధులు అసలు పట్టించుకోకపోవడంతో వివాదం ముదిరింది. పలు చోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో నార్నూర్‌ మండలం బేతాళగూడలో ఆదివాసీల ఆరాధ్యదైవం కుమ్రంభీమ్‌ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆదివాసులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ బేతాళగూడ నుంచి ఉట్నూరు వరకు ర్యాలీగా తరలివచ్చారు. తిరిగి వెళుతున్న క్రమంలో హస్నాపూర్‌ దగ్గర ఆదివాసీలు-లంబాడాల మధ్య ఘర్షణ తలెత్తింది.. హస్నాపూర్‌తో పాటు ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూరులోనూ భారీ విధ్వంసం జరిగింది. విధ్వంసం తర్వాతగానీ ప్రభుత్వం స్పందించలేదు.. ఆదివాసీలతో చర్చలు జరిపి పలు హామీలు ఇచ్చింది..అవి పరిష్కారానికి నోచుకోకపోవడంతో మళ్లీ ఉద్యమం ఊపందుకుంది.. జీవో నంబర్‌ మూడు ప్రకారం ఐటీడీఏలోని 23 శాఖలలో ఆదివాసీలకు మాత్రమే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వచ్చే నెల 20 వరకు ప్రభుత్వానికి విన్నవించిన సమస్యలను పరిష్కరించకపోతే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదివాసీలందరితో కలిసి ఇంద్రవెల్లిలో భారీ సభ ఏర్పాటు చేసి…పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఆదివాసీ నేత.. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు స్పష్టం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదంటున్నారు. 2019 ఎన్నికల్లో ఆదివాసీల బలమెంతో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో లంబాడా నేతలు దీనికి ఆక్షేపిస్తున్నారు. ప్రభుత్వం ఆదివాసీ అనుకూల నిర్ణయాలతో తమకు అన్యాయం చేస్తే సహించేది లేదంటున్నారు. ఆదివాసీ ఉద్యమానికి కాంగ్రెస్‌ నేతలైన సోయం బాపురావు.. ఆత్రం సక్కులు నాయకత్వం వహిస్తున్నారని.. దీనిపై కాంగ్రెస్‌ అధినాయకత్వం స్పందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. లంబాడాలను ఆదివాసీ నేతలు అవమానిస్తున్నా.. కాంగ్రెస్‌ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇది రాజకీయంగానూ అధికార టీఆర్‌ఎస్‌- ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లోనూ కాక పుట్టిస్తోంది.. జిల్లా నేతలు ఏం మాట్లాడినా రాష్ట్ర స్థాయి నాయకులు మాత్రం వివాదంపై పెద్దగా స్పందించడం లేదు. ఆదివాసీ-లంబాడాల మధ్య వివాదానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించడం మినహా.. నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడంలో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. ఏది మాట్లాడితే ఏం జరుగుతుందోనని.. ఎన్నికల దాకా ఈ వివాదాన్ని అసలు పట్టించుకోకూడదన్న భావన అధికార-విపక్ష నేతలలో కనిపిస్తోంది.