ఆమె ఐఏఎస్ టాపర్ కాదు!!

న్యూఢిల్లీ:

ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ షేర్ అవుతోంది. ఇందులో ఒక యువతి మనిషి లాగే రిక్షాను లాగుతోంది. సీటుపై ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. ఈ ఫోటో మీద హృదయాన్ని హత్తుకొనే మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ ఏంటంటే ‘ఐఏఎస్ టాపర్ అయిన యువతి తన తండ్రిని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. యువతికి, ఆమె తండ్రికి వందనం’. ఇది మొదట ‘సిల్చార్ డైరీ’ అనే ఫేస్ బుక్ పేజీలో షేర్ చేశారు. ఆ తర్వాత ఇది ఎంతలా వైరల్ అయిందంటే ఇప్పటివరకు సుమారుగా 40 వేల మందికి పైగా ఈ పోస్ట్ ని షేర్ చేశారు.కాంగ్రెస్ నేత అస్లమ్ బాషా ఈ ఫోటోని ముందుగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి 2,600కి పైగా లైకులు వచ్చాయి.

దానిని మరో కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ రీట్వీట్ చేశారు. అలా సామాన్య పౌరుల నుంచి బడా నేతల వరకు అంతా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ ల ద్వారా ఈ ఫోటోని వైరల్ గా మార్చారు. నిజానికి ఈ ఫోటోని షమోనా పోద్దార్ అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఈ ఏడాది ఏప్రిల్ లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ చదివితే ఆ అమ్మాయికి రిక్షావాలాకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఆ పోస్టులో ఆమె రిక్షావాలాల గురించి తన ఆలోచనలు ఎలా మారాయో వివరించింది. సానుభూతి, లాగేందుకు కావాల్సిన శారీరక దారుఢ్యం, రద్దీలో ఎంత జాగ్రత్తగా నడుపుతారోనని చెప్పింది. ఆ పోస్టుని సుమారుగా 14,000 మంది లైక్ చేశారు.

పోద్దార్ ఒక ట్రావెల్ బ్లాగర్. ఐఏఎస్ టాపర్ కాదు. కానీ సరదాగా తీయించుకొన్న ఫోటోతో ఐఏఎస్ టాపర్ గా మారిపోయింది. తన ఫోటో ఇంత వైరల్ కావడంపై షమోనాయే ఆశ్చర్యపోతోంది. మొదట తను పోస్ట్ చేసినపుడు కూడా వైరల్ అయింది కానీ ఇంత వేలంవెర్రి కాలేదంది.