ఆమ్ చూర్ రైతుల గోస.

నిజామాబాద్:

ఆమ్ చూర్ అమ్మకానికి పెట్టింది పేరు నిజామాబాద్ జిల్లా. ఎంతో కష్టపడి తయారు చేసిన ‘ఆమ్ చూర్’ రైతులకు.. మార్కెట్ లో నిరాశే ఎదురవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్నా.. మామిడి రైతులకు మాత్రం మద్దతు ధర అందడం లేదు. దీంతో తీవ్ర అవేదనకు గురవుతున్నారు రైతులు.రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మామిడి రైతులు.. నిజామాబాద్ జిల్లా మార్కెట్ నుంచే ఆమ్ చూర్ ను విక్రయిస్తారు. కాయకోతకు రావడం, అకాల వర్షాలతో పడిపోయిన కాయను ఆమ్ చూర్ గా తయారు చేసి.. నిజామబాద్ మార్కెట్ యార్డుకు భారీగా తీసుకొస్తున్నారు. దీంతో మార్కెట్ ఆమ్ చూర్ రాసులతో నిండిపోతోంది.
అయితే కొందరు రైతులు తమ సొంత మామిడి చెట్లకు కాసే మామిడి కాయలతో ఆమ్ చూర్ తయారుచేస్తుండగా, మరికొందరు చెట్టును కౌలుకు తీసుకుని తయారు చేస్తుంటారు. ఒక్కొ చెట్టుకు నాలుగు నుంచి ఆరు వేల రూపాయలు చెల్లిస్తున్నారు. అయితే గతేడాది 30 వేలు పలికిన ఆమ్ చూర్ ధర ప్రస్తుతం పద్దెనిమిది నుంచి ఇరవై వేల వరకు పలుకుతోంది. దీంతో కష్టపడి తయారు చేసిన రైతులు తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. గతంలో రైతులే ధర నిర్ణయించి వేలం ద్వారా ఆమ్ చూర్ ను విక్రయించేవారు. కాని ఇప్పుడు ఆన్ లైన్ ద్వారా మార్కెట్ లో విక్రయాలు జరుపుతున్నారు. ఇందులో అధికారుల పర్యవేక్షణ లేకపోవటం, దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహారించటంతో రైతులకు నష్టం వాటిల్లుతుంది. రోజు వేల క్వింటాళ్ల ఆమ్ చూర్ వస్తుండగా.. మూడు రోజులకోసారి మాత్రమే వ్యాపారులు బీట్లు నిర్వహిస్తున్నారని.. దీంతో యార్డుల్లో పడిగాపులు కాయల్సిస్తోందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.మరో వైపు కాయ కొసిన రోజే కూలీలతో మామిడి పొట్టు తొలగించి.. ముక్కలుగా చేసి రెండ్రోజుల పాటు ఎండబెట్టి వాటిని విక్రయానికి తెస్తుంటారు రైతులు. అయితే పదిచెట్ల కాయను ఎండబెట్టి ఆమ్ చూర్ గా తయారు చేస్తే.. అది కేవలం క్వింటాల్ కూడా ఉత్పత్తి కావడం లేదు.
మరోవైపు అకాల వర్షాలతో మామిడి కాయలు కింద పడటంతో.. మామిడి రైతులు ఆమ్ చూర్ ను తయారుచేసి మార్కెట్ కు తరలిస్తుండటంతో.. ఒక్కసారిగా ఆమ్ చూర్ మార్కెట్ కు పోటెత్తుతోంది. దీంతో దళారులు రేటును తగ్గించి రైతులను మోసాలకు గురిచేస్తున్నారు.