కరీంనగర్:
ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల నుంచి తొలగిస్తూ శ్రీనివాస్‌పై వేటు వేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కూడా స్పందించారు. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని హుజూరాబాద్ సీఐ దామోదర్ రెడ్డి తెలిపారు. హుజూరాబాద్ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్.. సెల్ఫోన్లో వీడియో చూస్తూ బస్సు డ్రైవింగ్ చేశాడు. ఓ యువకుడు దీనిని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టాడు. దాంతో అది కాస్తా వైరల్ అయి.. అధికారుల వరకు చేరింది. ఇటీవల జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ బస్సులు ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదాల నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈలాంటి తరుణంలో శ్రీనివాస్ ఘటన ప్రజల్లో మరింత ఆగ్రహాన్ని.. ఆర్టీసీ పట్ల అపనమ్మకాన్ని కలిగిస్తున్నాయి