ఆలంపురీ స్థిత మాతా ‘జోగులాంబ’!

మహబూబ్ నగర్:
శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు. మహామహిమాన్వితమైన ఆ శక్తిపీఠాల్లో 5వది మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్‌లో కనులపండువుగా కొలువుదీరింది. రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో, మహబూబ్ నగర్ జిల్లా శివారులో నెలవై ఉంది ఈ ఆలంపూర్ పట్టణం. ఆలయాల నగరంగా ప్రఖ్యాతి గాంచిన ఆలంపూర్ పట్టణ సిగలో మణి మకుటంగా వెలసింది జోగులాంబ ఆలయం.ఇక్కడ అమ్మవారు జోగులాంబగా దర్శనిమిస్తుంటారు. పావన తుంగభద్రా నది తీరాన చల్లని తల్లి ఆలయంగా భక్తులు నిత్యం వస్తుంటారు. జోగులాంబ రౌద్ర వీక్షణ. శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా దీన్ని భావిస్తారు. సిద్ధవటం, త్రిపురాంతకం, ఉమామహేశ్వరం దక్షిణ, తూర్పు, ఉత్తర ద్వారాలుగా చెబుతారు. తుంగభద్ర, కృష్ణా నదులు అలంపూర్ కు దగ్గరలో కలుస్తాయి.
స్థలపురాణంశివుని ప్రాణసతి సతీదేవి తన తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అవమానాల పాలైంది. ఆ తలవంపును తట్టుకోలేక యజ్ఞశాలలోనే సతీదేవి ప్రాణత్యాగం చేస్తుంది. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి శివుడు లోకసంచారం చేస్తుంటాడు. అదే సమయంలో శివుడిచ్చిన వరగర్వంతో మృత్యువును జయించానని అహంకరించి తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. వీడు శివవీర్య సముద్భవుడైన కుమారునితో తప్ప చావడనే వరం ఉంది. శివుని సతి అనూహ్యంగా మరణించడంతో ఆయన అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే, తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుని అభ్యర్థిస్తారు. కానీ శివుడు సుముఖత చూపడు. మొదటి వివాహ బంధం నుంచి విముక్తి పొందితే తప్ప శివుడు దేవతల ప్రతిపాదనకు మొగ్గుచూపడని పరాశక్తి చెబుతుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. అది మొత్తం పద్దెనిమిది భాగాలుగా తెగి వివిధ ప్రాంతాలలో పడింది. అలా వచ్చిపడిన సతీదేవి శరీరావయవాలలో ఊర్థ్వ దంతం పడిన చోటు ఈ ఆలంపూర్. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే తేళ్లు చేరుతాయని, ఆ తర్వాత గబ్బిలాలు చేరతాయని అమ్మవిగ్రహం చెప్పక చెబుతుంది. ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం. ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపం అని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనడం అనాదిగా వస్తోంది. వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్యరాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 14 వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశాడు. ఆలయం దెబ్బతిన్నా జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటినుంచి 2005 వరకూ అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునః ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రంలో పూజలు, అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మిక సంరంభం కనిపిస్తుంది. రోజువారీ పూజలతో పాటు, ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖలో భక్తులు వస్తుంటారు. సంతాన సమస్యలు, అనారోగ్యసమస్యలు ఉన్నవారికి అపాద్భాంధవి జోగులాంబ.