ఆ పునాదులే ‘విజ్ఞాన సమాజం’ గా మారాయి. – ఏపి సీఎం చంద్రబాబు.

అమరావతి;
హైదరాబాద్ లో తాను వేసిన పునాదులే ఈ రోజు విజ్ఞాన సమాజంగా మారింద‌ని, ఒక ప్యాషన్ గా తాను హైదరాబాద్ అభివృద్ది చేశాన‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్నారు. అమ‌రావ‌తిలో 15వ ఆర్థిక సంఘం ప్ర‌తినిధుల‌తో చంద్ర‌బాబు స‌మావేశ‌మ‌య్యారు. అప్పుడు కాలినడకన, న్యూయార్క్ లో ఫైళ్లు పట్టుకుని తిరిగి మైక్రోసాఫ్ట్ ను తాను హైదరాబాద్ కు తెచ్చానన్నారు. ఇప్పుడు అలాగే కాలినడకన న్యూయార్క్ లో వర్షంలో తడుస్తూ ఐటి కంపెనీలను ఏపికి తెచ్చేందుకు కృషి చేస్తున్నాన‌న్నారు. రాజకీయం ఏవిధంగా ఒక సామాన్యుడిని దెబ్బతీస్తుందో ఉదాహరణే ఆంధ్రప్రదేశ్ అని, 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం వల్ల 2% ఓట్లకు పడిపోయింద‌న్నారు. ప్రజల్లో నెలకొన్న భావోద్వేగాలే దానికి కారణమ‌ని, పంజాబ్,అస్సాం తదితర రాష్ట్రాలలో భావోద్వేగాల తీవ్రత తెలిసిందేన‌న్నారు. ప్రజల భావోద్వేగాలను అభివృద్ది వైపు మళ్లించానని, నవనిర్మాణ దీక్ష, మహా సంకల్పం తీసుకున్నానని తెలిపారు. పట్టుదలగా, కసితో రాష్ట్రాభివృద్దికి నడుం కట్టామ‌న్నారు. ప్రజల్లో ప్రత్యేక హోదా అంశం ఒక భావోద్వేగ అంశంగా మారింది. విభజన సమయంలో ఇస్తామన్న వాగ్దానం అద‌ని, హోదా ఇవ్వకపోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంద‌న్నారు. కొన్ని సందర్భాలలో రాజకీయ నిర్ణయాలే రాష్ట్రాల తలరాతలను నిర్ణయిస్తున్నాయ‌న్నారు. కేంద్రం నుంచిగాని, ఆర్ధిక సంఘం నుంచి గాని తాము కోరేది హ్యాండ్ హోల్డింగ్ మాత్ర‌మేన‌ని, భౌతిక సామర్ధ్యంతో బలం చేకూరద‌న్నారు. వాస్తవ బలం అనేది మానసిక సామర్ధ్యంతో సమకూరుతుంది అనే మహాత్మాగాంధీ సూక్తిని గుర్తుచేస్తున్నానన్నారు.