ఆ 40 లక్షల మందిపై నిర్బంధ చర్యలు వద్దు.

గౌహతి:
అస్సాం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్‌సీ) తుది ముసాయిదాలో లేని 40 లక్షలకు పైగా ప్రజలపై అధికార యంత్రాంగం ఎలాంటి నిర్బంధ చర్యలు చేపట్టరాదని సుప్రీంకోర్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాబితాలో లేని ప్రజల అభ్యంతరాలు, వాదనలను పరిగణనలోకి తీసుకొని నిర్దిష్టమైన విధివిధానాలు తయారు చేయాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి సూచించింది. ఆగస్ట్ 16 నాటికి దీనికి సంబంధించిన వివరాలను అందజేయాల్సిందిగా జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. తుది ముసాయిదాలోని లేని 40 లక్షలకు మందికి పైగా ప్రజల్లో 37.59 లక్షల మందిని తిరస్కరించామని 2.48 లక్షల మంది పేర్లను పరిశీలనకు నిలిపి ఉంచినట్టు అస్సాం రాష్ట్ర ఎన్ఆర్సీ కోఆర్డినేటర్ కోర్టుకు తెలియజేశారు. నిన్న విడుదల చేసిన ఎన్ఆర్సీ తుది ముసాయిదాలో 3.29 కోట్ల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 2.89 కోట్ల మందిని మాత్రమే దేశ పౌరులుగా గుర్తించడం జరిగింది. తమ అభ్యంతరాలు, వాదనలు స్వీకరించే ప్రక్రియ ఆగస్ట్ 30 నుంచి ప్రారంభమవుతుంది. ఇది సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది.