ఇది ‘భూస్వామ్య ఆకర్ష్’ పథకమే!!


ఇటీవల మధ్యప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం మద్దతు ధరతో ముడిపడి ఉంది. పండిన పంటను రైతు మార్కెట్‌లో ఉన్న ధరకు అమ్మగా మద్దతు ధరకు, అమ్మిన ధరకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం రైతుకు అందజేస్తుంది. ఇక్కడ భూయజమాని పాత్రలేదు. భూమి ఎవరిదైనా పంట పండించిన వారే లబ్ది పొందుతారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్నే దేశవ్యాప్తంగా వర్తింపజేసే ఆలోచనలో ఉందని ప్రధాని మోడీ ఓ సభలో అన్నారు. అయితే పండించే రైతుకు పనికి రాని రైతు బంధు దేశంలోనే గొప్ప పథకమని కెసిఆర్ ప్రభుత్వమే ప్రచారం చేసుకోవడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుందని కూడా చెప్పుకుంటున్నది.

ఎస్.కె.జకీర్.
కెసిఆర్ రచించిన ‘రైతుబంధు’ పై మిశ్రమస్పందన కనిపిస్తున్నది. పొలంలో నిజంగా పంట పండించే రైతుకు పనికి రాని ‘రైతు బంధు’ దేశంలోనే గొప్ప పథకమని ప్రభుత్వం చెబుతున్నది. కేంద్ర సర్కారు ఈ పధకాన్నిమెచ్చుకుందని తెలంగాణ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి ఒక సానుకూల అంశం ఇక్కడ చెప్పుకోవలసి ఉన్నది.రైతుబంధు పేరిట మంత్రులు, ఎం.పి.లు, ఎం.ఎల్.ఏ.లు,ఇతర ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించడానికి వీలైంది.ప్రజలను నేరుగా కలుసుకోవడానికి,వారితో మాట్లాడడానికి వీలైంది.టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకుల హడావిడి గ్రామాల్లో కొనసాగుతున్నది.రైతులను టిఆర్ఎస్ ‘ఓటుబ్యాంకు’ గా మలచుకోవడానికి ఈ పధకాన్ని ప్రవేశపెట్టినట్టు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.ఇది ‘బూమరాంగ్’ కానుందనే అభిప్రాయం పల్లెల్లో వ్యక్తమవుతోంది.చిన్నసన్నకారు రైతులు, భూస్వాముల మధ్య అగాధం పెరుగుతోంది.ఈ రెండు వర్గాల మధ్య ఆర్ధిక అసమానతలకు ప్రభుత్వమే నగదు చెల్లింపుల రూపంలో ఆజ్యం పోసినట్లవుతున్నది.చాలా కాలం క్రితమే గ్రామాలు వదిలి పట్టణాలు, నగరాలకు వెళ్ళి ఇతర రంగాల్లో స్థిరపడిన సంపన్న రైతులు ఈ డబ్బు తీసుకోవడానికి పెద్ద పెద్ద కార్లలో రావడం చిన్న రైతులకు మింగుడుపడలేదు. సాగునీటి వసతి లేక, లేదా వ్యవసాయం చేయక పడావు పడిన భూములకు కూడా రైతుబందు చెక్కులు జారీ కావడం ఈ పధకం డొల్లతనాన్ని రుజువు చేస్తున్నది. భూస్వామ్య వర్గాలకు, సంపన్నులకు అందివచ్చిన పధకం ఇది. అయితే ఆయా వర్గాలు సంబంధిత గ్రామాల్లో సామాన్య వోటర్లను వారు ప్రభావితం చేయగలరన్న ‘ముందుచూపు’ తో కెసిఆర్ ఈ పధకాన్ని రూపొందించి ఉండవచ్చునని అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
ఉదాహరణకు జగిత్యాల జిల్లాలో మొత్తం 2 లక్షల 5 వేలమంది రైతులున్నారు.ఇందులో అతి తక్కువ భూమి ఉన్నవారు అత్యధిక సంఖ్యలో, అతి ఎక్కువ భూమి కలిగిన వారు తక్కువ సంఖ్యలో ఉన్నారు.ఈ జిల్లా నుంచి ఉపాధి కోసం దుబాయి వంటి గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారి సంఖ్య దాదాపు 20 వేల దాకా ఉంది.పాత కరీంనగర్ జిల్లా నుంచి కనీసం 4 లక్షల మంది వరకు గల్ఫ్ లో ఉంటున్నారు.గతంలో సమగ్ర సర్వే సమయంలో ఇందులో చాలా మంది ఒక్కొక్కరు కనీసం 30 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి వెళ్లారు.ఇప్పుడు ఎకరం లేదా అర ఎకరం ఉన్న వాళ్ళు దుబాయి నుంచి రావడం వృథ ఖర్చు అని భావించి రాలేదు.తమ కళ్ళ ముందే లక్షల రూపాయలను సంపన్న, భూస్వాములు తీసుకొని మళ్ళీ నగరాలకు వెళ్ళిపోవడంతో ప్రభుత్వ పధకం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతున్నది.పల్లెలు వదలివెల్లిన వాళ్ళలో ఎక్కువమంది రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో కోట్లు గడించారని ఆ పల్లెల్లో చెప్పుకుంటున్నారు.కెసిఆర్ అమలు చేస్తున్న ఈ పధకం ‘రివర్స్’ అయ్యే అవకాశాలు లేకపోలేదని కొందరు చిన్న, సన్నకారు రైతులంటున్నారు.పంట పెట్టుబడి పేరిట తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఖరీఫ్‌ పంట కోసం ప్రభుత్వం ఎకరానికి 4 వేల రూపాయల చొప్పున రైతులకు అందజేసింది. భూ యజమానులు పట్టాదారు పాసుపుస్తకాలు, చెక్కులు అందుకున్నారు. “రాష్ట్రంలో 2.5 ఎకరాల లోపు ఉన్న రైతులు 62 శాతం మంది ఉన్నారు. ఇక 5 ఎకరాలు ఉన్నవారు 24 శాతం ఉన్నారు. 10 ఎకరాలు ఉండేవారు కేవలం 11 శాతం. 97 శాతం 10 ఎకరాలు లోపు ఉన్న రైతులే. 3 శాతం మంది మాత్రం 25 ఎకరాలు లోపు ఉన్నవారు. 25 ఎకరాలు పైబడి ఉన్న రైతులు 0.28 శాతం మాత్రమే ఉన్నార “ని ముఖ్యమంత్రి చెప్పారు.” నిజానికి వ్యవసాయంలో బుగ్గిపాలవుతున్నది కూడా కౌలు రౌతుల కుటుంబాలే. భూసర్వే నివేదికలో కౌలుకు సంబంధించిన ‘ కాలం’ లేకపోవడం వల్ల కౌలురైతుల లెక్కను గాలికొదిలేశారు.భూకౌలుదారు చట్టం ప్రమాదకరమైనదని, దానివల్ల భూయజమాని భూమిపై తన హక్కును కోల్పోయే ప్రమాదముందని ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక సందర్భంలో అన్నారు. భూమిని యజమాని సాగు చేసినా, చేయకపోయినా తన హక్కును కోల్పోకూదడదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తున్నది. 95శాతం పట్టాదార్లకు వ్యవసాయం స్వయంగా చేసే ఉద్దేశ్యం ఉందని, అందువల్ల కౌలుదారుల సమస్యలో తీవ్రత లేదని మరో సందర్భంలో సి.ఎం అన్నారు. భూ యజమానుల చేతికిచ్చే ‘రైతుబంధు’ సొమ్ము ఎవరికి చెందుతుందో భూమి యజమాని,కౌలుదారు స్వయంగా తేల్చుకోవాలని, ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోదని శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో 58.34 లక్షల రైతు కుటుంబాలున్నాయి. 35 శాతం భూములను 15 లక్షల మంది కౌలు రైతులు సాగుచేస్తున్నారు. పట్టాదారుల్లో 25 శాతం మంది వ్యవసాయరంగంలోనే లేరు. వేరే వృత్తుల్లో ఉన్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వివిధ కారణాల వల్ల వేలాది ఎకరాల్లో సాగు కొనసాగడం లేదు. కానీ ఈ భూమి పట్టాదారు పాసు పుస్తకాల్లో వ్యవసాయ భూమిగా నమోదైనది. రైతుబంధు పధకానికి యోగ్యమైనదిగా ఇది రికార్డుల్లో ఉంటుంది.’రైతు సమగ్ర సర్వే’లో పోడుభూమి, ప్రభుత్వ భూమి, సాదాబైనామా కొనుగోళ్లను పక్కన పెట్టారు. వీటిని సాగుచేస్తున్న రైతులు ‘రైతుబంధు’ సహాయాన్ని అందుకోలేరు.జనాభాలో 65 శాతం ఆధారపడి బతుకుతున్న వ్యవసాయరంగాన్ని చక్కదిద్దేందుకు చేపట్టినట్టు చెప్పుకుంటున్న ‘రైతుబందు’ పథకంలో 15 లక్షల కౌలురైతు కుంటుంబాలు ఆ సదుపాయాన్ని పొందలేకపోతున్నారు. అసలు వ్యవసాయ సమస్యంతా కౌలురైతుల ఇక్కట్లతోనే ముడిపడి ఉంది. ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో 70శాతం కౌలు సాగుదారులే. భూమి పట్టాదారుల కుటుంబాల ఓట్లను ప్రజాధనంతో ఆకర్షించే విధానం ఇందులో స్పష్టం.కౌలురైతు విషయానికొస్తే ఆయనకు బ్యాంకు రుణం దొరకదు. రుణమాఫీ ఊసేలేదు. ప్రభుత్వ సబ్సిడీలు లభించవు. పెట్టుబడికి అదనంగా కౌలు చెల్లించాలి. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించదు. ఇంతటి విపత్కర పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా లెక్కతేలదని, నోటిమాట ఒప్పందమని వారి జీవితాల్ని గాలిలో దీపంలా తెలంగాణ ప్రభుత్వం వదిలేస్తున్నది. రాష్ట్రాన్ని సందర్శించడానికి వచ్చిన మంత్రులు, ఇతర రాష్ట్రాల ప్రముఖులు ‘రైతుబందు’ పధకాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఏ ప్రభుత్వ సంక్షేమ పథకానికైనా సామాజిక, ఆర్థిక నిబంధనలుంటాయి. బడుగువర్గాల అభ్యున్నతి కోసం వాటి రూపకల్పన జరుగుతుంది. అయితే రైతుబంధు పధకానికి ఇవేవేలేదు. చిన్న పెద్ద అనే బేధం లేకుండా భూయజమానులందరికీ ఈ పథకం వర్తిస్తుందని స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. 20 ఎకరాల భూస్వామి వ్యవసాయం ఎన్నెకరాలు చేసినా, అసలు చేయకపోయినా ఏడాదికి రూ.1,60,000 అందుకోవచ్చు. ఆయన ఇతర వార్షికాదాయం, ఆర్థిక స్థితిగతులు, స్థిరాస్థులు లెక్కలోకి రావు. దీనివల్ల రోగికి కాకుండా ఆరోగ్యవంతుడికి వైద్య సహాయం ఇచ్చినట్టవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. భూములున్న సంపన్నులు ఈ లబ్దిని వదులుకోవడానికి స్వచ్చందంగా ముందుకురావాలని ముఖ్యమంత్రి పిలుపు మేరకు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ సొమ్మును వదులుకున్నారు.దీంతో చాలా మంది ప్రజాప్రతినిధుల భూముల వివరాలు బహిరంగమయ్యాయి.దేశవ్యాప్తంగా రైతులను ఆడుకోవడానికి వివిధ రకాల పథకాలున్నాయి. ఇటీవల బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం మద్దతు ధరతో ముడిపడి ఉంది. పండిన పంటను రైతు మార్కెట్‌లో ఉన్న ధరకు అమ్మగా మద్దతు ధరకు, అమ్మిన ధరకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం రైతుకు అందజేస్తుంది. ఇక్కడ భూయజమాని పాత్రలేదు. భూమి ఎవరిదైనా పంట పండించిన వారే లబ్ది పొందుతారు. రైతుబంధు పధకాన్ని పదెకరాలు లోపు రైతులకే వర్తించే విధంగా రూపొందిస్తే ప్రయోజనకరంగా ఉండేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది.హైదరాబాద్ కు ఆనుకొని ఉన్న మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కనీసం 3 లక్షల ఎకరాలకు పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరుగుతున్నట్టు ఒక అంచనా. పటాన్ చెరెఉ, బీబీనగర్,చౌటుప్పల్,మొయినాబాద్, ఇబ్రాహీం పట్నం తదితర ప్రాంతాల్లో సాగుభూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది.ఆయా భూములకు కూడా సంబంధిత భూస్వాములు ‘రైతు బంధు’ పధకం కింద డబ్బులు తీసుకోవడం ప్రభుత్వ ఉద్దేశం అమలుతీరులోని బలహీనతలను బట్టబయలు చేస్తున్నది.