‘ఇన్‌స్టాగ్రామ్’ కి సహ వ్యవస్థాపకుల గుడ్ బై!

న్యూఢిల్లీ:
ఫోటో, వీడియోలు షేర్ చేసుకొనే ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ సహ వ్యవస్థాపకులు గుడ్ బై చెప్పనున్నారు. మరికొన్ని వారాల్లో తాము ఇన్ స్టాకు గుడ్ బై చెప్పనున్నట్టు సీఈవో కెవిన్ ప్రకటించారు. మరికొన్ని వారాల్లో సహ వ్యవస్థాపకులిద్దరూ రాజీనామా చేయనున్నట్లు సీఈవో చేసిన ప్రకటన అందరినీ షాక్ కి గురి చేసింది. అయితే కంపెనీని ఎందుకు వీడి వెళ్తున్నదీ కెవిన్ చెప్పలేదు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ప్రతినిధులు కూడా ఈ అంశాలపై స్పందించలేదు. కెవిన్ సిస్ట్రోమ్, మైక్ క్రీగర్‌ 2010లో ఫోటో షేరింగ్ సోషల్ మీడియా సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌ను స్థాపించారు. అతి తక్కువ కాలంలోనే ఇది నెటిజన్ల ముఖ్యంగా యువత ఆదరణ పొంది దూసుకెళ్లింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సీఈవోగా కెవిన్, సీటీవోగా క్రీగర్ విజయవంతంగా కొనసాగించారు. ఇన్ స్టాను 2012లో వంద కోట్ల డాలర్లకు మరో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు అమ్మేశారు. అయినప్పటికీ దీని సీఈవోగా కెవిన్, టెక్నికల్ ఆఫీసర్ గా క్రీగర్ కొనసాగుతూ వస్తున్నారు. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బెర్గ్ తో విభేదాలే ఈ హఠాత్ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.