ఇన్ స్టాగ్రామ్ లో టాప్ ఫాలోయింగ్ ఎవరిది?

న్యూఢిల్లీ:

పోర్చుగల్ స్టార్ ఫుట్ బాలర్ క్రిస్టియానో రొనాల్డో అంటే తెలియనివాళ్లు అరుదు. ఈ సాకర్ స్టార్ కి ప్రపంచం నలుమూలలా ఫ్యాన్స్ ఉన్నారు. రొనాల్డోని ప్రత్యక్షంగా చూడకపోయినా ఎప్పటికప్పుడు తమ ఫేవరెట్ స్టార్ ఏం చేస్తాడోనని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్లు కోట్లల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే ఈ సాకర్ స్టార్ సోషల్ మీడియాలో యాక్ట్రెస్-సింగర్ సెలెనా గోమెజ్ ని వెనక్కి నెట్టి టాప్ పొజిషన్ లో నిలిచాడు. రొనాల్డోకి ఇన్ స్టాగ్రామ్ లో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్నారు. యుఎస్ వీక్లీ ప్రకారం రొనాల్డో ఇన్ స్టా ఫాలోయింగ్ లో సింగర్ సెలెనాను దాటేశాడు.పోర్చుగల్ సూపర్ స్టార్ ఫుట్ బాలర్ రొనాల్డోకి ఇన్ స్టాగ్రామ్ లో 14,43,38,650 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇన్నాళ్లూ టాప్ పొజిషన్ లో ఉన్న సెలెనా గోమెజ్ కి 14,43,21,029 మంది మాత్రమే ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సెలెనా కొంత కాలంగా ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీల లిస్ట్ లో నెంబర్ వన్ గా ఉంది. కానీ ఇప్పుడు రొనాల్డో ఆమెను దాటి దూసుకెళ్లాడు.2016లో సెలెనా.. సింగర్ ఏరియానా గ్రాండ్ ని వెనక్కి నెట్టి టాప్ ఛెయిర్ దక్కించుకుంది. ప్రస్తుతం ఏరియానాకు 132 మిలియన్ల (13 కోట్లకు పైగా) ఫాలోవర్లు ఉన్నారు. రొనాల్డో ఇటీవల జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఒక ఫోటో షేర్ చేస్తే దానికి 54 లక్షలకు పైగా ఫ్యాన్స్ లైక్ కొట్టారు. 26 ఏళ్ల అమెరికా నటి సెలెనా అంటే ఆమె ఫ్యాన్స్ పడిచస్తారు. ప్రపంచమంతటా ఆమె అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు. సెప్టెంబర్ 22న ఆమె ఓ చిన్న వీడియో పోస్ట్ చేస్తే దానికి 1 కోటి 24 లక్షల మందికి పైగా చూడటమే ఆమె ఫాలోయింగ్ కి రుజువు. క్రికెటర్ల విషయానికొస్తే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ని 11.7 మిలియన్లు, ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని 24.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.