ఇరిగేషన్ అవినీతి రుజువు చేయకపోతే రాష్ట్రం విడిచి వెళ్తా. – రేవంత్ రెడ్డి సవాల్.

హైదరాబాద్:
కేసీఆర్ కుటుంబం నీళ్లను అడ్డుపెట్టుకుని దోచుకుంటున్నదని కాంగ్రెసు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం తిట్లతో ఎదురుదాడి చేస్తున్నదని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు. హరీష్ తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని అన్నారు.రబ్బరు చెప్పులు కూడా లేని కేసీఆర్ సన్నిహితులు ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారని రేవంత్ చెప్పారు. ధనిక రాష్ట్రం అప్పులతో దువాలాదిస్తే, దివాళా తీసిన కేసీఆర్ కుటుంబం అంబానీ ,ఆదానీలను మించిపోయినట్టు ఎమ్మెల్యే ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టు ల అవినీతినే తాను ప్రశిస్తున్నట్టు ఆయన చెప్పారు.
చిత్త శుద్ధి ఉంటె వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజీవ్ సాగర్ ,ఇందిరా సాగర్ లను కాంగ్రెస్ నిర్మిస్తే కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు గా పేరు మార్చారని రేవంత్ తెలిపారు. సీతారామ ప్రాజెక్టు కింద ఐదులక్షల ఎకరాలను సాగులోకి తీసుకుని రావడానికి 2016లో 7926 కోట్లు
మంజూరు చేసిన సర్కార్ రెండేళ్లలో మరో 5200కోట్లకు పెంచిందని ఆయన ఆరోపించారు.
సీతారామా ప్రాజెక్టు అంచనాలు పెంచడంలో కేసీఆర్ ప్రభుత్వం దోపిడీ ఉందని ఆరోపించారు.
ఎవరి ధనదాహం తీర్చుకునేందుకు రెండేళ్లలో 5 వేల కోట్లు పెంచారో మంత్రి హరీష్ చెప్పాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.ప్రభుత్వం చెబుతున్న ఆయకట్టు లెక్కలు పచ్చి అబద్దమని అన్నారు.
రాష్ట్రం లో ఉన్న ప్రాజెక్టులు,ఆయకట్టు,జరిగిన నిర్మాణాలు ఎంత అన్నదానిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.సీతారాం ప్రాజెక్టు కు అంచనాలలో వంద శాతం అవినీతి జరిగిందని రేవంత్ స్పష్టం చేశారు.సీతారామ ప్రాజెక్టుకు
తాను వస్తానని, అవినీతి నిరూపిస్తానని ఆయన ప్రకటించారు. నిరూపించక పోతే కేసీఆర్ విధించే ఎ శిక్షకైనా తాను సిద్ధమని తెలిపారు.
సీతారామా ప్రాజెక్టు అవినీతి రుజువు చేయకపోతే తాను రాష్ట్రం విడిచి వెళతానని సవాలు చేశారు. ఈ అవినీతి రుజువుకు గాను
మంత్రి హరీష్ కు సమయం లేకపోతే ఇర్రిగేషన్ అధికారులను పంపాలని ఆయన కోరారు.
కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి శీలం కోల్పోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో బిల్లా రంగ ,చార్లెస్ శోభరాజ్ లు ఉన్నారని రేవంత్ ఆరోపించారు. బిల్లరంగాలు ,చార్లెస్ శోభరాజ్ లు ఎవరో త్వరలోనే చెబుతానని ఎమ్మెల్యే అన్నారు. వ్యక్తిగత ఆరోపణలు, దూషణలు పక్కన బెట్టి
చర్చకు రావాలని కోరారు.కొడంగల్ ప్రజల పై దాడికి మంత్రులు ,వేల మంది పోలీసులతో వస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు చెప్పారు.ఎంత మంది కట్టకట్టుకుని వచ్చినా, తాను కొడంగల్ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతానని స్పష్టం చేశారు. తోడ బుట్టిన అక్కను మోసం చేసిన చరిత్ర టీఆరెస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి దని రేవంత్ విరుచుకుపడ్డారు.బావ ఆసుపత్రిలో ఉంటె తన పేరుపై పల్లా ఆస్తులు రాయించుకున్నట్టు ఎమ్మెల్యే ఆరోపించారు.