ఇష్టపూర్వక శృంగారం నేరం కాదు. సెక్షన్ 497పై సుప్రీం సంచలన తీర్పు!

న్యూఢిల్లీ:
సెక్షన్ 497కు సంబంధించి సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఇష్టపూర్వక శృంగారం, ప్రస్తుత చట్ట నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. సెక్షన్‌ 497 ఒక పురాతన చట్టమని, ఆ చట్టం పూర్తిగా ఏకపక్షంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇష్టపూర్వక శృంగారం నేరం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పెళ్లైన పురుషుడు భార్యతో కాకుండా మరో స్త్రీతో లైంగికంగా కలవడం నేరం కాదని తీర్పు వెల్లడించింది. అయితే ఆ స్త్రీ ఇష్టపూర్వకంగా అందుకు అంగీకరించాలని తెలిపింది. ఇష్ట పూర్వకంగా సాగే వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అభిప్రాయపడ్డారు.భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్‌ 497, నేర స్మృతిలోని సెక్షన్‌ 198 రాజ్యాంగ సమ్మతం కాదని సుప్రీం కోర్టు తీర్పును వెల్లడించింది. సెక్షన్‌ 497 శిక్షా స్మృతి మహిళలకు సమాన అవకాశాలను కాలరాస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సమానత్వ హక్కుకు తూట్లు పడుతున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. సెక్షన్‌ 497 రాజ్యాంగ సమ్మతం కాదన్న సుప్రీంకోర్టు.. భార్యకు భర్త సర్వాధికారి కాదని స్పష్టం చేసింది.
సెక్షన్ 497 ఏం చెబుతోంది?
భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 497 ప్రకారం అక్రమ సంబంధం నేరం. కానీ వ్యభిచార నేర చట్టం ప్రకారం కేవలం మగవారిని మాత్రమే దోషిగా పరిగణిస్తారు. ఆ శిక్ష ప్రకారం మహిళలు కేవలం బాధితులు మాత్రమే.