ఈటెలపై రేషన్ డీలర్లు గరం.. గరం.. స్పష్టమైన హామీ వచ్చేంతవరకు సమ్మెపై రాజీ లేదు.

హైదరాబాద్:
పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో 300 సార్లు చర్చించినా తమ సమస్యల పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా పడలేదని రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుగా రేషన్‌ డీలర్ల సమస్యలు సరిష్కారిస్తానని హామినిస్తూ వచ్చిన ఈటల రాజేందర్‌ తమను మోసం చేశాడని మండిపడ్డారు. జాతీయ ఆహార భద్రత హామీ చట్టం అమలుకు కృషి చేయాల్సిన మంత్రి వైఖరి సరిగా లేదని విమర్శించారు. 2017లో సమ్మె చేయగా.. 10 రోజుల్లో సీఎంతో మాట్లాడించి సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ఈటలను ప్రశ్నించారు. రేషన్‌ డీలర్ల సంక్షేమానికి మంత్రి స్పష్టమైన హామినిచ్చినందునే ఈ-పాస్‌ మిషన్‌లను స్వాగతించామని అన్నారు. వాటి సాయంతో పౌర సరఫరాల వ్యవస్థలో అక్రమాలు తగ్గి ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఆదా అవుతున్నా తమ బతుకుల్లో మాత్రం ఏ వెలుగూ లేదని వాపోయారు. ఇప్పటికైనా డీలర్ల సమస్యల పరిష్కారం దిశగా మంత్రి చొరవ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు సమ్మె విరమించేది లేదనీ, డీడీలు కట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు