ఈ ఫెరారీ కార్లని 499 మందికే అమ్ముతారు!!

న్యూఢిల్లీ:

ఇటలీకి చెందిన ప్రముఖ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ తన కొత్త మోంజా ఎస్పీ1, ఎస్పీ2 సూపర్ కార్లను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇవాళ ప్యారిస్ లో జరిగిన ప్యారిస్ ఆటో షోలో వీటిని ప్రదర్శించింది. అంతే కాకుండా ఈ కొత్త మోడల్ కార్లను కేవలం 499 మందికే అమ్ముతామని ప్రకటించింది. ఇప్పటికే పలు ఫెరారీ కార్లు కొనుగోలు చేసి తమ బ్రాండ్ తో సుదీర్ఘ అనుబంధం ఉండటాన్ని ప్రాథమిక అర్హతగా కంపెనీ తెలిపింది. ఎంపిక చేసిన కొద్ది మందికి ఆహ్వానాలు పంపుతారు. ఒక్కో కారు ధరను 1.6 మిలియన్ యూరోలు (రూ.13,87,000)గా నిర్ణయించింది. ఈ కార్లను ఎవరికి పడితే వారికి కాకుండా 499 మంది ఎంపిక చేసిన అదృష్టవంతులకే విక్రయించనున్నారు. ఇది కేవలం ఇటలీ పన్ను రేట్లను అనుసరించి నిర్ణయించిన మొత్తం. ఇతర మార్కెట్లలో అమ్మకపు పన్ను రేటుని బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఫెరారీ కొత్త కార్ల కొనుగోలుకి ఆహ్వానం అందుకున్నవారు ఒకటే సీటు ఉండే మోంజా ఎస్పీ1 కానీ రెండు సీట్లు ఉండే ఎస్పీ2ని కాని ఎంచుకోవచ్చు. వీటిలో దేనికీ విండ్ స్క్రీన్స్ ఉండవు. గాలి, వెలుతురు, ఎండ, వాన తగులుతుంటాయి. కోట్లలో వసూలు చేస్తున్నందుకు ఒకటి లేదా రెండు హెల్మెట్లు, డ్రైవర్లు ధరించే షూ మొదలు అన్ని వస్తువులను కంపెనీయే అందజేస్తుంది. ఫెరారీ ఇప్పటి వరకు తయారు చేసిన ఇంజన్లంటిలోకి అత్యంత శక్తివంతమైన వీ12 ఇంజన్ ను ఈ కార్లకు అమర్చారు. దీనికి 810 హార్స్ పవర్ ఉంటుంది. దీంతో స్టార్ట్ చేసిన 2.9 సెకన్లలోనే గంటలకు 100కి.మీల వేగంతో దూసుకుపోవచ్చు.