ఉగ్రవాదుల దాడి:16 మందికి గాయాలు.

శ్రీనగర్:
జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు గ్రనేడ్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో 16 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో నలుగురు పోలీసులు కూడా ఉన్నారు. షోపియాన్‌ నగరంలో రద్దీగా ఉన్న మార్కెట్‌ ప్రాంతంలో ముష్కరులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకు దిగడంతో 12 మంది పౌరులుతో పాటు నలుగురు పోలీసులు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. మరో సంఘటనలో బటాపొరా చౌక్‌లో ఉన్న పోలీసులపై ఉగ్రవాదులు గ్రనేడ్‌ విసిరేందుకు ప్రయత్నించగా..అది వీధిలో పడి పేలిపోయింది. ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు. గత వారం నుంచి ఉగ్రవాదులు వరుస గ్రనేడ్‌ దాడులకు పాల్పడుతున్నారు. భద్రతా బలగాలు, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులకు చేస్తున్నారు. ఈ దాడులు తమ పనేననంటూ జైషే ఈ-మహమ్మద్‌ అనే ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఇలాగే కొనసాగిస్తూ కాల్పులకు తెగిబడితే భారత్ గత నెలలో ప్రకటించిన కాల్పుల విరమణను రద్దు చేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ అహిర్ అన్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్  జిల్లాలో మాట్లాడిన మంత్రి ముందుగానే కాల్పులకు దిగడం తమ విధానం కాదని.. కశ్మీర్ లో కాల్పులు జరుపుతూ రెచ్చగొడితే పాకిస్థాన్ తగిన బుద్ధి చెబుతామన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం గత నెలలో కాల్పుల విరమణ ప్రకటించిందన్నారు. అయితే పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడితే మాత్రం చూస్తూ ఊరుకోమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హెచ్చరించారు.భారత్‌తో యుద్ధం చేసే ప్రసక్తే లేదని పాకిస్థాన్ డైరక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ మేజర్ జనరల్ ఆసిఫ్ గపూర్ అన్నారు. ఇటీవల కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద జరుగుతున్న కాల్పుల విమరణ ఒప్పందం నేపథ్యంలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. రెండూ అణ్వాయుధ దేశాలే అని, ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి ఆస్కార‌మే లేదని ఆయన అన్నారు. కానీ శాంతి కాంక్షిస్తున్న పాకిస్థాన్‌ను బలహీనంగా చూడరాదు అని ఆయన పేర్కొన్నారు. ఇండోపాక్ సంబంధాలపై మాట్లాడుతూ.. 2003లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గురించి కూడా వివరించారు. భారత ఆర్మీ పదేపదే కాల్పులకు తెగబడుతున్నదని ఆయన ఆరోపించారు. భారతీయ భద్రతా దళాలు సరిహద్దు వద్ద కాల్పులు జరుపుతున్నవ‌ని, గత ఏడాది ఇలాంటివి 1881 సంఘటనలు జరిగినట్లు ఆయన తెలిపారు. కానీ ఈ ఏడాది జూన్ లోపే 1500 ఘటనలు జరిగినట్లు చెప్పారు.