‘ఉచ్చు’ బిగిస్తున్నాడా? బిగించుకుంటున్నాడా? -రవి ప్రకాశ్ కేసులో ‘హవాలా’ కోణం!!

టీవీ 9 మాజీ సిఇఓ రవిప్రకాశ్ కేసు మలుపులు తిరుగుతున్నది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన ఎవరిని ఇరికించాలని పథకం రచించారో గానీ,ఒకవేళ ఈ.డీ.రంగప్రవేశం చేస్తే రవిప్రకాష్ కూడా ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయని పోలీసులు, న్యాయనిపుణులు చెబుతున్నారు. టివి 9 అక్రమంగా వచ్చిన 60 కోట్ల నిధులతో ఏర్పడిందంటూ ఆయన హైకోర్టులో సంచలన విషయాలు చెప్పారు. అలాగే టీవీ 9 తాజా క్రయ,విక్రయాల సందర్భంగా 500 కోట్ల రహస్య ఒప్పందం జరిగిందని, అందులో 294 కోట్ల నగదు కశ్మీర్ టెర్రరిస్టులకు తరలించే ‘హవాలా’ మార్గాలలోనే తరలించారన్నది మరొక తీవ్ర ఆరోపణ.ఈ విషయాలపై తాను సిబిఐ, ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ లకు ఫిర్యాదు చేసినందుకే తనపై తెలంగాణ ప్రభుత్వం పగపట్టిందని రవిప్రకాశ్ హైకోర్టుకు తెలిపారు.’ఫెమా’ నిబంధనలకు విరుద్ధంగా వచ్చిన నిధులతో టీవీ 9 స్థాపన జరిగిందనే సంగతి రవిప్రకాశ్ కు ఎప్పుడు తెలిసింది? సంస్థ నుంచి ఉద్వాసనకు గురయ్యాక తెలిసిందా? అంతకు ముందే తెలుసా? 2003 లో టీవీ 9 వార్తా ఛానల్ ను ‘అక్రమ నిధుల’తో ఏర్పాటు చేస్తే ఇంతకాలం ఆ సంస్థ సిఇఓగా ఎందుకు బయటపెట్టలేదు? ‘హవాలా’ మార్గాల్లో వచ్చిన నిధులతో నడుస్తున్న సంస్థలో కీలక పాత్రలో ఉన్న రవిప్రకాశ్ కూడా ‘మనీ లాండరింగ్’ చట్టాల కింద నిందితుడు అవుతారా! లేదా? వంటి ప్రశ్నలకు జవాబులు రావలసి ఉన్నది. కాగా రవిప్రకాష్ తరపున సుప్రీం కోర్టు న్యాయవాది అహ్లువాలియా తెలంగాణ హైకోర్టులో సోమ,మంగళవారాలలో వాదనలు వినిపించారు. ”రవిప్రకాష్ కు బెయిల్ ఇస్తే సామాన్య ప్రజల కు ఎలాంటి ఇబ్బందులు కలగవు. అందుకే బెయిల్ ఇవ్వాల”ని ఆయన విజ్ఞప్తి చేశారు. ”పోలీసుల విచారణకు హాజరు కాకుండా హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో రహస్యంగా సంచరించి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడ”ని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. రవిప్రకాష్ బెయిల్ పిటీషన్ ను కొట్టివేయాలని ఆయన అభ్యర్థించారు. ”టీవీ9 లోగో సృష్టి కర్త మా క్లయింట్ రవి ప్రకాష్.కాపీ రైట్ చట్టం సెక్షన్ 70 ప్రకారం పూర్తి హక్కు అతనికే ఉంటుంది.2003 నుంచి టీవీ9 ఫౌండర్ గా వ్యవరిస్తూ వచ్చాడు.సివిల్ తగదాల్లో పోలీస్ లు జోక్యం చేకుంటున్నారు. ఇది సరైనది కాదు. NCLT లో కేసు పెండింగ్ లో ఉన్నపుడు పోలీసులు కేసులు ఎలా నమోదు చేస్తారు”?అన్నది రవిప్రకాశ్ న్యాయవాది వాదన. ” పోలీసుల విచారణకు రవిప్రకాష్ అస్సలు సహకరించ లేదు. 90 నుంచి 100 కోట్లు విలువ చేసే టీవీ9 లోగో ను 99 వేల రూపాయలకు రవిప్రకాష్ నెక్స్ట్ మీడియా కు అమ్మాడు. అలా ఎందుకు చేశావ్ అంటే తానే కంపెనీకి ఓనర్ ను అంటున్నాడు. 9 శాతం వాటా ఉన్న వాళ్ళు ఓనర్ అయితే, 90 శాతం వాటాలు ఉన్న వారేమిటి?.రవిప్రకాష్ బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేస్తాడు.కనుక బెయిలు నిరాకరించాలి”అని ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఇదిలా ఉండగా రవిప్రకాష్ కు మద్దతుగా కొందరు జర్నలిస్టులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో రిలే నిరహారదీక్షలు ప్రారంభించారు. ”ఇటివలి కాలంలో రాజకీయ నాయకులు , పెట్టుబడిదారుల జోక్యంతో ప్రజల గొంతుకలను అణిచివేసే కుట్ర జరుగుతుంది. అందులో భాగంగా టీవీ9 వ్యవస్థాపకుడు, సిఇఓ రవిప్రకాష్ పై పెట్టిన కేసులే నిదర్శనం. రవిప్రకాష్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి” అని సీనియర్ జర్నలిస్టులు సతీష్ కమాల్, విజయకుమార్ అన్నారు.కార్యక్రమం లో జర్నలిస్టులు సంపత్ కుమార్,విద్యా వెంకట్,శ్రావణ్ కుమార్,గోపి యాదవ్,అమరెందర్, ప్రమోద్ ,భాగిలి సత్యం తదితరులు పాల్గొన్నారు.