ఉత్తం కు సూది మందు ఎక్కించండి.

ఆర్ఎంపి, పిఎంపి సదస్సులో ఎంపి కవిత.

 హైదరాబాద్:

సూది మందు తో జబ్బులను నయం చేసినట్లుగా ఉత్తంకుమార్ రెడ్డికి గులాబి సూది మందు వేయాలని ఆర్ఎంపి, పీఎంపి లను కోరారు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత. ఆంధ్రా నాయకుల తో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణకు ఎలా ప్రయోజనం చేకూరుస్తారో చెప్పాలన్నారు. అవసరమైతే ఉత్తం కు గులాబి రక్తం ఎక్కించి తెలంగాణ సోయిలోకి తీసుకురావాలన్నారు.సోమవారం హైదరాబాద్ లోని మాదాపూర్ లో తెలంగాణ ఆర్.ఎం.పి- పి.ఎం.పి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఎంపీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆర్ఎంపీ, పి.ఎం.పి సంఘాలకు మాత్రమే గుర్తింపునిచ్చారు.. తెలంగాణ ఆర్ఎంపీల సంఘాలకు గుర్తింపు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు.తెలంగాణ ఉద్యమంలో ఆర్ఎంపీలు, పిఎంపిలు క్రియాశీలకంగా పనిచేశారని అన్నారు. గ్రామాల్లో చిన్నపాటి జ్వరం వచ్చిన వైద్యం కోసం ఆర్ఎంపీల వద్దకే వెళ్తారన్నారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆర్.ఎం.పి పి.ఎం.పి లకు పారా మెడిక్ లుగా గుర్తింపునిచ్చేందుకు జీవోను జారీ చేసిందని వారికి శిక్షణ కూడా ఇచ్చేందుకు బడ్జెట్లో నిధులను కేటాయించిందని తెలిపారు. అయితే పోచమ్మ పొతం చేస్తే… మైసమ్మ మాయం చేసింది.. అన్నట్లుగా కొన్ని సంఘాలు కోర్టుకు వెళ్లాయని ఎంపీ కవిత తెలిపారు. వృత్తిపరమైన శిక్షణ ఇస్తున్న 6 సెంటర్లు కూడా మూతపడాలని వారు కోరుకున్నారని అయితే ముఖ్యమంత్రి ఆర్.ఎం.పి పి.ఎం.పి లకు అండగా నిలవడం ఆ కేసులు కొట్టేయడం జరిగింది అని ఎంపీ కవిత వివరించారు. ఆర్.ఎం.పి, పి.ఎం.పి లను కడుపులో పెట్టుకుంటామని వారికి ఇవ్వాల్సిన సర్టిఫికేషన్ కార్యక్రమం పూర్తయ్యేలా చూస్తామన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్.ఎం.పి పి.ఎం.పి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పగిడిపల్లి వెంకన్న, ప్రధాన కార్యదర్శి జి బాలరాజు, సలహాదారు బి. వెంకటేశ్వర్లు, పసునూరి సత్యనారాయణ, రవీంద్ర చారి తో పాటు 31 జిల్లాల సంఘం బాధ్యులు పాల్గొన్నారు.