ఉత్తర కర్ణాటక బంద్ ఫ్లాప్! ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కు మద్దతు కరవు.

బెంగళూరు:
ప్రత్యేక రాష్ట్ర్ర డిమాండ్ తో చేపట్టిన ఉత్తర కర్ణాటకలోని 13 జిల్లాల బంద్ ఫ్లాప్ అయింది. ఈ బంద్ కు ప్రజల నుంచి స్పందన కరువైంది. కొందరు బీజేపీ నేతలు లేవనెత్తిన ఈ డిమాండ్ ను నియంత్రించడంలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించింది. రాష్ట్ర్రం ముక్కలు కారాదంటూ ‘ఒక్కటే కర్ణాటక’ అని కొన్ని సంఘాలు ఇచ్చిన పిలుపుకు స్పందించిన ప్రజలు బంద్ కు మద్దతివ్వలేదు. హుబ్లీ-ధార్వాడ్, బెల్గాం, బీజాపూర్, బళ్లారి, గుల్బర్గాలలో కూడా బంద్ కు స్పందన కనిపించలేదు. అన్ని వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, రవాణా యధావిధిగా పనిచేశాయి.
ప్రత్యేక రాష్ట్ర్రం డిమాండ్‌తో ఆగస్టు 2న ఉత్తర కర్ణాటక బంద్‌కు ఆయా సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ఉత్తర కర్ణాటక బంద్ పాక్షికంగా జరిగింది. ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాజ్య హోరాట సమితి(యూకేపీఆర్‌హెచ్ఎస్) ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌పై కర్ణాటక సీఎం కుమారస్వామి స్పందించి.. ఉత్తర కర్ణాటకలోని బెళగావిని రాష్ట్ర్ర రెండో రాజధానిగా ప్రకటించే అంశం పరిశీలిస్తున్నట్టు చెప్పారు. దీంతో యూకేపీఆర్‌హెచ్ఎస్.. బంద్‌ను విరమించుకుంది.
కానీ ఉత్తర కర్ణాటక రైత సంఘ్ మాత్రం బంద్‌ను కొనసాగించింది. రైత సంఘ్‌కు పలు సంఘాలు మద్దతిచ్చినప్పటికీ బంద్ సఫలం కాలేదు. ఉత్తర కర్ణాటక బంద్ వెనుకాల బీజేపీ ఉందని కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. రాష్ర్టాన్ని విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూస్తున్నామని.. భవిష్యత్తులో కూడా కర్ణాటక సమైక్యంగా ఉంటుందని శివకుమార్ స్పష్టం చేశారు.