ఉస్మానియాలో ‘ఉష్ణోగ్రత’. రాహుల్ పర్యటన వివాదం. కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్.

‘వందేళ్ల ఉస్మానియా’ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ వ్యవహరించిన తీరు తెలంగాణ వాదుల్లో, తెలంగాణ ఉద్యమంతో ముడిపడిన వారిలో తీవ్ర అసంతృప్తిని, నిరాశా నిస్పృహలను కలిగించింది. ఆ వేడుకల్లో కేసీఆర్ కీలకోపన్యాసం చేస్తారని, వరాలు ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన సందేశాన్ని వినిపించకుండానే కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. సభ ఆద్యంతం ఆయన మౌనంగానే ఉన్నారు. సభవైపు తిరిగి కనీసం అభివాదం కూడా చేయలేదు.

ఎస్.కె.జకీర్.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి, ఉస్మానియా విద్యార్థులకు కీలక భాగస్వామ్యం ఉన్నది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తలపెట్టిన పర్యటనతో ఈ పరిస్థితులు కనిపిస్తున్నవి. న్ఉద్యమాలకు,విప్లవాలకు పురిటిగడ్డ ఉస్మానియాలో ‘ ఉష్ణోగ్రతలు’ పెరుగుతున్నవి. యూనివర్సిటీ క్యాంపస్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ పర్యటించడాన్ని కొందరు వ్యతిరేకించడం హాస్యాస్పదమని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ చెప్పారు. తెలంగాణలో విద్యారంగం, నిరుద్యోగ సమస్య గురించి విద్యార్థులతో రాహుల్ గాంధీ సమావేశమవుతారని ఉత్తమ్ స్పష్టం చేశారు.రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను ప్రజలంతా ఆహ్వానిస్తున్నారు.ఉస్మానియాకు చెందిన కొందరు టీఆరెస్ అనుకూల విద్యార్థులు రెండు రోజులుగా చేస్తున్న హడావుడిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిధి గజ్జెల కాంతం తప్పుబట్టారు. తెలంగాణలో 1200మంది విద్యార్థులు చనిపోతే రాహుల్ రాలేదంటూ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు.ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేలా రెచ్చగొట్టిందెవరో తెలుసుకోవాలని కాంతం అన్నారు.హరీష్ రావు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట తెచ్చుకోలేదు.’ఆ సమయంలో హరీష్ కు అగ్గిపెట్ట దొరకలేదా’? అని ఆయన ప్రశ్నించారు. పెట్రోల్ పోసుకొని ‘ఆత్మహత్య’ చేసుకునే విధంగా ఆనాడు హరీష్ రావు రెచ్చగొట్టారని గజ్జెల కాంతం ఆరోపించారు.హరీష్ ‘ప్రేరణ’తోనే శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని ఆత్మత్యాగం చేసాడని కాంతం అన్నారు.

‘చనిపోతేనే తెలంగాణ ఇస్తారు’ అని కేసీఆర్ కుటుంబం విద్యార్థులలో మానసికంగా భ్రమలు కల్పించినట్టు టిపిసిసి అధికారప్రతినిధి అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత ప్రాణ త్యాగాలకు చాలించిన తర్వాత సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గజ్జెల కాంతం తెలిపారు. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ కి వెళ్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారం లోకి వస్తుందనే ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు తెలియకుండా మాట్లాడితే ప్రజలు క్షమించరని ఆయన హెచ్చరించారు.కేసీఆర్ నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీల గురించి నిలదీయవలసి ఉందన్నారు. .ఇంటికి ఒక ఉద్యోగం,నిధులు,నీళ్లు అన్న కేసీఆర్ ను ప్రశ్నించాలని విద్యార్థులకు గజ్జెల కాంతం విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు,చేస్తున్న మోసాలను ప్రశ్నించడానికే రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ కి వస్తున్నారని టిపిసిసి అధికారప్రతినిధి గజ్జెల కాంతం తెలిపారు. మరో వైపు ఉస్మానియా యూనివర్సిటీకి రాకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని అడ్డుకుంటామని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. ఓయూలో రాహుల్ తలపెట్టిన యాత్రను జరుగనిచ్చే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పిన అనంతరమే ఓయూలో కాలుపెట్టాలని, లేనిపక్షంలో ఆయనకు స్వాగతం పలుకడానికి చెప్పులు, చీపుర్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేసినా ఎప్పుడూ ఓయూకు రాని రాహుల్ ఇప్పుడు ఎందుకు వస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. పదేండ్లు అధికారంలో ఉండి ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల పెంపుపై స్పందించని ఆయన ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓయూకు వస్తున్నారని నిలదీశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్య, ఉద్యోగ అంశాల్లో ఎంతో నష్టపోయిన విద్యార్థులు,ఇప్పుడు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న తరుణంలో రాజకీయాల కోసం అలజడి సృష్టించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. రాహుల్ ఓయూకు రావాలని ఓయూ విద్యార్థులు కోరుకోవడం లేదని పేర్కొన్నారు. ఓయూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కందుల మధు, మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మంద సురేశ్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండారి వీరబాబు, బీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకట్, మాదిగ జేఏసీ నాయకులు వడ్డె ఎల్లన్న, రామగళ్ల సుందర్, వేల్పుకొండ వెంకటేశ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘం నాయకుడు దాసరి రవిప్రసాద్, బీసీ విద్యార్థి సంఘం నేతలు కొక్కుల రాజు, నెమ్మాది రవి, లంబాడీ విద్యార్థి సంఘం నాయకుడు బానోత్ వెంకటేశ్, దళిత్ వారియర్స్ నేత చిర్రా మహేందర్, ముస్లిం జేఏసీ నాయకుడు షేక్ రహీం, విద్యార్థి నాయకులు తిరుమనపల్లి ప్రశాంత్, సురేశ్, గణేశ్, యాకూబ్, వేల్పుకొండ రామకృష్ణ, నల్లా విజయ్, హరి, రాజు తదితరులంతా రాహుల్ గాంధీ ఉస్మానియా పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. ఉస్మానియా విద్యార్ధులు ఢిల్లీలో రాహుల్ గాంధీ, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, ప్రతినిధులు అద్దంకి దయాకర్‌, శ్రావణ్‌లతో కలిసి కొద్దీ రోజుల క్రితం భేటీ అయ్యారు. ఉస్మానియాలో ‘విద్యార్ధి ఆత్మగౌరవ సభ’కు హాజరుకావాలని వారు రాహుల్ గాంధీని ఆహ్వానించగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ”తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో పోరాడి రాష్ట్రాన్ని సాధించిన వారిలో మొదటి పాత్ర మీదే. అదే విధంగా ప్రజా సమస్యలపై కూడా పోరాడండి. తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంకుశత్వాన్ని ఇక ఎంతమాత్రం సహించవద్దు. కేసీఆర్ లో నిరంకుశత్వ లక్షణాలు ఎక్కువ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డా కూడా ఇంకా కష్టాలేనా? ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థుల గోడే కేసీఆర్ కు పట్టడం లేదా?” అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలను పక్కనబెడితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో విడిగా ఇంతవరకు సమావేశం కాలేదన్న నింద ఉన్నది.

‘వందేళ్ల ఉస్మానియా’ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ వ్యవహరించిన తీరు తెలంగాణ వాదుల్లో, తెలంగాణ ఉద్యమంతో ముడిపడిన వారిలో తీవ్ర అసంతృప్తిని, నిరాశా నిస్పృహలను కలిగించింది. ఆ వేడుకల్లో కేసీఆర్ కీలకోపన్యాసం చేస్తారని, వరాలు ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన సందేశాన్ని వినిపించకుండానే కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. సభ ఆద్యంతం ఆయన మౌనంగానే ఉన్నారు. సభవైపు తిరిగి కనీసం అభివాదం కూడా చేయలేదు. రాష్ట్రపతికి శాలువా కప్పి సన్మానించే సమయంలో అన్ని ఎల్‌ఈడీల్లో ఆ విజువల్స్‌ ప్రసారం చేశారు. కానీ, కేసీఆర్‌కు శాలువా కప్పేటప్పుడు మాత్రం ఆ విజువల్స్‌ను ఎల్‌ఈడీల్లో చూపలేదు. ఇందుకు కారణం ప్రభుత్వ తీరుపై విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసంగాలు వద్దని నిఘా విభాగం సమాచారం ఇవ్వడమేనాని అప్పట్లో ప్రచారం సాగింది. అందుకే వ్యూహాత్మకంగా ఆ సభలో కేసీఆర్ ప్రసంగించలేదని సమాచారం. ఉత్సవాల కమిటీ చైర్మనన్ కె.కేశవరావు, దత్తాత్రేయ, ఆ తర్వాత సీఎం కేసీఆర్‌, అటు పిమ్మట గవర్నర్‌ నరసింహన్ ప్రసంగిస్తారని షెడ్యూల్‌ ఖరారు చేశారు. మొత్తం సభ గంటపాటు ఉంటుందని ప్రకటించారు.యూనివర్సిటీ వీసీ రెండు నిమిషాలపాటు ప్రారంభోపన్యాసం చేశారు. ఆ వెంటనే రాష్ట్రపతి 15 నిమిషాలపాటు మాట్లాడారు. చివర్లో రిజిస్ట్రార్ ధన్యవాదాలు తెలిపి సభను ముగించారు. మొత్తం కార్యక్రమాన్ని 30 నిమిషాల్లోనే ముగించారు. ఇంటెలిజెన్స్ అధికారుల సూచనల మేరకే పోలీసులు అప్రమత్తమై మొత్తం షెడ్యూల్‌ని కుదించారు.