ఎంజె అక్బర్ రాజీనామా!!

న్యూఢిల్లీ:
తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో కేంద్ర మంత్రి ఎంజె అక్బర్‌ తన పదవికి రాజీనామా చేయాలని యోచిస్తున్నారు. ఆరుగురు మహిళా జర్నలిస్టులు అక్బర్‌ తమను లైంగికంగా వేధించారని ఆరోపించారు. దేశంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా వారు సోషల్ మీడియా వేదికగా ఎంజె అక్బర్‌పై ఆరోపణలు సంధించారు. మాజీ సంపాదకుడు, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో విదేశాంగశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఎంజె అక్బర్‌ మహాత్మాగాంధీ 150వ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నైజీరియాలోని లాగోస్‌కు వెళ్లారు. తన పర్యటనను కుదించుకుని వచ్చి పదవికి రాజీనామా చేయాల్సిందిగా అక్బర్‌ను ఆదేశించారనే వార్తల్లో నిజం లేదని విశ్వసనీయ వర్గాల కథనం. విదేశాల నుంచి తిరిగి వచ్చాక ఆయన వివరణను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అక్బర్‌పై ఎఫ్ఐఆర్‌ నమోదు కాలేదని, కనీసం ఫిర్యాదు కూడా లేదని తెలిసింది. నైతికత దృష్ట్యా అక్బర్‌ రాజీనామా గురించి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అక్బర్ పై వచ్చిన ఆరోపణలపై స్పందించేందుకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్
నిరాకరించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఆయన తనపై వచ్చిన ఆరోపణలు అసత్యాలని రుజువు చేసుకోవాలి లేదా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. అక్బర్ కి వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం మౌనం వహించడాన్ని సీపీఎం ప్రశ్నిస్తోంది.