ఎంసెట్ -2 2016 నా అనుభవం.

వరంగల్‌;
సరిగ్గా అదీ జూలై 18వ తేది ఉదయం 10 గంటలు అవుతోంది. పరకాలలో ఉండే నా మిత్రుడు ప్రసాద్‌ నుంచి నాకు కాల్‌ వచ్చింది. అన్నా, నాకు తెలిసిన వాళ్లు మిమ్మల్ని కలుస్తారని చెప్పాడు. ఎక్కడికి రావాలని అడిగారు. నేను హన్మకొండ ప్రెస్‌క్లబ్‌ దగ్గర ఉంటాను. అక్కడికి రమ్మని చెప్పాను. వాళ్లు 12 గంటల వరకు వచ్చారు. నేను వచ్చే సమయం కొంచెం ఆలస్యం అయ్యింది. నేను వచ్చే వరకు కొందరు జర్నలిస్టు మిత్రులు వచ్చిన వారిని ఏం కావాలని అడిగారు. పెద్ద పత్రికల వాళ్లు అడిగిన వారిలో ఉన్నారు. పరకాలకు చెందిన గుండెబోయిన రవి దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. అతని కుమార్తె ఇంటర్‌ పూర్తి చేసి మెడిసిన్‌లో సీటు కొసం విజయవాడలో కోచింగ్‌ తీసుకుంది. నేను వచ్చే వరకు రవి అందరికీ ఎంసెట్‌ -2లో లీకేజీ జరిగిందని చెప్పాడు. తన వెంట తెచ్చుకున్న ఆధారాలను వారికి చూపాడు రవి. సహచర జర్నలిస్టు మిత్రులు రవి మాటలను విశ్వసించలేదు. వారు ఆధారాలను పరిగణలోకి తీసుకొలేదు. రాష్ట్రంలో రెండు లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం కావడంతో వారు ఆ దిశగా అడుగువేయలేదు. 12 గంటల తర్వాత నేను ప్రెస్‌క్లబ్‌లోకి వచ్చిన తర్వాత నాతోని రవి మాట్లాడుతున్న సమయంలో కూడా జర్నలిస్టు మిత్రులు వచ్చి విన్నారు. అయినా వారు ఎంసెట్‌లో జరిగిన తతంగంపై దృష్టి పెట్టలేదు. రవి ఇచ్చిన ప్రాథమిక సమాచారాన్ని తీసుకొని ఇంటర్నెట్‌ సహయంతో ఎంసెట్‌ 1, ఎంసెట్‌ ఏపీ, ఎంసెట్‌ -2 తెలంగాణ సైట్ల నుంచి విద్యార్థులకు వచ్చిన ర్యాంకులను ప్రింట్‌ తీసుకొని పరిశీలించాను. సమస్య ఏంటంటే పరకాలకు చెందిన 20 మంది వరకు విద్యార్థినీలు విజయవాడ కోచింగ్‌ సెంటర్‌లో ఎంసెట్‌ షార్ట్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకున్నారు. అందులో రవి కుమార్తె కూడా ఉంది. అయితే రవి కుమార్తె ముందు నుంచి చదువులో దిట్ట .కోచింగ్‌ సెంటర్‌లో నిర్వహించిన పరీక్షల్లో కూడా ఆమె మెరిట్‌ కనబరిచేది. తనతో ఉన్న వారి కంటే బాగానే ర్యాంకులను సాధించింది. ఏపీ ఎంసెట్‌ నిర్వహించిన ఎంట్రెన్సు పరీక్షలో కోచింగ్‌ తీసుకున్న విద్యార్థులకు 15 వేల నుంచి 24 వేల ర్యాంకులు వచ్చాయి. ఈ ఏపీ ఎంసెట్‌ ఎంట్రెన్స అయిపోగానే, తెలంగాణ నిర్వహించిన ఎంట్రెన్సులో కూడా అదే తరహాలో వేల సంఖ్యలో ర్యాంకులు వచ్చాయి. రవి కుమార్తెకు మాత్రం 2వేల పైన ర్యాంకులు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ ఎంసెట్‌ -2 పరీక్షలో గతంలో వేల సంఖ్యలో ర్యాంకులు వచ్చిన పరకాలకు చెందిన వారికి టీఎస్‌ ఎంసెట్‌-2లో మాత్రం 100 నుంచి 500 లోపు ర్యాంకులు వచ్చాయి. నెల రోజుల వ్యవధిలో వేల సంఖ్య నుంచి వందలకు మారడం ఏలా సాధ్యమంటూ రవికి అనుమానం వచ్చింది. ఆ అనుమానంతో నన్ను సంప్రదించాడు. నేను మూడు పరీక్షలకు సంబంధించిన స్కోర్‌ కార్డులను పరిశీలించాను. రవి ఈలోపల విజయవాడ కోచింగ్‌ సెంటర్‌ వారిని సంప్రదించి అక్కడ వచ్చిన ఇంటర్నల్‌ స్కోర్‌, హజరు పట్టీకలను తెప్పించాడు. వాట్సప్‌లో వచ్చిన షీట్లను ప్రింట్‌ తీసి పరిశీలిస్తే వారి ప్రతిభలో చాలా తేడాలు స్పష్టంగా కనిపించాయి. ఇదిలా ఉంటే ఎంసెట్‌ -2 పరీక్షకు వారం రోజుల ముందే కొందరు విద్యార్థులు కోచింగ్‌ సెంటర్‌ నుంచి వెళ్లిపోయారు. కీలకమైన పరీక్షా సమయంలో ఎందుకు వెళ్లారు, ఎటూ వెళ్లారని కూపీ లాగితేనే ఒక రహస్య ప్రాంతానికి వెళ్లినట్టు తెలిసింది. అలా మొదలైన ఎంసెట్‌ -2 లీకేజీ డొంకపై హైదరాబాద్‌లోని నెట్‌వర్కు ఇన్‌చార్జ్‌ గారికి సమాచారం అందించగా ఎంసెట్‌ లీకేజీ అంటూ జూలై 19న మొదటి పేజీలో వచ్చింది. అయితే అంతకుముందు రాత్రి నన్ను పదే పదే హైదరబాద్‌ నుంచి అడిగారు. చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అన్నీ కరెక్టేనా అని అడిగారు. అన్నీ కరెక్టే సర్‌, మీరు ఆలోచించకండీ సర్‌ అని చెప్పాను. నాపై నమ్మకంతో ముందుకు వెళ్లారు. ఆ రాత్రి సమయంలో బాధితుడు రవి తోనూ హైదరాబాద్‌ నుంచి సెంట్రల్‌ డెస్కు వాళ్లు మాట్లాడారు. మరోసారి నిర్థారించుకున్న తర్వాత ప్రింట్‌ చేశారు.అయితే ఊహించని విధంగా ఈ స్కాంలో పెద్ద పాత్రలు ఉండడం, దేశ వ్యాప్తంగా నెట్‌వర్కు ఉండడం, మాఫీయా ప్రమేయం ఉండడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సీఐడీ విచారణకు ఆదేశించింది. వరంగల్ నుంచి మొదలైన విచారణలో మరో మలుపు తిరిగింది. ఎవరైతే బాధితులుగా ఉన్నారో వారిని ట్రాప్‌ చేసి బేరాలు ఆడడంతో సీఐడీ డిఎస్పీ అవినీతి నిరోధక శాఖలో ఉచ్చులో పడకతప్పలేదు. ఓ స్కాంను బయటకు తీసేందుకు సైతం డబ్బులకు ఆశపడడం, వారిని వేధించడంతో చివరకు ఆయనకు సస్పెన్షన్‌ తప్పలేదు. ఇదిలా ఉంటే ఏ1గా ఉన్న నిందితుడు పోలీస్‌ కస్టడీలో మృతి చెందడంతో కేసు ఆగిపోతుందని అనుకున్నారు. రెండేళ్ల తర్వాత మరోసారి సీఐడీ అధికారులు రెండు ప్రముఖ కాలేజీలకు చెందిన వారిని అరెస్టు చేయడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అందుకే నా అనుభవాన్ని ఇలా మీతో పంచుకున్నాను.

అనిల్‌ కుమార్‌ కక్కెర్ల, వరంగల్‌.