ఎంహెచ్370 ప్రమాదం వెనుక కుట్ర? నాలుగేళ్లుగా శకలాలు కూడా జాడ లేని విమానం.

కౌలాలంపూర్ :
నాలుగున్నరేళ్ల క్రితం అదృశ్యమైన మలేషియా ఎయిర్ లైన్స్ కు చెందిన ఎంహెచ్-370 ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియలేదని దర్యాప్తు అధికారులు చెప్పారు. ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. విమానంలోని కంట్రోల్స్ ని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసి ఉండొచ్చని ఇవాళ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. విమానం ఎగిరాక దానిని దారి తప్పించేందుకు కొందరు బోయింగ్ 777లోని కంట్రోల్స్ ని పాడు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే దీనికి ఎవరు కారకులో చెప్పలేమని తెలిపారు. విమాన శకలాలు దొరికితే తప్ప ఆ రోజు ఏం జరిగిందో కచ్చితంగా చెప్పలేమని ఎంహెచ్-370 ప్రమాద దర్యాప్తు అధికారి కోక్ సూ చోన్ చెప్పారు. ఎంహెచ్370లోని ట్రాన్స్ పాండర్ ని కావాలని ఎవరో స్విచాఫ్ చేసి హిందూ మహాసముద్రంలోకి మళ్లించారని నిపుణులు భావిస్తున్నారు. విమాన పైలెట్, ఫస్ట్ ఆఫీసర్ నేపథ్యం పరిశీలించిన అధికారులు వారిద్దరి నైపుణ్యం, మానసిక స్థితి బాగున్నాయని చెప్పారు. ఈ ప్రమాదానికి వాళ్లిద్దరూ కారకులు కారని తేల్చారు. విమానం ప్రయాణిస్తుండగా వెనక్కి తిరగడం మాన్యువల్ గా జరిగిందని, లోపలి అన్ని వ్యవస్థలను మాన్యువల్ గా ఆఫ్ చేశారని గుర్తించారు. ఎవరైనా అగంతకులు చొరబడి అలా చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు తెలిపారు. 15 దేశాలకు చెందిన ప్రయాణికుల నేపథ్యం కూడా బాగున్నట్టు చెప్పారు. గత మే 29న మలేసియా ఈ విమానం ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలన్నిటిని నిలిపేసింది. అనేక మిలియన్ డాలర్ల వ్యయంతో దక్షిణ హిందూ మహా సముద్రంలో అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, మలేసియా దేశాలు లక్షలాది చదరపు కిలోమీటర్లలో నెలల తరబడి అన్వేషించినా ఫలితం లేకపోయింది. మార్చి 8, 2014న 239 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కి బయల్దేరిన విమానం హఠాత్తుగా మాయమైంది. ప్రపంచ విమానయాన చరిత్రలోనే ఇది పరిష్కారం కాని మిస్టరీగా మిగిలింది.