ఎనిమిదేళ్ల అత్యధిక స్థాయిలో ఐటీ రిక్రూట్ మెంట్లు

భారత టెక్నాలజీ రంగం తమకు అవసరమైన నైపుణ్యాలు లేని ఉద్యోగులను వదుల్చుకుంటోంది. అయితే సరైన నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులను మాత్రం కంపెనీలు పెద్ద సంఖ్యలో నియమిస్తున్నాయి. భారత అత్యున్నత ఐటీ కంపెనీల నియామకాల తీరు దీనినే ప్రతిఫలిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో తగ్గుముఖం పట్టిన ఐటీ నియామకాలు ఈ ఏడాది భారీగా పుంజుకున్నాయి. టాప్ 4 ఐటీ కంపెనీల నికర నియామకాలు ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరాయి. ఈ నాలుగు కంపెనీలు మొత్తం 78,500 రిక్రూట్ మెంట్లు చేశాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్ సిఎల్ టెక్నాలజీస్ పెద్ద ఎత్తున నియామకాలు జరిపాయి.

ఆర్థిక సంవత్సరం 2012లో ఈ కంపెనీలు 81,722 మంది ఉద్యోగులను నియమించాయి. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరం 2013 నుంచి 2018 వరకు ప్రతి ఏడాది ఈ నియామకాల సంఖ్య 70,000కి దిగువనే ఉంటూ వచ్చింది. మార్చి 2019 చివరికి ఈ నాలుగు కంపెనీల మొత్తం ఉద్యోగుల సంఖ్య 9.6 లక్షలుగా ఉంది. ఏడాది క్రితంతో పోలిస్తే 8.9 శాతం ఎక్కువ. ఈ మొత్తంలో 44 శాతం టీసీఎస్ ఉద్యోగులు కాగా, ఇన్ఫోసిస్ 23.7 శాతం ఉద్యోగులతో రెండో స్థానంలో ఉంది. విప్రో 17.8 శాతం, హెచ్ సిఎల్ టెక్నాలజీస్ 14.3 శాతం ఉద్యోగులు ఉన్నారు.