ఎన్నికల జాబితాపై హైకోర్టు స్టే !!

హైదరాబాద్:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ఓటర్ల జాబితా ఆటంకం కలిగించనుంది. ఓటర్ల జాబితా అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై ఉమ్మడి హైకోర్టు శుక్రవారం విచారణ ప్రారంభించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చుతూ.. శుక్రవారమే పిటిషన్‌లు దాఖలు చేయాలని ఫిటిషనర్‌లకు సూచించింది. సుప్రీంకోర్టు కాపీ అందడంతో ఉమ్మడి హైకోర్టు విచారణను ప్రారంభించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది ఎన్నికల జాబితాపై స్టే విధించింది. అంతేకాకుండా ఈ నెల 8 వరకు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వరాదని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల జాబితా, నోటిఫికేషన్ రిట్‌ ఫిటిషన్‌కు లోబడి ప్రకటించాలని సూచించింది. తుదిజాబితాను ఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టకూడదని, మొదటగా డ్రాఫ్ట్‌ కాపీని ఫిటిషనర్లకు, హైకోర్టుకు అందించాలని తెలిపింది. ఈనెల 8న కౌంటర్‌ దాఖలు చేయాలని ఈసీకి ఆదేశాలు జారీచేస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఓటర్ల జాబితా అవకతవకలపై మొత్తం నాలుగు పిటిషన్లు దాఖలు కాగా న్యాయస్థానం రెండు పిటిషన్లను కొట్టేసింది. ఓటర్ల జాబితాలో 70 లక్షల ఓట్ల మేరకు అవకతవకలు ఉన్నాయని, సార్వత్రిక ఎన్నికల కోసం ముందుగా ప్రకటించిన ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌నే అమలు చేయాలని కోరుతూ టీపీసీసీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీం ధర్మాసనం హైకోర్టులో తేల్చుకోవాలని సూచించండంతో శుక్రవారం ఉమ్మడి హైకోర్టు విచారణ చేపట్టింది.