ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదుల మృతి

శ్రీ నగర్;
భద్రతా బలగాలు మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఎన్‌కౌంటర్ ప్రాంతం సమీపంలో కొందమంది భద్రతా దళాలపై రాళ్లురువ్వడంతో తలెత్తిన ఘర్షణల్లో పెల్లెట్ గాయాలతో ఒక యువకుడు కూడా మృతి చెందాడు.
అంతకుముందు, ఉగ్రవాదుల కదలికల సమాచారం అందడంతో భద్రతా బలగాలు తుమ్నా గ్రామాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి. ఒక ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కుకున్నట్టు గుర్తించాయి. అయితే ఆ ఇంట్లో కొందరు జనం కూడా ఉడటంతో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో జాప్యం చోటుచేసుకుంది. అక్కడ్నించి పౌరులను తరలించిన తర్వాత భద్రతా బలగాలకూ, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయని, ముగ్గురు ఉగ్రవాదులనూ బలగాలు మట్టుబెట్టాయని అధికారులు తెలిపారు. మరోవైపు, ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్‌లో ఉన్న భద్రతా బలగాలపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వడంతో బలగాలు వారిని అడ్డుకున్నాయి. ఈ ఘర్షణలో ఐదుగురు వ్యక్తులు పెల్లెట్లు తగిలి గాయపడ్డారు. వీరిలో 16 ఏళ్ల ఫైజాన్ అహ్మద్ ఖాన్ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందతూ కన్నుమూసినట్టు పోలీసు అధికారి ఒకరు చెప్పారు.