‘ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్’ లో హిందూ భోజనం ఉండదు.

దుబాయి:
దుబాయికి చెందిన పెద్ద విమానసంస్థల్లో ఒకటైన ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ లో ఇకపై హిందూ భోజనం దొరకదు. ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు అందించే భోజనం మెనూ నుంచి హిందూ మీల్ తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. ప్రయాణికుల నుంచి వచ్చిన సలహాలు, సూచనల మేరకు హిందూ మీల్ తొలగించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. అయితే ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ యాత్రికులకు మాత్రం ఇక ముందు కూడా ఈ భోజనం అందించనున్నారు. హిందూ ప్రయాణికులకు ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ పూర్తి శాకాహార భోజనమైన ఆసియా వెజ్ మీల్, హిందూ మీల్ అనే రెండు రకాల భోజనాలు అందిస్తుంది. హిందూ మీల్ లో ఒక్క బీఫ్ తప్ప మాంసం, చేపలు, గుడ్లు, పాల పదార్థాలు వంటివి ఉంటాయి. ఎకానమీ క్లాస్ లో ప్రయాణించే హిందూ ప్రయాణికులు ఆయా ప్రాంతాల్లో శాకాహార భోజన తయారీ కేంద్రాల నుంచి తమ భోజనాన్ని ముందుగా బుక్ చేసుకోవచ్చని సూచించింది. తాము అలా తెచ్చుకొన్న ఆహారాన్ని విమానంలో తినేందుకు అనుమతిస్తామని తెలిపింది.
హిందూ మీల్, జైన్ మీల్, భారతీయ శాకాహార భోజనం, కోషర్ మీల్, పశు మాంసం లేని మాంసాహారం వంటి అనేక రకాల భోజనాలను చాలా విమానయాన సంస్థలు అందిస్తాయి. కొన్ని అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణికుల మత విశ్వాసాలకు అనుగుణంగా భోజనం బుక్ చేసుకొనే వీలుంటుంది. ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రత్యేకంగా మత విశ్వాసాలకు అనుగుణంగా భోజనం అందజేస్తాయి. టికెట్ బుక్ చేసేటపుడే తమకి ఇష్టమైన భోజనం ఏదో చెబితే ప్రయాణంలో దానిని అందజేస్తారు.